ఉమ్మ‌డిగానా.. వేర్వేరుగానా..?

By Kalyan.S Oct. 24, 2020, 09:10 am IST
ఉమ్మ‌డిగానా.. వేర్వేరుగానా..?

'రెండు పార్టీలూ కలిసి నేతల నుంచి కార్యకర్తల వరకూ ఎలాంటి విభేదాలు లేకుండా దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప‌నిచేస్తాం.. అన్ని అంశాల‌లోనూ ఉమ్మ‌డిగా పోరాడ‌తాం..' ప‌లు సంద‌ర్భాల్లో బీజేపీ - జ‌న‌సేన నేత‌లు చెప్పిన మాట‌లు ఇవీ. ఒక‌టి, రెండు సార్లు అంత‌ర్గ‌త స‌మావేశాలు తెప్పా.. ఏ విష‌యంలోనూ ఆ రెండు పార్టీలు క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కూ పోరాడిన సంద‌ర్భాలు లేవు. దేవాల‌యాల‌పై దాడుల విష‌యంలో మాత్రం ఒక్క‌టిగా క‌దిలిన‌ట్లు క‌నిపించినా.. జ‌నాల్లోకి బ‌లంగా వెళ్ల‌లేదు. దీంతో పార్టీ శ్రేణులు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నాయి. స్థానికంగా ఎలా ముందుకెళ్లాలో తెలియ‌క తిమ‌క‌మ‌క ప‌డుతున్నాయి. చివ‌ర‌కు మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారంలో కూడా ఇద్ద‌రు నేత‌లూ వేర్వేరు ప్ర‌క‌ట‌న‌లు ఇస్తుండ‌డం మ‌రింత గంద‌ర‌గోళానికి గురి చేస్తోంది.

మేమేం చేయాలి..?

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అడ‌పాద‌డ‌పా ఏపీ స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూనే ఉన్నారు. అధ్య‌క్షుడిగా ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే సోము ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రూ మీడియాతో మాట్లాడుతూ భ‌విష్య‌త్ లో క‌లిసి న‌డుస్తామ‌ని చెప్పారు. అంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎక్క‌డా వేదిక పంచుకున్న దాఖ‌లాలు అంత‌గా లేవు. ఈ ప‌రిణామాల‌న్నీ ఇరు పార్టీ శ్రేణుల‌ను గంద‌ర‌గోళంలోకి నెడుతున్నాయి. ఏదైనా స‌మ‌స్య‌కు సంబంధించి విడివిడిగా స్పందించాలా..? ఒక‌రికొక‌రు క‌ల‌వ‌లా..? అనే సందేహం వారిని వెంటాడుతోంది. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో కూడా రెండు పార్టీల నిర్ణ‌యాలు వేర్వేరుగా క‌నిపిస్తున్నాయి. మూడు రాజ‌ధానుల అంశం రాష్ట్ర ప్ర‌భుత్వం ఇష్ట‌మ‌ని బీజేపీ చెబితే... జ‌న‌సేన మాత్రం ఏపీకి ఏకైక రాజ‌ధాని ఉండాల‌ని ప్ర‌క‌ట‌న‌లు ఇస్తోంది. బీజేపీ-జనసేన ఉమ్మడి పోరాటంతో ప్రజల్లోకి వెళ్తాయి అని చెప్పిన నేత‌లు ఇలా వేర్వేరుగా స్పందిస్తుండ‌డం చ‌ర్చ‌ల‌కు తావిస్తోంది. సోష‌ల్ మీడియాలో కూడా ఈ విష‌యంలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వీటికి క్వారిటీ ఇవ్వాల్సిన బాధ్య‌త ఆ నేత‌ల‌దే!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp