Jagananna Vidya Deevena - విద్యార్థులకు శుభవార్త .. నేడు విద్యాదీవెన సొమ్ము జమ

By Aditya Nov. 30, 2021, 10:15 am IST
Jagananna Vidya Deevena  - విద్యార్థులకు శుభవార్త .. నేడు విద్యాదీవెన సొమ్ము జమ

నిరుపేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు కొనసాగించాలనే సమున్నత లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న విద్యా దీవెనతో రాష్ట్రం విద్యా పరంగా దూసుకుపోతోంది. ఈ పథకం కింద ఈ ఏడాది మూడో విడత సొమ్మును మంగళవారం ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తోంది. దాదాపు 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి బటన్ నొక్కి జమ చేయనున్నారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వమే పూర్తిగా ఫీజును రీఎంబర్స్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. ఏ బకాయిలు లేకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం సొమ్ము జమ చేస్తుంది. ఆ డబ్బును వారే కాలేజీలో చెల్లించుకోవలసి ఉంటుంది.

పెద్ద చదువులు భారం కాకూడదని..

ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించవలసిన ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది. సంవత్సరంలో నాలుగు విడతలుగా ఈ చెల్లింపులు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికి రెండు విడతల చెల్లింపులు పూర్తి చేశారు. ఏప్రిల్ 19న తొలి విడత 671.45 కోట్లు, జులై 29న రెండో విడతలో 10.97 లక్షల మంది విద్యార్థులకు 693.81 కోట్లు చెల్లించారు. మూడో విడత ఇప్పుడు నవంబరులో చెల్లిస్తున్నారు. నాలుగో విడత 2022 ఫిబ్రవరిలో ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విధంగా చెల్లింపులను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తూ పేదలకు పెద్ద చదువులు భారం కాకుండా చర్యలు తీసుకుంది.

టీడీపీ హయాంలో ఓ ఫార్సుగా..

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ ఓ ఫార్సుగా నడిచింది. అరకొరగా సొమ్ము చెల్లించి చేతులు దులుపుకుంది. అదీ సకాలంలో ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఇబ్బంది పడేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే గత ప్రభుత్వం చెల్లించవలసిన 1,778 కోట్ల రూపాయల బకాయిలతో సహా ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పథకం కింద రూ.6,259 కోట్లు జమ చేసింది.

తల్లుల ఖాతాల్లో జమ ఎందుకు అంటే..

పిల్లలు చదువుతున్న కాలేజీలకు తల్లిదండ్రులు స్వయంగా వెళ్లి ఆ ఫీజులు కట్టడం వల్ల అక్కడి సమస్యలు, సదుపాయాల గురించి తెలుసుకుంటారు. కాలేజీల్లో వసతుల లోపం ఉంటే యాజమాన్యాన్ని ప్రశ్నించగలుగుతారు. అయినా అవి పరిష్కారం కాకపోతే 1902 నంబరుకు ఫోన్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ల వచ్చు. అప్పుడు ప్రభుత్వం ఆ కాలేజీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. కాలేజీల్లో జవాబుదారీతనం, పిల్లల బాగోగులపై తల్లితండ్రుల పర్యవేక్షణ ఉండేందుకే ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును నేరుగా కాలేజీలకు కాకుండా తల్లుల ఖాతాలకు జమ చేస్తోంది. ఖాతాలో సొమ్ము జమ చేసిన వారం,పది రోజుల్లో కాలేజీలకు ఫీజు చెల్లించకపోతే తదుపరి విడత నిలుపు చేస్తారు. ఈ నిబంధన వల్ల తల్లితండ్రులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా తమ పిల్లలను చదివించుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు..

పేద పిల్లల మేనమామలా వారి చదువుల బాధ్యత తాను తీసుకుంటానని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ పథకానికి మరో ఐదు జోడించి చిత్తశుద్ధితో అమలు చేస్తూ విద్యారంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. విపక్షం అర్థంలేని విమర్శలు చేసీనా, వ్యతిరేక మీడియా అదే పనిగా తప్పుడు కథనాలు రాస్తున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం తన పని తాను చేసుకు పోతోంది. ఉన్నత విద్య మెరుగైన సమాజానికి తొలి మెట్టు అని నమ్మిన జగన్మోహన్ రెడ్డి అది సాకారం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం చేస్తున్న ఈ మేలుకు కృతజ్ఞతలు చెబుతున్నారు.

Also Read : Andra Pradesh, Education - వైఎస్సార్ , జగన్.. ఆ విషయంలో ఇద్దరిదీ ఒకే సిద్ధాంతం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp