రేవంత్ ,మల్లారెడ్డి బ్లాక్ మెయిల్ ఎపిసోడ్ - చంద్రబాబు ఏం చేశారు..?

By Ritwika Ram Aug. 29, 2021, 08:40 am IST
రేవంత్ ,మల్లారెడ్డి బ్లాక్ మెయిల్ ఎపిసోడ్ - చంద్రబాబు ఏం చేశారు..?

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. భూములను కబ్జా చేశారంటూ మల్లారెడ్డిపై రేవంత్ ఆరోపణలు చేస్తే.. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడంటూ మల్లారెడ్డి మండిపడుతున్నారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ కు సంబంధించిన ఏ వివాదం మొదలైనా వెంటనే చంద్రబాబు పేరు బయటికి వస్తోంది. పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ ఎంపిక అయినప్పుడు కూడా చంద్రబాబు పేరు వినిపించింది. ఇప్పుడు మల్లారెడ్డిపై రేవంత్ ఆరోపణల విషయంలోనూ బాబు పేరు వినిపిస్తోంది. తాజా వివాదంలో చంద్రబాబు పేరును మల్లారెడ్డి ప్రస్తావించారు.

2014 మార్చిలో తెలుగుదేశం పార్టీలో చేరిన మల్లారెడ్డి.. నెల రోజులకే మల్కాజిగిరి ఎంపీ టికెట్ సాధించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయాలని అనుకున్నారని, టికెట్ తనకు దక్కడంతో తర్వాత తనపై బ్లాక్ మెయిలింగ్ కు దిగాడని మల్లారెడ్డి ఇప్పుడు ఆరోపిస్తున్నారు. తాను ఎంపీగా గెలిచాక.. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన కాలేజీలకు సంబంధించిన అన్ని పేపర్లను చంద్రబాబుకు చూపెట్టానని తెలిపారు.

టీడీపీ నుంచి బయటికి వచ్చి.. 2016 జూన్ నెలలో టీఆర్ఎస్ లో చేరారు మల్లారెడ్డి. అంతకు ఏడాది ముందు 2015 మే 31న దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ఓటుకు నోటు’ కేసు బయటికి వచ్చింది. రేవంత్ రెడ్డి వీడియోతోపాటు దొరికిపోగా.. చంద్రబాబు మాట్లాడినట్లుగా ఉన్న ఆడియోలు బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణలకు రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి తనపై ఎప్పుడు బెదిరింపులకు దిగారన్నది మల్లారెడ్డి సరిగ్గా చెప్పలేదు. రేవంత్ బ్లాక్ మెయిలింగ్ గురించి చంద్రబాబుకు చెబితే.. ఆయన ఎలా రియాక్టయ్యారన్నదీ వెల్లడించలేదు. ‘ఓటుకు నోటు’ విషయంలో రేవంత్ తో కలిసి ప్లాన్ చేసిన చంద్రబాబు.. రేవంత్ పై ఫిర్యాదు చేస్తే ఎలా స్పందించి ఉంటారనేది అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రేవంత్ బ్లాక్ మెయిలింగ్ ను తట్టుకోలేకనే పార్టీ మారారా అనే విషయాన్ని కూడా మల్లారెడ్డి తెలియజేయలేదు.

Also Read : అచ్చెం నాయుడు లెక్క.. టీడీపీకి మరీ అన్ని సీట్లా..?

రేవంత్ రెడ్డి మల్కాజిగిరి సీటు నుంచి పోటీ చేయాలని అనుకున్నారని మల్లారెడ్డి చెబుతున్నారు. ఇందుకు అవకాశాలు లేకపోలేదు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసింది. ఒకవేళ మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఎన్నికైతే టీడీపీ కోటాలో కేంద్ర మంత్రి కావచ్చని రేవంత్ రెడ్డి భావించి ఉండొచ్చు. అందుకే మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేయాలని భావించి ఉండొచ్చు. 2019 ఎన్నికల్లో కూడా మాల్కాజిగిరి నుంచే రేవంత్ ఎన్నికయ్యారు. అయితే ఇక్కడే ఒక అనుమానం కలుగుతుంది. నిజంగా రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని 2014లో భావిస్తే.. కొత్తగా వచ్చిన మల్లారెడ్డికి చంద్రబాబు టికెట్ ఎందుకు ఇచ్చారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇక రైటు ఇన్ఫర్మేషన్ యాక్ట్ (సమాచార హక్కు చట్టం-ఆర్టీఐ) కింద రేవంత్ రెడ్డి తనను బ్లాక్ మెయిల్ చేశాడని మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. ఆర్టీఐ విషయంలో ఇలాంటి ఆరోపణలు ఉన్నది నిజమే. ఆర్టీఐ కింద సమాచారం సేకరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. మనం తప్పు చేయనప్పుడు ఆర్టీఐ కింద సమాచారం సేకరించి బెదిరిస్తే ఎందుకు బెదరాలి. తప్పు చేసిన వాళ్లే.. బ్లాక్ మెయిలింగ్ కు భయపడుతారు. తప్పు చేయనప్పుడు ఆర్టీఐకి భయపడటం ఎందుకు? ఏవో కాగితాలు తీసుకొచ్చి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దొంగ పత్రాలు చూపెట్టి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మల్లారెడ్డి అంటున్నారు. దొంగ పత్రాలని ఆయనే అంటున్నప్పుడు ఇక భయపడటం ఎందుకు?

రేవంత్ గురించి చెప్పబోయి.. ఒకానొక సమయంలో సెల్ఫ్ గోల్ చేసుకున్నారు మల్లారెడ్డి. త‌న మెడిక‌ల్ కాలేజీలపై ఉన్న‌వీ, లేనివీ క‌ల్పించి ఎంసీఏకు రేవంత్ రెడ్డి లేఖ‌లు రాశార‌ని చెప్పిన ఆయన.. మీడియేట‌ర్ల‌ను తీసుకెళ్లి రేవంత్ రెడ్డికి న‌చ్చ‌జెప్పాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. నిజంగా అక్రమాలు జరగనప్పుడు మీడియేటర్లతో పని ఏముందనేది ఇక్కడ ఉదయించే ప్రశ్న. మ‌ల్లారెడ్డి త‌న విద్యాసంస్థ‌ల్లో ఎలాంటి అక్ర‌మాలు, అవ‌క‌త‌వ‌క‌లు చేసి ఉండ‌క‌పోతే.. రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని నేతలు చర్చించుకుంటున్నారు. స‌క్రమంగా కాలేజీల‌ను న‌డుపుకుంటున్నానని చెబుతున్న మంత్రి.. పార్లమెంటులో ప్రశ్నలు అడిగితే భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని అంటున్నారు.

ఒక్కటి మాత్రం నిజం.. మొన్న కోపంతో ఊగిపోయి.. బండ బూతులు తిట్టి.. తొడగొట్టి సవాల్ చేసిన మంత్రి మల్లారెడ్డి.. తాజాగా ప్రెస్ మీట్ లో కాస్త నిదానంగా మాట్లాడారు. కేసీఆర్ కొడుకు, తన సహచర మంత్రి కేటీఆర్ వెనకేసుకొచ్చినా.. అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో ఆయన మాట తీరు మారింది. అదీకాక వివాదం పెద్దది అవుతోందన్న వాదన కూడా ఉంది. అందుకే పేపర్లతో సహా వచ్చి.. అన్ని వివరాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు మల్లారెడ్డి. మరి చంద్రబాబు ఎపిసోడ్ గురించి, బ్లాక్ మెయిలింగ్ ఆరోపణల గురించి రేవంత్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read : త‌గ్గేదేలే : తెలంగాణ‌లో పొలిటిక‌ల్ మంట‌లు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp