Nimmakayala Chinarajappa - పెద్దాపురం సేఫ్ కాదనే చినరాజప్ప చూపు కొత్త నియోజకవర్గం మీద పడిందా?

By Raju VS Dec. 01, 2021, 08:30 pm IST
Nimmakayala Chinarajappa - పెద్దాపురం సేఫ్ కాదనే చినరాజప్ప చూపు కొత్త నియోజకవర్గం మీద పడిందా?

నిమ్మకాయల చినరాజప్ప. ఎక్కడో అమలాపురం నుంచి వచ్చి పెద్దాపురంలో పాగా వేశారు. వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఏకంగా హోం మంత్రి కావడంతో ఆయన ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ హవాకి ఎదురొడ్డి నిలవడంతో అది బాగా ఉపయోగపడిందనే వాదన కూడా ఉంది. ఏమయినా కోనసీమ నుంచి తూర్పు గోదావరి జిల్లా మెట్టలో పట్టు సాధించడంలో చినరాజప్ప విజయవంతమయ్యారనే చెప్పవచ్చు. అయితే వచ్చే ఎన్నికల కోసం రాజప్ప మనసులో ఏముందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

గడిచిన రెండున్నరేళ్లుగా నిమ్మకాయల చినరాజప్ప తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురానికి ప్రాధాన్యత తగ్గించేశారు. అప్పట్లో హోం మంత్రిగా రాష్ట్రమంతా తిరగాల్సి ఉన్నా వారానికి ఒకటి రెండు రోజులు నియోజకవర్గంలో కనిపించేవారు. కానీ ఇప్పుడు విపక్షంలోకి వెళ్లిన తర్వాత దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పైగా కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇటీవల స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలకు తగిన మార్గదర్శకత్వం వహించేవారు కూడా కరువయ్యారు. ఈ నేపథ్యంలో రాజప్ప మనసు కాకినాడ వైపు మళ్లిందనే ప్రచారం కూడా సాగింది. కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారని టీడీపీ నేతల్లోనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ఇక ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన ముగింపు పలుకుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.

1987లో ఉప్పలగుప్తం ఎంపీపీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. తరువాత చంద్రబాబు హయాంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా పని చేశారు. 2002లో కెనరా బ్యాంకు డైరెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత ఉప్పలగుప్తం మండలం నుంచి శాసన సభ వరకూ సాగింది. అనూహ్యంగా 2014లో కాపు నేతలకు సీట్లు కేటాయించాలనే లక్ష్యంతో పెద్దాపురం సీటు ఇచ్చారు. చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చినా రాజప్పకు కాలం కలిసి వచ్చి విజయం దక్కింది. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగులోనే విజయవంతం కావడం ద్వారా ఆయన ఏకంగా చంద్రబాబు క్యాబినెట్ లో కీలకనేతగా మారిపోయారు. కానీ ఇటీవల పలు వ్యవహారాల్లో ఆయన అంతంతమాత్రంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుతో సాన్నిహిత్యం కొనసాగిస్తూనే పెద్దాపురం నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నట్టుగా కనిపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో ఆయన లేరని కొందరు భావిస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, రాజకీయ అవసరాల రీత్యా బరిలో దిగాల్సి వస్తే కాకినాడ నగరం సీటుని ఎంచుకోవడానికి ఆయన ఆసక్తి చూపుతారని కూడా అంటున్నారు. ఏమయినప్పటికీ అనివార్యంగా చంద్రబాబు మాటను జవదాటని నేతగా ఉండే రాజప్ప కి బాబు మాటే శిరోధార్యం. కాబట్టి రాజప్ప వారసుడు కూడా పెద్దగా రాణించలేకపోతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి నిమ్మకాయల వారి భవితవ్యం ఎలా ఉంటుంది, దానిప్రభావం పెద్దాపురం మీద ఎలా పడుతుందన్నది ఆసక్తికరమే.

Also Read : Mandapeta - ఊగిసలాటలో మరో ఎమ్మెల్యే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp