అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు ...?

By Srinivas Racharla Jul. 18, 2020, 10:45 am IST
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు ...?

భారతీయ సమాజంలో సుదీర్ఘ కాలం కొనసాగిన అత్యంత వివాదాస్పదమైన అంశం ఏమైనా ఉందంటే అది అయోధ్యలోని రామజన్మభూమి స్థల వివాదమే.ఈ నేపథ్యంలో దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువుల ఆకాంక్షను సొమ్ము చేసుకొని రాజకీయంగా లబ్ధి పొందడంలో బిజెపి ముందు వరుసలో నిలిచింది.కేంద్రంలో రెండు ఎంపీ స్థానాల నుండి సొంతంగా అధికార పీఠం దక్కించుకునే స్థాయికి బిజెపి చేరడం వెనుక అయోధ్యలో రామాలయ నిర్మాణ ప్రచారం కీలక భూమిక వహించిందని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ప్రధానంగా 1992 డిసెంబర్ 6 న వివాదాస్పద స్థలంలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాతే బిజెపి దేశంలోని నలుమూలలకూ విస్తరించింది.

ఇక రెండు శతాబ్దాలకు పైగా కొనసాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ గతేడాది నవంబర్‌ 9న అయోధ్యలోని వివాదాస్పద స్థలం రామ్‌ లల్లాకే చెందుతుందని సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది.సుప్రీం తుదితీర్పు తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తం ఖరారు అయినట్లు రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వర్గాలు నుండి సమాచారం అందుతుంది.

శనివారం అయోధ్యలో శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలో సమావేశమై శంకుస్థాపనకు ముహూర్తాన్ని ఖరారు చెయ్యటం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైనందున పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారని ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి.వచ్చే ఆగస్టు నెలలోనే రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి.ముందుగా గర్భ గుడికి జరిగే భూమి పూజతో మందిర నిర్మాణం ప్రారంభమవుతుందని ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.

వాస్తవానికి రామమందిర నిర్మాణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిచాలని రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ నిర్ణయించింది.ప్రధానితో పాటు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులను ఆహ్వానించి అత్యంత వైభవంగా శంకుస్థాపన జరపాలనుకున్నారు.కానీ కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా కొద్ది మంది ప్రముఖులతో నిర్వహించాలని తాజాగా ట్రస్ట్‌ నిర్ణయించింది.దీంతో రామ మందిర నిర్మాణ పనుల శంకుస్థాపనకి ప్రధాని మోడీ,ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు, యూపీకి చెందిన ఎంపీలను మాత్రమే ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్‌ వర్గాలు తెలిపాయి.

గతేడాది నవంబర్‌ 9న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పులో అయోధ్యలోని వివాదస్పద స్థలం రామ్‌ లల్లాకే చెందుతుందని పేర్కొంది. అలాగే మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు కేటాయించాలని స్పష్టం చేసింది.గత ఫిబ్రవరి 5న కేంద్ర ప్రభుత్వం మహంతి నిత్య గోపాల్ దాస్ అధ్యక్షతన 15 మంది సభ్యులతో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది.ఈ ట్రస్టే అయోధ్యలో రామ మందిర నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp