రైతు ఉద్యమం కొలిక్కి వస్తున్నట్టేనా, ఓ మెట్టు దిగిన కేంద్రం, రైతులు బెట్టు వీడుతారా

By Raju VS Jan. 21, 2021, 05:50 pm IST
రైతు ఉద్యమం కొలిక్కి వస్తున్నట్టేనా, ఓ మెట్టు దిగిన కేంద్రం, రైతులు బెట్టు వీడుతారా

ఎట్టకేలకు కేంద్రం దిగి వచ్చింది. తాత్కాలికంగానైనా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమయ్యింది. తొమ్మిదో విడత చర్చల్లో భాగంగా రైతు నేతల ముందు కేంద్రం ఈ ప్రతిపాదనలు చేసింది. ఏడాదిన్నర పాటు వ్యవసాయ చట్టాల అమలుని ఉపసంహరించుకుంటామని పేర్కొంది. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రం కూడా అందిస్తామని వెల్లడించింది. అయితే ఈ అంశంపై తుది నిర్ణయం కోసం రైతు సంఘాల నేతల గడువు కోరారు. తాము చర్చించుకుని అభిప్రాయం చెబుతామన్నారు. దాంతో రిపబ్లిక్ డే కి ముందే రైతుల ఉద్యమానికి ముగింపు పలికే దిశలో కేంద్రం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.

కేంద్రం ప్రభుత్వం తీరు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా చట్టాల రూపకల్పనకు ముందు రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాలతో చర్చించి ఉండాల్సిందని అంటున్నారు. కానీ అప్పట్లో ఏకపక్షంగా , అది కూడా కరోనా లాక్ డౌన్ సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరిపి చట్టాలు ఆమోదం పొందడంతో అన్నదాతలు భగ్గుమన్నారు. గత సెప్టెంబర్ నుంచి వివిధ దశల్లో ఆందోళన సాగిస్తున్నారు. చివరకు నవంబర్ ఉద్యమం ఢిల్లీ బాట పట్టింది. సరిహద్దుల్లో భైఠాయించి జాతీయ రహదారులు దిగ్బంధించారు. డిసెంబరులో మరింత ఉధృతమయ్యింది. ఏకంగా జియో సెల్ టవర్లు ధ్వంసం చేసే స్థాయికి చేరింది. హర్యానా ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటూ హెలిపాడ్ తవ్వేసే దాకా వెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పటికి తొమ్మిది విడతలుగా చర్చలు చేసింది. కానీ రైతు సంఘాలు మాత్రం చట్టాలు వెనక్కి తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు.

సుప్రీంకోర్ట్ కూడా జోక్యం చేసుకుంది. నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. అయితే వారంతా వ్యవసాయ చట్టాలకు మద్ధతుగా స్పందించిన వారు కావడంతో కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే చివరకు చట్టాలను తాత్కాలికంగానైనా వెనక్కి తీసుకోకతప్పని స్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. తొలుత పంజాబ్ రైతు ఉద్యమంగా అంతా భావించారు. ఖలీస్తాన్ తీవ్రవాదులతో కొందరు బీజేపీ నేతలు పోల్చారు. కానీ బీజేపీ పాలిత హర్యానా రైతులు అంతకు రెట్టించిన స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టడంతో కమల నేతలు ఖంగుతినాల్సి వచ్చింది. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, మధ్య ప్రదేశ్ రైతులు కూడా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ పరిణామాలతో రైతుల ఉద్యమాన్ని చల్లార్చేందుకు సామదానబేధదండోపాయాల్సి ప్రయోగించినా మోడీ సర్కారుకి మింగుడుపడని రీతిలో రైతు పోరాటం కొనసాగుతోంది.

దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో దిగి వచ్చేందుకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే రైతు ఉద్యమాన్ని వెనక్కి మళ్లించి, ఆ తర్వాత మరో మార్గంలో చట్టాలు అమలులోకి తీసుకొచ్చే ప్రమాదం లేకపోలేదని కొందరు రైతు నేతలు సందేహిస్తున్నారు. దానికి ఎలాంటి సమాధానం ఉంటుందన్నదే పరిష్కారానికి కీలకాంశం అవుతుందని చెప్పవచ్చు. దాంతో పాటుగా మద్ధతుధర విషయంలో హామీ ఇచ్చిన కేంద్రం దానిని చట్టంలో పొందుపరిచేందుకు ముందుకొస్తుందా లేదా అన్నది కూడా ప్రధానాంశమే అవుతుంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా పోటీ పరేడ్ కి సిద్ధమవుతున్న రైతు ఉద్యమాన్ని కేంద్రం ఎలా సంతృప్తి పరుస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికర అంశం. దానిని బట్టే ఉద్యమం కొనసాగుతుందా లేదా విరమిస్తారా అన్నది ఆధారపడి ఉంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp