టీడీపీకి అదే తక్కువయ్యింది.. లోకేశ్ ఎప్పటికీ భారమేనా?

By Raju VS Aug. 12, 2020, 09:00 am IST
టీడీపీకి అదే తక్కువయ్యింది.. లోకేశ్ ఎప్పటికీ భారమేనా?

ఏపీలో అధికారం దక్కిన తర్వాత అనూహ్యంగా ఎమ్మెల్సీ, ఆ వెంటనే మూడు శాఖల మంత్రిగా పనిచేసినప్పటికీ నారా లోకేశ్ నేటికీ తండ్రి చాటు బిడ్డగానే మిగిలిపోతున్నట్టు కనిపిస్తోంది. వర్తమాన రాజకీయాల్లో ఈ చినబాబు పాత్రను గమనిస్తే అదే అనుమానం కలుగుతోంది. రాజకీయంగా ఎదగాలనే నాయకుడు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ, చొరవగా స్పందించాల్సి ఉంటుంది. కష్టసమయాల్లో కూడా జనాలకు చేరువగా నిలవాల్సి ఉంటుంది. కానీ నారా లోకేశ్ లో అవి మచ్చుకు కూడా కనిపించడం లేదు. మాట తీరు, తత్తరబాటు వంటి లోపాలు ఉన్నప్పటికీ, ప్రత్యర్థులు పప్పు అనే ముద్రలు వేసినప్పటికీ ప్రజలకు చేరువయ్యేందుకు ఆయనకు చాలా అవకాశాలే వస్తున్నాయి. అయినా వాటిని వృధా చేసుకుంటూ రాజకీయ జీవితానికి బ్రేకులు వేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందివచ్చిన అవకాశాలను చేజార్చుకుని ఎందుకూ కొరగాకుండా పోతున్నట్టు భావించాల్సి వస్తోంది.

నారా లోకేశ్ కి అనేక అనుభవాలు ఎదురుగా ఉన్నాయి. అన్నింటినీ మించి తండ్రి చంద్రబాబు జీవితమే పెద్ద పాఠం. అనూహ్యంగా కాంగ్రెస్ లో మంత్రి పదవి అందుకున్నప్పటికీ ఆ వెంటనే అవకాశాల రీత్యా మామ పెట్టిన పార్టీలో చేరి, నెమ్మదిగా పదేళ్లకే అక్కడి అధికారాన్ని చేజిక్కించుకున్న చరిత్ర చంద్రబాబుది. తనకన్నా ముందు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆ తర్వాత లక్ష్మీ పార్వతి ఉన్నప్పటికీ వారిద్దరినీ తోసిపుచ్చి, మామను వెన్నుపోటు పొడిచేందుకు కూడా వెరవని నేపథ్యం ఆయనకుంది. రాజకీయ ఎదుగుదల కోసం ఎంతటి వారయినా తనకు అడ్డు అనుకుంటే పక్కకి తొలగించడానికి సిద్ధపడే చరిత్ర చంద్రబాబుదని ఇన్నేళ్ల అనుభవం చెబుతోంది. అదే సమయంలో చిన్న చిన్న అవకాశాలను కూడా తనకు అనుకూలంగా మలచుకుని పరిపాలనాదక్షుడనే ముద్ర వేసుకుని, మరీ ప్రజల్లో గుర్తింపు సాధించిన ఘనత కూడా ఆయనదే.

అంతటి చరిత్ర ఉన్న చంద్రబాబు తనయుడిగా లోకేశ్ సమర్థత విషయంలో సందేహాలు పెంచుతున్నారు. ఇప్పటికే చాలా మంది తగిన వారసుడు కాదనే భావిస్తున్నారు. పార్టీ నేతలకు కూడా పూర్తి నమ్మకం లేదు. అలాంటి సమయంలో మరింత తీవ్రంగా శ్రమించి, తనపై ఉన్న ముద్రలను తొలగించేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ లోకేశ్ దానికి భిన్నంగా సాగుతున్నారు. చివరకు కరోనా వేళ ఆంద్రప్రదేశ్ ని వీడి వెళ్లి హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారు. చంద్రబాబు వస్తే ఆయన వెంట అమరావతికి రావడం లేదంటే ట్విట్టర్ లో నాలుగు ట్వీట్లతో సంతృప్తి పడడం అన్న చందంగా తయారయ్యింది. ప్రజాక్షేత్రంలో దిగి ప్రజల మనసులు గెలిచే అవకావాన్ని చేజేతులా నీరుగార్చుకుంటున్నారు. వయసు రీత్యా తండ్రి తాను రాలేనని చెప్పేసిన తరుణంలో యువనేతగా బరిలో దిగాల్సిన లోకేశ్ అంతకన్నా భయపడడడం విచిత్రమే. వైరస్ కి హడలిపోయి హైదరాబాద్ లో దాక్కున్న నేత ఆంధ్రప్రదేశ్ కి ఎలా నాయకుడు కాగలరు..కనీసం సొంత పార్టీకి ఎలా సారధి కాగలరనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

లోకేశ్ మాటలు ఎన్ని చెప్పినా చేతలు భిన్నంగా ఉండడంతో చివరకు టీడీపీ కి తగిన నాయకుడు కాదనే అభిప్రాయం మరింత బలపడుతోంది. ఇటీవలి పరిణామాలతో ప్రజలకు మరింత దూరమవుతున్న తండ్రీ కొడుకులుగా కనిపిస్తోంది. చివరకు తాను పోటీ చేసిన మంగళగిరి ప్రజలకు కూడా మొఖం చాటేయడంతో లోకేశ్ మీద అనుమానాలు మరింత బలపడడం, టీడీపీకి నాయకత్వ లేమి స్పష్టంగా గోచరించడం గమనిస్తాం. ఇలాంటి తరుణంలో టీడీపీకి లోకేశ్ భారమే తప్ప పార్టీని పరిరక్షించే నాయకుడు మాత్రం కాదనే అభిప్రాయం రూఢీ అవుతుందని చెప్పక తప్పదు. వైఎస్సార్సీపీలో అనేక మంది యువ ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతుండగా ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేశ్ మాత్రం కేవలం మండలి సమావేశాలకు తప్ప మిగిలిన సమయంలో పక్క రాష్ట్రానికి వెళ్లిపోవడంతో ఇక దాదాపుగా కాడి వదిలేసినట్టుగా కనిపిస్తోంది. టీడీపీ ని కాపాడే బాధ్యత వయోభారంతో బాబు వల్ల కాదని, ఆయన తనయుడి తీరు అందకు తగ్గట్టుగా లేదని అంతా అంచనా వేయడానికి దోహదపడుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp