తోట త్రిమూర్తులు రాకతో మండపేటలో డీలా పడిన జనసేన

By Jaswanth.T Jun. 18, 2021, 09:32 pm IST
తోట త్రిమూర్తులు రాకతో మండపేటలో డీలా పడిన జనసేన

ఒకప్పుడు టీడీపీకి, ఇప్పుడు వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా చెప్పుకునే మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ కన్వీనర్‌గా ఉన్న వేగుళ్ళ లీలాకృష్ణ రాజకీయ భవిష్యత్తుపై బెంగలో ఉన్నారని ఆ నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చురుకైన రాజకీయాలతో ప్రజల్లో తనదైన ముద్ర వేసిన లీలా కృష్ణ ప్రస్తుతం నెమ్మదించడంతో ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయని మరికొందరు అంటున్నారు.

వైఎస్సార్‌సీపీ ఆవిర్భావంలో ఆ పార్టీ మండపేట కో ఆర్డినేటర్‌గా పనిచేసిన లీలా కృష్ణ తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీలోకి మారారు. ఆ పార్టీ నుంచి 2019లో పోటీ చేసి 35,173 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వల్లూరు సొంత గ్రామమైన లీలాకృష్ణ అక్కడి సహకార సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన లీలా కృష్ణకు సీటు కేటాయింపు దగ్గరకొచ్చేసరికి అదృష్టం కలిసి వచ్చేది కాదని చెబుతారు. దీంతో జనసేన గుమ్మంతొక్కాల్సి వచ్చిందని ఆయన వర్గం చెబుతుంది. అయినప్పటికీ విజయం మాత్రం వరించలేదు.

2019 సాధారణ ఎన్నికల అనంతరం తోట త్రిమూర్తులు వైఎస్సార్‌సీపీలో వచ్చారు. ఇటీవలే ఆయనకు గవర్నర్‌కోటాలో ఎమ్మెల్సీ పదవి సైతం దక్కింది. కో ఆర్డినేటర్‌గా వచ్చిన తోట మండపేట నియోజకవర్గంలో జనసేన కేడర్‌ను తనవైపు తిప్పుకోవడంలో పూర్తిస్థాయిలో సఫలీకృతమయ్యారనే చెబుతారు. దీని ఫలితంగానే దాదాపు 30 ఏళ్ళ తరువాత మండపేట మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిని కూర్చోబెట్టడం, అత్యధిక గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే గెలుపొందారనడం వాస్తవం.

వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా జనసేన జెండా, పవన్‌ కళ్యాణ్‌లతో ముందుకు నడిచేద్దాం అనుకుంటున్న లీలా కృష్ణకు ప్రస్తుతం తోటత్రిమూర్తులు రూపంలో భారీ హార్డిల్‌ ఎదురైందని చెప్పాలి. మండపేట నియోజకవర్గం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో జనసేన కేడర్‌ను వైఎస్సార్‌సీపీవైపు ఆకర్షించడంలో తోట మార్కు రాజకీయ వ్యూహం పనిచేసింది. ఈ నేపథ్యంలో జనసేనలో కొనసాగడంపై లీలాకృష్ణ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ప్రస్తుతం నియోజకవర్గంలోని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే సొంత వ్యాపారాలపైనే ఎక్కువ సమయం కేటాయిస్తున్న లీలాకృష్ణ అదే కంటిన్యూ చేస్తారా? లేక మరోసారి జనసేన పార్టీని నమ్ముకుని రాజకీయాలు కొనసాగిస్తారా? అన్నది కాలమే తేల్చాల్సి ఉంది.

Also Read : పాదయాత్రలో వైఎస్‌కు వైద్యం చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బిక్కిన ఇప్పుడు ఏంచేస్తున్నారు..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp