నక్కా ఆనందబాబు ఇన్నాళ్లూ కోమాలో ఉన్నారేమో!!

By Ritwika Ram Jun. 21, 2021, 12:30 pm IST
నక్కా ఆనందబాబు ఇన్నాళ్లూ కోమాలో ఉన్నారేమో!!

ఈ దశాబ్దంలోనే అతిపెద్ద జోక్ వేశారు టీడీపీ నేత నక్కా ఆనందబాబు. ప్రపంచంలో కరోనాను పట్టించుకోని ఏకైక సీఎం జగనేనని విమర్శించారు. కరోనా కట్టడిలో సీఎం జగన్ విఫలమయ్యారని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా మృతుల పూర్తి వివరాలు టీడీపీ సేకరిస్తోందని, అందరికీ న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని ఉత్తరకుమారుడిలా ప్రగల్భాలు పలికారు.

ఆనందబాబు మాటలను చూస్తే.. రెండేళ్లపాటు కోమాలో ఉండి.. ఇప్పుడే మేలుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 13 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసి ప్రపంచదేశాలకు సవాలు విసిరింది వైఎస్ జగన్ సర్కారు. దేశంలోని మిగతా రాష్ట్రాలను ఆశ్చర్యపరిచింది. ఒకరోజు దేశమంతా కలిపి వేసిన వ్యాక్సిన్ డోసుల్లో దాదాపు సగం ఏపీలోనే వేశారు. రోజుకు లక్ష డోసులు వేసేందుకే కొన్ని రాష్ట్రాలు నానా తిప్పలు పడుతుంటే.. ఏపీలో కొన్ని జిల్లాల్లో లక్షకు పైగా వేశారు. వైఎస్ జగన్ చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఢిల్లీ నుంచి గల్లీ దాకా పొగుడుతుంటే.. రాష్ట్రంలోనే ఉన్న టీడీపీ నేతలకు మాత్రం కనిపించలేదు. ఆనందబాబు లాంటి నేతలు కళ్లున్నగుడ్డివాళ్లుగా మారి.. నవ్వుల పాలయ్యే విమర్శలు చేస్తున్నారు.

లేఖలు రాసి.. భేటీలు నిర్వహించి..

నిజానికి దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉంది. ఫస్ట్ డోసు వేసుకున్న చాలా మందికి సెకండ్ డోసు దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ వీలైనంత ఎక్కువ మంది టీకాలు వేసేందుకు చర్యలు చేపట్టింది జగన్ సర్కారు. కేంద్రపై ఒత్తిడి పెంచి, వరుసగా లేఖలు రాసి, కేంద్రంలోని పెద్దలతో సమావేశమై.. వ్యాక్సిన్లను తెప్పించుకున్నారు. నిజమైన పాలకుడు ఇలానే ఉంటాడు. ప్రజలు ముఖ్యం.. ఆ తర్వాతే మిగతావన్నీ అని భావించే నాయకుడు జగన్. కొన్ని రాష్ట్రాలు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు. కేంద్ర పథకమైన ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయడం లేదు. కానీ కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలోనే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలోకి చేర్చారు. బ్లాక్ ఫంగస్ ను కూడా ఆరోగ్యశ్రీ ట్రీట్ మెంట్ లోకి చేర్చి అందరి ప్రశంసలు పొందారు.

మరణాలపై రాజకీయాలా?

కరోనాతో చనిపోయిన వారి వివరాలు సేకరిస్తోందట టీడీపీ. అందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేస్తుందట. కరోనా మరణాలను దాచాల్సిన అవసరం ఏపీ సర్కారుకు లేదు. రాదు కూడా. కరోనా డెత్స్ తక్కువగా చూపితే.. ప్రభుత్వానికి ఎవరూ అవార్డులు ఇవ్వరు. ఎక్కువ డెత్స్ నమోదయ్యయని.. ఎవరికీ ఉరి శిక్షలూ వేయరు. వయసు పైబడి, అనారోగ్యంతో చనిపోయిన వాళ్లకు కూడా కరోనా టెస్టులు చేసింది సర్కారు. అయినా కరోనాతో చనిపోయిన వారి వివరాలను సేకరించి టీడీపీ చేసేదేం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించే సంఖ్యకు, టీడీపీ సేకరించే వివరాలకు మధ్య పెద్ద తేడా ఉండదు. కాదూ కూడదు అని మరణాలపై రాజకీయం చేయాలని టీడీపీ భావిస్తే.. ప్రజలే బుద్ధి చెబుతారు.

కేంద్రాన్ని అడగొచ్చుగా..

కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఈ విషయంలో టీడీపీ పోరాడొచ్చు కదా. కరోనా బాధిత ఫ్యామిలీలకు పరిహారం ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లెటర్లు రాయవచ్చు కదా.. కానీ రాయరు. ఎందుకంటే.. కేంద్రంతో ఢీకొట్టేంత సీన్ టీడీపీ నేతలకు లేదు. రాష్ట్రంలో కరోనాతో తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు ఇస్తామని ఏపీ సర్కారు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకమే ప్రకటించినా.. వంద తిరకాసులు పెట్టింది. దీనిపైనా టీడీపీ నేతలు మాట్లాడరు. ఫాఫం.. రాజకీయాలు చేసేందుకు ఏ అంశం దొరక్క.. కరోనా మరణాలపై రాజకీయం చేయాలని చూస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp