మాట‌ల తూటాలు పేలుతున్న జ‌‘"గ‌న్‌"

By Sodum Ramana 14-11-2019 05:16 PM
మాట‌ల తూటాలు పేలుతున్న జ‌‘"గ‌న్‌"

జ‌గ‌న్‌...ప్ర‌త్య‌ర్థుల‌కు కొర‌క‌రాని కొయ్య‌. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా, పాల‌క ప‌క్షంలో ఉన్నా అదే మొండి ధైర్యం, అదే మొండి వైఖ‌రి. ఏదైనా విష‌యంలో ఒక నిర్ణ‌యానికి వ‌స్తే... వెనుతీయ‌ని వ్య‌క్తిత్వం. చెక్కు చెద‌ర‌ని మ‌న‌స్త‌త్వం. ఆచ‌ర‌ణ‌లో కొండంత ఆత్మ‌విశ్వాసం. ఇవే జ‌గ‌న్ బ‌లాలు. జ‌గ‌న్‌లోని ఈ ల‌క్ష‌ణాలే ప్ర‌త్య‌ర్థుల‌కు ద‌డ పుట్టిస్తున్నాయి. ఈ ల‌క్ష‌ణాలే జ‌గ‌న్‌కు అధికారం తీసుకొచ్చి పెట్టాయి. వ‌చ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో ఆంగ్ల మాధ్య‌మాన్ని ప్ర‌వేశ పెట్టాల‌నే జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీవ్ర దుమారం రేపుతోంది. పాల‌క‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. చినికిచినికి గాలివాన‌గా మారిన‌ట్టు ఈ వివాదం ఉప‌రాష్ర్ట‌ప‌తిని నిల‌దీయ‌డం మొద‌లుకుని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ప్ర‌శ్నించ‌డం వ‌ర‌కు దారి తీశాయి. ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా, ఎల్లో మీడియా ర‌చ్చ‌ర‌చ్చ చేస్తున్నా, జ‌గ‌న్ త‌గ్గ‌క‌పోగా మ‌రింత‌గా ఫైర్ అవుతున్నారు.

రెండ్రోజుల క్రితం జాతీయ విద్యాదినాన్ని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌లో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ ఆంగ్ల‌మాధ్య‌మంపై కొంద‌రు పెద్ద‌లు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారంటూ...చంద్ర‌బాబు కుమారుడు లోకేష్ ఏ మీడియంలో చ‌దివాడు, ఆయ‌న మ‌నుమ‌డు దేవాన్ష్‌ను ఏ మీడియంలో చేర్చ‌బోతున్నారు? వెంక‌య్య‌నాయుడి పిల్ల‌లు ఏ మీడియంలో చ‌దివారు? వారి పిల్ల‌లు ఏ మీడియంలో చ‌దువుతున్నారు? సినీన‌టుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఐదుగురు పిల్ల‌లు ఏ మీడియంలో చ‌దువుతున్నారో చెప్పాల‌ని స‌భాముఖంగా నిల‌దీశారు. జ‌గ‌న్ ప్ర‌శ్న‌ల వ‌ర్షానికి జ‌నం నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది.

జ‌గ‌న్ మాట‌ల తూటాల‌కు ప్ర‌తిప‌క్ష నేత‌లు గిల‌గిల‌త‌న్నుకుంటున్నారు. ఆ తూటాల తాలూకు దెబ్బ‌లు మాన‌కుండానే ఒంగోలులో జ‌గ‌న్ మ‌ళ్లీ అంత కంటే తీవ్ర‌స్థాయిలో ప్ర‌తిప‌క్షాల‌పై బుల్లెట్ల వ‌ర్షం కురిపించినంత‌గా ఫైర్ అయ్యారు. ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తనను టార్గెట్‌ చేసిన పెద్ద మనుషులు సమాధానం చెప్పాలన్నారు. ‘‘రాజకీయ నేతలు, సినీ ప్రముఖులను నేను ప్రశ్నిస్తున్నా.. మీ బిడ్డలు మాత్రమే ఇంగ్లీషు మీడియంలో చదవాలా? సంస్కృతి పేరుతో పిల్లల భవిష్యత్‌ను పట్టించుకోకపోతే భావితరాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. కొందరు బాగుపడితే సమాజం బాగుపడదు.. అందరూ బాగుపడితేనే సమాజం కూడా బాగుపడుతుందని’’ అని అన్నారు.

అంతే కాదు పేదరికం నుంచి బాగుపడాలంటే చదువు ఒక్కటేనని, చదువు ఒక్కటే ఆస్తి.. నిజమైన సంపదని జ‌గ‌న్ మాట్లాడిన తీరు ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచింప‌జేసేలా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్రతి స్కూల్లో తప్పనిసరిగా తెలుగు సబ్జెక్ట్‌ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే పదేళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఊహించాలని, ఇప్పటికీ స్మార్ట్‌ ఫోన్లు, ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి వచ్చాయని, పదేళ్ల తర్వాత రోబోటిక్స్‌ కీలకం కానున్నాయని ఆయ‌న మాటల్లోని ముందు చూపును ఆవిష్క‌రించింది. ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలను తీర్చిదిద్దాల్సిన అవసరం, బాధ్యత మనందరిపై ఉందన్న ఆయ‌న మాటల్లో ప్రేమ‌, చిత్తశుద్ధి కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించాయ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

పిల్లలకోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే, రాజకీయం కోసం ఆరోపణలు చేస్తున్నారని, హిపోక్రసీని వదిలి డెమొక్రసీకి విలువ ఇవ్వాల‌ని ఆయ‌న పిలుపునివ్వ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది.
స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని తెలుసున‌ని, త‌న‌కు శ‌త్రువులు కూడా ఎక్కువ‌య్యారంటూనే విద్యార్థులు, పేద‌లు, ద‌ళితుల కోసం తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని అమ‌లు చేసేందుకు ఎందాకైనా వెళుతాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం ప్ర‌తిప‌క్షాలకు ఓ హెచ్చ‌రిక‌లాంటిద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌తిప‌క్షాల యాగీ కంటే జ‌గ‌న్ మాట‌లు ఆలోచింప‌జేసేలా ఉన్నాయంటున్నారు. అలాగే రాజ‌కీయ నేత‌లు, సినిమా న‌టులు, జ‌ర్న‌లిస్టుల పిల్ల‌ల‌ను ఏ మీడియంలో చ‌దివిస్తున్నారో చెప్పాల‌నే జ‌గ‌న్ డిమాండ్‌, ఆంగ్ల మాధ్య‌మాన్ని వ్య‌తిరేకిస్తున్న వారిని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింద‌న‌డంలో సందేహం లేదు. అందుకే మాట్లాడే వారి నైతికత‌ను బట్టే స‌మాజంలో విలువ ఉంటుంద‌ని మ‌రోసారి రుజువ‌వుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News