నేడు ఢిల్లీకి జగన్‌... హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశం, మండలి రద్దు, 3 రాజధానులే ఎజెండా!

By Amar S Feb. 14, 2020, 10:35 am IST
నేడు ఢిల్లీకి జగన్‌...  హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశం, మండలి రద్దు, 3 రాజధానులే ఎజెండా!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం వెళ్లి ప్రధాని మోదీని కలిసి వచ్చిన ఆయన.. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు. శాసనమండలి రద్దు, పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటే ప్రధాన ఎజెండా అని చెబుతున్నారు. కాగా.. ప్రధానిని కలిసినప్పుడు కూడా ఆయన ఈ రెండింటినీ ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, పోలవరం, ఇతర సాయాల కోసం 11 అంశాలతో విజ్ఞాపన పత్రాన్ని సమర్పించిన సంగతి తెలిసిందే.

వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం.. మండలిని తక్షణమే ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో మోదీకి సీఎం వివరించారు. ఆ సభలో రెండేళ్లలో తమకు సంపూర్ణ మెజారిటీ వచ్చే వీలున్నా.. తమ పార్టీ నేతలను సభ్యులుగా నియమించుకునే అవకాశం ఉన్నా.. వెంటనే రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పినట్లు తెలిసింది. ఈ అంశాలపై షాతో మాట్లాడాలని ప్రధాని సూచించినట్లు సమాచారం. తదనుగుణంగా అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ను జగన్‌ కోరారు. బుధ, గురువారాల్లో ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున.. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు అమిత్‌షా సమయమిచ్చారు.

ప్రధానిని కలిసిన 48 గంటలు తిరగకముందే.. అమిత్‌ షాతో జగన్‌ ప్రత్యేకంగా సమావేశం కానుండడంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. తన సొంత వ్యవహారాల కోసమే షాను కలుస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఎన్డీఏలోకి వైసీపీ?
మరోవైపు.. ఎన్‌డీఏలో చేరికకు వైసీసీ సిద్ధమైందన్న ప్రచారమూ జోరందుకుంది. వైసీపీపీ నేత విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కనుందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో షాను జగన్‌ కలవనుండడం ఆసక్తి కలిగిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp