పవన్ ఢిల్లీ ప్రయాణం.. జీహెచ్ఎంసీ కోసమా ?? తిరుపతి కోసమా ??

By Krishna Babu Nov. 22, 2020, 09:52 pm IST
పవన్ ఢిల్లీ ప్రయాణం.. జీహెచ్ఎంసీ కోసమా ?? తిరుపతి కోసమా ??

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి రేపు సాయంత్రం 5:30 నిమషాలకు హస్తిన పర్యటనకు బయలుదేరుతున్నారు. ఓవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సాగుతున్న తరుణంలో ఆయన పర్యటన ఆసక్తి రేపుతోంది. తిరుపతి ఉప ఎన్నికలకు అంతా సన్నద్ధమవుతున్న తరుణంలో జనసేనాని ఎవరితో కలుస్తారన్నది చర్చనీయాంశం అవుతోంది.

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన చేతులెత్తేసింది. భేషరతుగా మద్ధతు ప్రకటించింది. తాము పోటీ చేయబోతున్నట్టు తొలుత హంగామా చేసినా చివరకు పోటీ నుంచి తప్పుకుంది. బీజేపీ గెలుపుకోసం కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏకపక్షంగా బీజేపీకి మద్ధతు ప్రకటించిన తీరు పలువురు జనసైనికులను నిరాశకు గురిచేసింది. ఎంతో ఉత్సాహంగా పోటీకి సిద్ధపడి, కొందరు నామినేషన్లు కూడా వేసిన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది తలలు పట్టుకున్నారు. పవన్ ని నమ్ముకుంటే తమ పని ఇంతేనంటూ కొందరు వ్యాఖ్యానాలు కూడా చేశారు.

ఇక తదుపరి వంతు తిరుపతి ఉప ఎన్నికలదవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో బీజేపీకి అండగా ఉంటామని తేల్చేసిన పవన్ నుంచి తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా అదే రీతిలో మద్ధతుని బీజేపీ ఆశిస్తోంది. ఆంధ్రాలో కొందరు సెటిలర్లు, పవన్ ఫ్యాన్స్ ఓట్లను ఆశించినట్టే తిరుపతిలో పవన్ సామాజికవర్గీయుల బలం కొంత ఉంది. బలిజ ఓటర్లను ఆకట్టుకునేందుకు పవన్ ఉపయోగపడతారని బీజేపీ భావిస్తోంది. దానికి తగ్గట్టుగా తిరుపతిలో కూడా బీజేపీ అభ్యర్థికి మద్ధతు పలకాలని కోరుతోంది. దానికి అనుగుణంగానే సుదీర్ఘకాలం తర్వాత హస్తినలో పవన్ కి అమిత్ షా వంటి వారి మోక్షం ఖాయంగా కనిపిస్తోంది.

2014 ఎన్నికలకు ముందు మోడీతో పవన్ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్ధతుగా నిలిచింది. మోడీ ఎన్నికల సభల్లో కూడా పాల్గొని పవన్ ఆనాడు బీజేపీకి ప్రచారం చేశారు. చివరకు విజయం సాధించిన తర్వాత పవన్ ని పట్టించుకోలేదని ఆయనే వాపోయారు. బహిరంగంగానే తన ఆవేదనను వెళ్లగక్కారు. అమిత్ షా తన పార్టీని విలీనం చేయమన్నారు. మోడీ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని పలు సభల్లో చెప్పుకున్నారు. కానీ తీరా 2019 ఎన్నికల్లో బీజేపీని వ్యతిరేకించినా ఫలితాలు గూబ గుయ్ మనిపించడంతో బీజేపీ కీలక నేతల దర్శనం లేకుండానే వారికి జై కొట్టేశారు. ఢిల్లీలో కేవలం జేపీ నడ్డాతో భేటీ అయిన తర్వాతే తాను బీజేపీకి మద్ధతు పలుకుతున్నట్టు ప్రకటించారు. కనీసం అమిత్ షా- మోడీ తో భేటీ అయ్యే అవకాశం కూడా ఆనాడు పవన్ కళ్యాణ్‌ కి దక్కకపోవడం విశేషం.

ఇక తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో కూడా బండి సంజయ్ వచ్చి తమను కలుస్తున్నారని జనసేన చెప్పుకున్నప్పటికీ చివరకు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తోనే సరిపెట్టుకుంది. ఇక ప్రస్తుతం తిరుపతిలో బీజేపీకి జనసేన మద్ధతు అవసరం కాబట్టి ఈసారి అమిత్ షాని కలిసేందుకు అవకాశం దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు తిరుపతిలో మకాం వేశారు. ఆపార్టీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అద్దె ఇళ్ళు తీసుకుని వ్యవహారం చక్కదిద్దుతున్నారు. రేపు సోము వీర్రాజు తిరుపతిలో మరోసారి పర్యటించబోతున్నారు. ఇప్పటికే విష్ణు వర్థన్ రెడ్డి అక్కడే తాత్కాలిక ఏర్పాట్లు చేసుకున్నారు. అదే పరంపరలో పవన్ ని ముందు పెట్టి తిరుపతి ఎన్నికల్లో తలబడాలని ఆశిస్తున్న బీజేపీ నేతలు ఢిల్లీలో పవన్ కి ఎలాంటి ఆఫర్ ఇస్తారన్నది ఆసక్తికరమే. జనసేన దాదాపుగా బీజేపీకి మద్ధతు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో పెద్దగా ఫలితాలు రాకపోయినా పవన్ నుంచి సానుకూలత ఖాయమనే అంచనాలో బీజేపీ ఉంది. దాంతో పవన్ ఢిల్లీ పర్యటనలో తిరుపతి గురించి చేయబోతున్న ప్రకటన ఊహాజనితమే అయినా ఎవరెవరు పవన్ కి దర్శనం కల్పిస్తారో చూడాల్సి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp