Maoist RK Died : ఆర్కే నిజంగా చనిపోయాడా, ఎవరు దృవీకరించాలి?

By Raju VS Oct. 15, 2021, 09:45 am IST
Maoist RK Died : ఆర్కే నిజంగా చనిపోయాడా, ఎవరు దృవీకరించాలి?

మావోయిస్టు ఆగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ మరణించారనే వార్త గుప్పుమంది. అయితే ఆయన మృతికి సంబంధించిన కథనాలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ వివిధ ఎన్ కౌంటర్ల సందర్భంగా ఆయన మరణించినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు ఆయన తృటిలో తప్పించుకున్నారని, స్వల్పగాయాలతో బయటపడ్డారని తేల్చేవారు. అయితే ఈసారి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు. ఈసారి కూడా ఆర్కే మరణ వార్తను మావోయిస్టు పార్టీ కాకుండా పోలీసులు ప్రకటించారు. చత్తీస్ ఘడ్ బస్తర్ పోలీసులు ఈ ప్రకటన చేయడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు సానుభూతిపరులు, ఆర్కే కుటుంబ సభ్యులు కూడా ఈ సమాచారం పట్ల పూర్తి నమ్మకంగా లేనట్టు కనిపిస్తోంది.

పల్నాడు నుంచి ఏవోబీ, ఆ తర్వాత చత్తీస్ ఘడ్ లోని దంతేవాడ ప్రాంతాల్లో ప్రాబల్యం చాటిన ఆర్కే ది 38 ఏళ్ల అజ్ఙాతవాసం. మధ్యలో వైఎస్సార్ ప్రభుత్వంతో చర్చల కోసం గుత్తికొండ బిలం వద్ద బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టి, హైదరాబాద్ లో చర్చల వరకూ పక్షం రోజుల పర్యటన మినహా పూర్తిగా అరణ్యవాసమే. మాచర్లలో డిగ్రీ చదివిన తర్వాత కొన్నాళ్లు టీచర్ గా పాఠాలు బోధించి ఆ తర్వాత పీపుల్స్ వార్, మావోయిస్టు బృందాలకు పాఠాలు చెప్పడం ద్వారా పంతులుగా పేరుపొందారు. పోలీసుల చేతుల్లో ఆయన తనయుడు మున్నా ప్రాణాలు కోల్పోయినా, భార్య శిరీష అరెస్ట్ అయ్యి జైలు పాలయినా ఆర్కే మాత్రం సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్రకమిటీ నేతగా తన ప్రస్థానం కొనసాగిస్తూనే వచ్చారు. ఆ క్రమంలో చివరకు కరోనా సోకిన తర్వాత వచ్చిన సమస్యలతో ఆయన తీవ్రంగా సతమతమయినట్టు తెలుస్తోంది.

చత్తీస్ ఘడ్ పోలీసులు తమకు మావోయిస్ట్ కొరియర్ ద్వారా సమాచారం అందిందని చెబుతున్నారు. బుధవారమే ఆర్కే మరణించినట్టు నిర్ధారించారు. కానీ మావోయిస్టు పార్టీ మాత్రం ఎటువంటి స్పస్టత ఇవ్వలేదు. ఆర్కే కుటుంబ సభ్యులు కూడా తమకు సమాచారం లేదనే చెబుతున్నారు. కొరియర్ అని అరెస్ట్ చేసిన సమయంలో వచ్చిన సమాచారం తాము వెల్లడిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నా పూర్తిగా విశ్వసించలేమని మావోయిస్టు సానుభూతిపరులంటున్నారు. దాంతో ఆర్కే మరణవార్త విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ స్పందించేవరకూ స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వాస్తవ సమాచారం కోసం ఇప్పటికే వివిధ ప్రజా సంఘాలు నేతలు పలు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆర్కే మరణిస్తే ఆయన మృతదేహం కుటుంబ సభ్యులకు చేరుతుందా లేదా అనేది సందేహమే. ప్రస్తుతం చత్తీస్ ఘడ్ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఆధిపత్యం కోసం పోరాటం సాగుతోంది. ఈ క్రమంలో ఆర్కే మృతదేహాన్ని ఏమేరకు బయటకు తీసుకురాగలరన్నది అనుమానంగా ఉంది. ఒకవేళ అంత్యక్రియల కోసం మృతదేహం తరలించాల్సి వస్తే ఎక్కడికి తీసుకెళతారన్నది కూడా స్పష్టత లేదు.

ఆర్కే భార్య ప్రకాశం జిల్లాలని టంగుటూరు ప్రాంతంలో సొంత ఇంట్లో ఉన్నారు. ఆర్కే సోదరుడు హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఉంటున్నారు. ఆర్కే తోడల్లుడు కళ్యాణ్‌ రావు కూడా పోలీసుల సమాచారం పట్ల పూర్తి విశ్వాసం లేదని చెబుతున్న తరుణంలో ఈ వ్యవహారం సందిగ్ధం వీడెదన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp