వైఎస్ జ‌మానాలో అలా...జ‌గ‌న్ లో ధీమా ఏలా?

By Raju VS Dec. 05, 2019, 08:16 am IST
వైఎస్ జ‌మానాలో అలా...జ‌గ‌న్ లో ధీమా ఏలా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో చ‌రిత్ర పున‌రావృతం అవుతోంది. గ‌తంలో వైఎస్సార్ సీఎంగా ఉండ‌గా వేసిన ఎత్తులే ఇప్పుడు మ‌ళ్లీ ముందుకొస్తున్నాయి. అప్ప‌ట్లో దాని స్థాయి కొంత తేడా ఉంది. ప్ర‌భావం కూడా దానికి త‌గ్గ‌ట్టుగానే ఉంది. కానీ ఇప్పుడు శృతిమించిన రీతిలో సాగుతోంది. వైఎస్సార్ పై సాగించిన ప్ర‌చారానికి మ‌రింత ప‌దునుపెట్టి జ‌గ‌న్ పై దాడి జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో అప్ప‌ట్లో వైఎస్సార్ ఎదుర్కొన్న‌ట్టుగా ఇప్పుడు జ‌గ‌న్ సిద్ధ‌ప‌డ‌డం లేదు. వేచి చూసే ధోర‌ణిలో జ‌గ‌న్ ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల విమ‌ర్శ‌ల‌కు, తానంటే గిట్ట‌ని వారి రాత‌ల‌కు స్పందించ‌కూడ‌ద‌నే ఆయ‌న నిర్ణ‌యించుకున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. కానీ ప్ర‌జ‌ల ప‌ట్ల త‌న‌కున్న బ‌లం ఆయ‌న‌లో విశ్వాసాన్ని పెంచి ఉండ‌వ‌చ్చు గాక..అయిన‌ప్ప‌టికీ అంత ధీమా అన్ని వేళ‌లా ఆయ‌న‌కు మేలు చేస్తుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి.


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో నేరుగా మీడియాని ఢీకొట్టిన తొలి సీఎం వైఎస్సార్. అప్ప‌ట్లో ఆ రెండు ప‌త్రికలంటూ ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి మీద నేరుగా ఆయ‌న వ్యాఖ్యాలు చేసేవారు. ఆ ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌కు ఘాటుగా స్పందించేవారు. సూటిగా స్పందిస్తూ స‌మాధాన‌మిచ్చేవారు. ఈనాడు సంస్థ‌ల‌కు చెందిన మార్గ‌ద‌ర్శి పెట్టుబ‌డుల వ్య‌వ‌హారంతో మొద‌లుపెట్టి చివ‌ర‌కు సొంతంగా సాక్షి ప‌త్రిక‌ను ప్రారంభించేటంత వ‌ర‌కూ వైఎస్సార్ త‌న మార్క్ వ్య‌వ‌హారం న‌డిపించారు. రాజ‌కీయంగా చ‌క్రం తిప్ప‌గ‌ల‌మ‌ని భావించిన మీడియా య‌జ‌మానుల‌కు మింగుడుప‌డ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రించారు. ఆ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ విధాన వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డం ద్వారా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేమ‌ని భావించిన ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం వైఎస్సార్ మ‌తాన్ని ముందుకు తెచ్చింది. మ‌త ఆధారిత రాజ‌కీయాల‌కు తెగించింది. ఏకండా ఏడుకొండ‌ల‌ను కుదించే య‌త్నం చేస్తున్నారంటూ క‌థ‌నాలు వండి వార్చింది. ఇత‌ర మార్గాల్లో కూడా భ‌క్తుల విశ్వాసాల‌కు భిన్నంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే అనుమాన భీజాలు నాటేందుకు తీవ్రంగా శ్ర‌మించింది. చివ‌ర‌కు అవ‌న్నీ ప‌లించ‌క‌పోవ‌డానికి ఆనాటి రాజ‌కీయ, ఆర్థిక ప‌రిస్థితులు వేరుగా ఉన్నాయ‌నే విష‌యం అంద‌రికీ అర్థ‌మ‌వుతాయి.


ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. దేశ‌మంత‌టా మ‌తం ఆధారంగా రాజకీయాలు న‌డిపేవారి హ‌వా సాగుతోంది. మ‌తాన్ని ముడిపెట్టి, జ‌నాల‌ను మ‌భ్య‌పెట్టి, పీఠం మీద ఎక్కిన వారు త‌మ ప్రాబ‌ల్యం కాపాడుకునేందుకు, ఇత‌ర ప్రాంతాల‌కు విస్త‌రించేందుకు మ‌త సంబంధిత అంశాల‌ను వినియోగించుకునే య‌త్నంలో ఉన్నారు. అదే క్ర‌మంలో ఏపీలో జ‌గ‌న్ అంటే గిట్ట‌ని, ఆయ‌న పాల‌న‌ను స‌హించ‌లేని సెక్ష‌న్ అందుకు తోడ‌వుతోంది. చివ‌ర‌కు చేగువేరా వంటి విశ్వ‌మాన‌వుడి బొమ్మ పెట్టుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వాళ్లు కూడా ఇప్పుడు మ‌త రాజ‌కీయాల‌కు వంత‌పాడుతూ విష బీజాలు నాటుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని అడ్డుకునేందుకు ప్ర‌భుత్వాధినేత మ‌తాన్ని ఆధారంగా మార్చుకుంటున్నారు. ఓవైపు మీడియా, మ‌రోవైపు విప‌క్షాలు కూడా తోడుకావ‌డంతో ఇప్పుడు నిత్యం మ‌త సంబంధిత అంశాలే చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. చిన్న చిన్న అంశాలు కూడా ప‌తాక‌శీర్షిక‌ల‌కు ఎక్కుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేన‌ట్టుగా ఇప్పుడే ఏదో జ‌రిగిపోతోంద‌నే క‌థ‌నాలు వండి వారుస్తున్నారు.


ఇది గ‌మ‌నిస్తుంటే గ‌తంలో వైఎస్సార్ మీద ప్ర‌యోగించిన అస్త్రాన్నే మ‌రోసారి ఆయ‌న త‌న‌యుడు మీద సంధిస్తున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. రాజ‌కీయ క్షేత్రంలో ప్ర‌స్తుతం వీటి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌డంతో గ‌తంలో కొద్ది స్థాయిలో మాత్ర‌మే ప్ర‌భావం చూపితే, ఇప్పుడు మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే వైఎస్సార్ కి భిన్నంగా జ‌గ‌న్ తీరు కనిపిస్తోంది. ఏ చిన్న ప్ర‌య‌త్నాన్నయినా వైఎస్ నేరుగా ఎదుర్కొన్నారు. ఆయ‌నే స్వ‌యంగా మీడియా ముందుకు వ‌చ్చి, త‌న మీద సాగుతున్న ప్ర‌చారం వెనుక అస‌లు గుట్టు ర‌ట్టు చేసేవారు. త‌ద్వారా ప్ర‌త్య‌ర్థుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డానికి ఆయ‌న సిద్ధంకాలేద‌న్న‌ది సుస్ప‌ష్టం. ఇప్పుడ‌లా క‌నిపించ‌డం లేదు. జ‌గ‌న్ పూర్తిగా త‌న చ‌ర్య‌ల ద్వారా స‌మాధానం చెప్పాల‌ని చూస్తున్నారు. జ‌నం అర్థం చేసుకుంటార‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. తాను సీన్ లోకి రావ‌డానికి ఆయ‌న స‌సేమీరా అంటున్నారు. కేవ‌లం అసెంబ్లీ వేదిక‌గా కొంత‌, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో చేసిన వ్యాఖ్య‌ల ద్వారా మ‌రికొంత స‌మాధానం ఇచ్చేందుకు ప‌రిమితం అవుతున్నారు. త‌ద్వారా ప్ర‌స్తుతం సీఎం కొంత ధీమాగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.


గ‌డిచిన ఆరు నెలల పాల‌నా కాలంలో జ‌గ‌న్ ఎన్న‌డూ మీడియా స‌మావేశం కూడా నిర్వ‌హించింది లేదు. చ‌రిత్ర‌లో అదో రికార్డుగా చెప్పాలి. దానివ‌ల్ల ప్ర‌యోజ‌నం ఎంత అన్న‌ది ప‌క్క‌న పెడితే దుష్ప్ర‌చారం తిప్పికొట్టడానికి వైఎస్సార్ చేసిన ప్ర‌య‌త్నాల‌కు భిన్నంగా జ‌గ‌న్ సాగుతున్న తీరు మాత్రం విశేష‌మే. అలాంటి ప్ర‌చారానికి అన‌వ‌స‌రంగా తోడ్ప‌డే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ ప‌దే ప‌దే అదే చెబుతున్న స‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా ఏదోమేర‌కు ప్ర‌భావితుల‌వుతార‌న్న‌ది అనుమానం లేని అంశం. అలాంటి స‌మ‌యంలో ముఖ్యంగా మ‌తం ప్రాతిప‌దిక‌న సాగుతున్న క్యాంపెయిన్ కి చెక్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది.

ప్ర‌భుత్వ విధానాల ప‌రంగా ఇప్ప‌టికే కొంద‌రు మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు చాక‌చ‌క్యంగా స్పందిస్తూ ప్ర‌భుత్వ వాద‌న‌కు బలం చేకూరుస్తున్నారు. కానీ మ‌తం కోణంలో సాగుతున్న దానికి సంబంధించిన విష‌యాల్లో సంబంధిత శాఖ ద్వారా కానీ నేరుగా సీఎంగానీ స్పందించి తిప్పికొట్టేందుకు చొర‌వ చూపాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. త‌ద్వారా ఆదిలోనే అడ్డుకోవ‌డం ద్వారా ఎవ‌రికీ అవ‌కాశం ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాల్సి ఉంటుంద‌నే వాద‌న వినిపిస్తోంది. దానికి వైఎస్సార్ నే కొంద‌రు ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు. ప్ర‌త్య‌ర్థుల ప్ర‌చార ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు ఆయ‌న తీసుకున్న జాగ్ర‌త్త‌ల నుంచి పాఠాలు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp