ఏపీ రాజకీయాలకు హస్తినలో జవాబిచ్చిన జగన్

By Raju VS Sep. 22, 2020, 10:28 pm IST
ఏపీ రాజకీయాలకు హస్తినలో జవాబిచ్చిన జగన్

ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న జగన్ మరోసారి తనదైన పంథాల వ్యవహరించారు. ఏపీలో మత రాజకీయాలకు దిగిన వివిధ పార్టీలకు నేరుగా సమాధానమిచ్చారు. కేంద్రంలో కీలక నేత, హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. విపక్షాలు అభివృద్ధిని అడ్డుపడేందుకు మత సంబంధిత అంశాలను ముందుకు తెస్తున్న తరుణంలో తనదైన మార్క్ లో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలతో సీఎం పర్యటన సాగుతోంది. అందులో భాగంగా అమిత్ షా భేటీ సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు చెబుతున్నారు. రాత్రికి ఢిల్లీలో బస చేయబోతున్న జగన్ మరింత మంది కీలక నేతలతో సమావేశమవుతున్నట్టు సమాచారం.

ఏపీలో చంద్రబాబు తనదైన శైలిలో కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. చివరకు సీఎం హోదాలో తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సందర్భాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్న తీరుని తప్పుబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ పై మతం ముద్ర కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారే యత్నంలో ఉన్నట్టు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో అమరావతి అంశంలో సీబీఐ విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నంలో ఉన్నారని సందేహిస్తున్నారు. ఫైబర్ గ్రిడ్ లో సాగిన కుంభకోణం వెలుగులోకి రాకుండా అడ్డుకునే యత్నంలో ఉన్నారని అనుమానిస్తున్నారు. దానికి అనుగుణంగానే జగన్ తాజా సమావేశంలో హోం మంత్రి సీబీఐ విచారణ ప్రాతిపాదన చేసినట్టు కనిపిస్తోంది. ఆయన అంగీకరిస్తే అమరావతి భూ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలో దిగే అవకాశం ఉంటుంది. అంతేగాకుండా ఫైబర్ గ్రిడ్ అంశంలో దర్యాప్తు అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించడంతో వ్యవహారం బాబు మెడకు చుట్టుకున్నా ఆశ్చర్యం లేదని ప్రచారం మొదలయ్యింది.

ఇక కేంద్రంలో మోడీ- షా ద్వయంలో సన్నిహితంగా మెలుగుతున్న జగన్ ని ఏపీలో ఇరకాటంలో నెట్టాలని ఆశిస్తున్న బీజేపీ నేతలకు కూడా బ్రేకులు వేసే ప్రయత్నం తాజా జగన్ పర్యటనతో జరుగుతున్నట్టు కనిపిస్తోంది. కీలక సందర్భాల్లో కేంద్రానికి చేదోడుగా నిలుస్తున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఏపీ బీజేపీ నేతలు ఆశిస్తున్న తరుణంలో దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఖాయమని అంచనా వేస్తున్నారు. చంద్రబాబుకి ఉపయోగపడే రీతిలో ఏపీ బీజేపీ నేతల ఎత్తుగడలుండడంతో అలాంటి వాటికి ఆస్కారం లేకుండా చేసే యత్నం సాగుతున్నట్టు కనిపిస్తోంది.

అదే సమయంలో ఏపీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ పెద్దల ముందు ప్రతిపాదనలు చేసినట్టు సీఎం సన్నిహితులు చెబుతున్నారు. విజయసాయిరెడ్డి, బాలశౌరి వంటి నేతలతో కలిసి అమిత్ షా తో సమావేశమయిన జగన్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించి వినతిపత్రం అందించారు. దాంతో అటు రాజకీయంగానూ, ఇటు రాష్ట్రాభివృద్ధిపరంగానూ జగన్ పర్యటన ఫలప్రదం కావడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp