రాజధానికి ముంపు లేకుంటే కొండవీడు లిఫ్ట్ ఎందుకు కట్టారు బాబు?

By Siva Racharla Oct. 17, 2020, 09:31 am IST
రాజధానికి ముంపు లేకుంటే కొండవీడు లిఫ్ట్ ఎందుకు కట్టారు బాబు?

వర్షం కోసం రైతులు ఎదురుచూడటం సాధారణం. వరుణ దేవుడా కరుణించు అంటూ ఆకాశానికి మొక్కుతారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొందరికి వర్షాకాలం వచ్చిందంటే ఆందోళన మొదలవుతుంది. భారీ వరద వచ్చిందో "ఫ్లడ్ మేనేజ్మెంట్ లో" ప్రభుత్వ వైఫల్యం అంటూ విమర్శలు,కథనాలు మొదలవుతాయి? దానికి కారణం ఒక నాయకుడి కరకట్ట ఇల్లు, ఆ నాయకుడు రాజధాని ప్రాంతం ముంపు మీద చెప్పిన లెక్కలు.

నీటి ప్రాజెక్టులు అంటే సాధారణంగా నది మీదనో లేక కాలువ ద్వారా నీటిని తరలించి మరోచోట నీటిని నిలువ చేయటానికి రిజర్వాయర్లు,మోటార్లతో నీటిని తోడిపోసే లిఫ్ట్ పథకాలు గుర్తొస్తాయి. అందరూ చేసినట్లు చంద్రబాబు కూడా చేస్తే ఆయన ప్రత్యేకత ఏముంది?. అందుకే ఒక వాగులో నుంచి నదిలోకి నీటిని ఎత్తిపోయటానికి ఒక లిఫ్ట్ స్కీం ను కట్టారు. ఎందుకు కట్టారు అంటే రాజధాని ప్రాంతం వరదలో ఇరుక్కోకుండా,అమరావతి ముంపు ప్రాంతం కాదు అని చెప్పుకోవటానికి. ఆ స్కీం కొండవీటి లిఫ్ట్ ..

కొండవీటి వాగు ....

పేరేచెర్ల వద్ద కొండవీడు కొండల్లో పుట్టే కొండవీటి వాగు రెండుగా చీలి కుడి పాయ సుమారు 9 కి. మీ ఎడమ పాయ సుమారు 14 కి.మీ ప్రవహించి "లాం" వద్ద రెండుపాయలు కలుస్తాయి. అక్కడి నుంచి సుమారు 29 కి.మీ ప్రవహించి ప్రకాశం బ్యారేజి ఎగువున ఉండవల్లి వద్ద కరకట్ట రోడ్డును దాటి కృష్ణా నదిలో కలుస్తుంది. అంటే కొండవీటి వాగు సుమారుగా 42 - 44 కి.మీ మేర ప్రవహిస్తుంది.

కొండవీటి వాగులో అనేక వాగులు కలుస్తాయి. వీటిలో ఎర్రవాగు ఐదు నుంచి ఏడు కి.మీ ప్రవహించి కొండవీటి వాగులో కలుస్తుండగా కోటేళ్లవాగు మరియు పాలవాగు దాదాపు 18 కి.మీ మేర ప్రవహించి కొండవీటి వాగులో కలుస్తున్నాయి. 

అధిక వర్షం కురిసినప్పుడు కొండవీటి వాగు మరియు వాటి ఉప వాగుల నీటితో రాజధాని ప్రాంతంలోని తాడికొండ, నీరుకొండ, తుళ్లూరు, పెదపరిమి, కృష్ణాయపాలెం,కురగల్లు,ఎర్రబాలెం, నవులూరు , పెనుమాక,ఉండవల్లి గ్రామాలు రెండు నుంచి మూడు వారాలు ముంపుకు గురవుతాయి. కొండవీటి వాగు నీరుకొండకు వచ్చేవరకు వాలు బాగా తగ్గుతుంది,ఫ్లాట్ గా అవుతుంది. దీనితో ముంపు ప్రాంతం పెరుగుతుంది.

చంద్రబాబు తాడికొండ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేస్తూ ఆ ప్రాంతానికి అమరావతి(అసలు అమరావతి ఇక్కడికి 20 కి.మీ దూరంలో ఉంది ) అని నామకరణం చేశారు. రాజకీయ కారణాలతో కొందరు హర్షం వ్యక్తం చేయగా మరొకొందరు వ్యతిరేకించారు. రాజకీయాలకు అతీతంగా కొందరు ఆ ప్రాంతం ముంపు ప్రాంతమని,సాయిల్ కూడా గట్టిది కాదని అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు మరియు అతని మద్దతుదారులు అనుమానాలు వ్యక్తం చేసిన వారి మీద అభివృద్ధి నిరోధకులు అంటూ దాడిచేశారు.

అయితే ప్రభుత్వం చెప్పినదానికి దానికి చేసిన పనులకు పొంతన లేదు.కొత్త రాజధాని ప్రాంతం కొండవీటి వాగు ముంపు ప్రాంతం కాదంటూనే కొండవీటి వాగు నీటిని కృష్ణా నదిలో ఎత్తిపోయటానికి 240 కోట్ల రూపాయలతో కొండవీటి లిఫ్ట్ పథకాన్ని నిర్మించింది.

కొండవీటి లిఫ్ట్ ....


ఒక మోస్తరు వర్షం కురిసినా రాజధాని ప్రాంతం సంవత్సరంలో మూడుసార్లు వరద నీటిలో చిక్కుకుంటుందని అంచనా. కొండవీటి వాగు వరదలో రాజధాని ప్రాంతంలోని 10,000 ఎకరాలతో కలిపి మొత్తం 13,550 ఎకరాలు చిక్కుకుంటుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టం నుంచి +14 మీటర్ల నుంచి +20 మీటర్ల మధ్య ఉంటుంది. ప్రకాశం బ్యారేజి MSL +17.30 మీటర్లు . కొండవీటి వాగులో గరిష్టంగా 22000 క్యూసెక్కుల వరద అంటే ఒకే రోజులో 1.90 టీఎంసీ వరద రావటానికి అవకాశం ఉందని గడచిన 100 సంవత్సరాల డేటా ఆధారంగా లెక్క కట్టారు.

బ్లూ సిటి

రాజధాని ప్రాంతాన్ని ముంపు నుంచి రక్షించటానికి టాటా-ఆర్కాడిస్ (డచ్ కంపెనీ) ఒక సర్వే చేసి మూడు ఆప్షన్స్ ఇచ్చింది. మొదటి ఆప్షన్ ప్రకారం ఉప వాగులు కొండవీటి వాగులు కలిసే వద్దచిన్న చిన రిజర్వయిర్లు కట్టటం, ఒక కొండవీటి వాగును చీల్చి ఒక పాయను వైకుంఠపురం వద్ద నదిలో కల్పటం, ఉండవల్లి వద్ద లిఫ్ట్ పెట్టి నీటిని కృష్ణా నదిలో ఎత్తిపోయటం ప్రధాన పరిష్కార మార్గాలు. ప్రభుత్వం ఈ ఆప్షన్ ను ఎంచుకుంది. ఈ ఆప్షన్లలో రాజధాని చుట్టూ కాలువ పారుతుండటం గమనార్హం.


ఈ ప్రతిపాదన ప్రకారం రింగ్ రోడ్డు వెళ్లినట్లు రాజధాని ప్రాంతం చుట్టూ కాలువ వెళుతుంది. ఆ కాలువలో అర్ధ టీఎంసీ నీరు ఉంటుందన్న అంచానా.. దీనితో రాజధాని మొత్తం నీటితో సుందర నగరంగా కనిపిస్తుందని భావించారు.

మొదటి ఆప్షన్ ప్రణాలికను పూర్తి స్థాయిలో అమలుపరచకుండా కేవలం లిఫ్ట్ కట్టటానికి, గుంటూరు ఛానల్ మీద పాత రెగ్యులేటర్ పగలకొట్టి కొత్తది కట్టటానికే చంద్రబాబు ప్రభుత్వం అపరిమితం అయ్యింది. ముఖ్యంగా ఏ రిజర్వాయర్ పనులు చేపట్టలేదు.

కొండవీడు లిఫ్ట్ తో ఎంత ఉపయోగం?.

ఉండవల్లి వద్ద నదికి అతి సమీపంలో అంటే దాదాపు 200 మీటర్ల దూరంలో కరకట్ట రోడ్డులో 240 కోట్ల అంచనాతో 16 పంపులతో కొండవీటి లిఫ్ట్ స్కీం ను నిర్మించారు. ఈ లిఫ్ట్ ద్వారా 5000 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి,మరో 5000 క్యూసెక్కుల నీటిని కృష్ణా పశ్చిమ కాలువలోకి మళ్లించాలన్నది లక్ష్యం.

కొండవీటి లిఫ్ట్ ప్రతిపాదన దశలోనే దీనితో ఉపయోగం ఉండదని అధికారులు అభిప్రాయపడ్డారు. లిఫ్ట్ కట్టటం కన్నా గుంటూరు జిల్లా వడ్లమాను వద్ద రిజర్వాయర్ కట్టి కొండవీటి వాగు వరదను అందులోకి మళ్లిస్తే ఉపయోగం అని కూడా చెప్పారు. కొండవీటి వాగుకు 45-60 రోజులు వరద ఉంటుందని అంచన.


ప్రకాశం బ్యారేజి గేట్లు 17.39 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ప్రకాశం బ్యారేజి మీద రోడ్ 25 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నదిలో యావరేజ్ రివర్ బెడ్(నది అడుగు భాగం) లెవెల్ 11.28 మీటర్లు. అదే కొండవీటి వాగు బెడ్ లెవెల్ 11 మీటర్లు. అంటే రెండు నదులు ఒకే ఎత్తులో ఉన్నట్లు. వాటి లోతు మరియు వెడల్పు బట్టి నీటి లెవెల్స్ మారుతాయి. కొండవీటి వాగు కనిష్ట నీటి లెవెల్ 13 మీటర్లు కాగా గరిష్ట లెవెల్ 15 మీటర్లు. ప్రకాశం బ్యారేజిలో పూర్తిస్థాయిలో నీళ్లు ఉంటే లెవెల్ 15 మీటర్ల వద్ద ఉంటుంది. అందుకే ఎగువ నుంచి వరద వస్తుంటే ప్రకాశం బ్యారేజి నుంచి నీటిని కిందికి వదులుతారు.

పై లెక్కలన్నీ అర్ధంకాకపోయినా, కొండవీటి వాగు కంటే కృష్ణా నదిలో దాదాపు 2 మీటర్ల ఎత్తులో నీటి మట్టం ఉంటుంది. ఎంత స్పీడ్ గా నీటిని ఎత్తిపోసినా నీరు ఎదురుతన్నుతుంది, ఆప్రాంతం మొత్తం మునకలో ఉంటుంది. కృష్ణా నదిలో వరద ఉన్నప్పుడు కొండవీటి వాగు వరద నీటిని లిఫ్ట్ చేసి కృష్ణాలో పోయగలం అనుకోవటం అతి ఆశావహ దృక్పథం.

ఆంధ్రజ్యోతికి ఆత్రం ఎందుకు?

నదుల నిండా నీరు పారి రిజర్వాయర్లు నిండితే అందరు సంతోషిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు మరియు ఆయన అనుకూల ఆంధ్రజ్యోతికి మాత్రం కంటిమీద కునుకు ఉండదు. చంద్రబాబు కరకట్ట ఇంటిని ముంచటానికే ప్రభుత్వం ప్రకాశం బ్యారేజి నుంచి నీటిని వదలటం లేదని గంటల కొద్దీ కథనాలు ప్రసారం చేస్తారు. ఈ సారి ఏకంగా రాజధాని ప్రాంతాన్ని ముంచటానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని కథనాలు ప్రసారం చేశారు .

ఒక వైపు అమరావతి ప్రాంతం ముంపు ప్రాంతం కాదని వాదిస్తూ మరోవైపు మాత్రం కొండవీటి వాగు లిఫ్ట్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించి నీటిని ఎత్తి నదిలోపోయాలని డిమాండ్ చేయటం టీడీపీ నేతలకు,అనుకూల మీడియాకు చెల్లింది. రాజధాని ప్రాంతం ముంపు ప్రాంతం కాకుంటే కొండవీటి లిఫ్ట్ ఎందుకు కట్టారని మాత్రం అడగరు.


రాజధాని ప్రాంతంలో రెండు రిజర్వాయర్లు కడతామని ప్రకటించిన నాటి నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటనలు పేపర్లకే పరిమితం కాగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నదిలోకి నీటిని ఎత్తిపోయటానికి లిఫ్ట్ స్కీం ను కట్టిన ఘన చరిత్ర చంద్రబాబుది . ఆ ప్రాంతం రాజధానిగా ఎంపిక కాకముందు వర్షాకాలంలో గుంటూరు-అమరావతి మధ్య "లాం" వద్ద వాగు పొంగటం,రవాణా ఆగిపోవటం ప్రతిసంవత్సరం జరిగేదే. ఆప్రాంత స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొనే కొండవీడు లిఫ్ట్ కట్టింది. CRDA డాక్యుమెంట్లో పదివేల ఎకరాలను పది అడుగులు మేర ఎత్తు పెంచుతాము అని చెప్పటం వెనుక ఉన్న ముఖ్యకారణాలలో ఇదొకటి.

ఈ రోజు ఒంటి గంట ప్రాంతాల్లో కృష్ణా వరద ఉగ్రరూపం దాలుస్తుంది. సుమారు 9.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీని తాకుతుంది. ప్రకాశం బ్యారేజి 11.90 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి డిశ్చార్జ్ చేయగలదు.ఇంత వరదలో కొండవీడు లిఫ్ట్ ఈ మాత్రం నీటిని ఎత్తిపోస్తుందో చూడాలి.

కర్నూల్ ,హైద్రాబాద్,చెన్నై మునగలేదా అని ఎదురుదాడి చేసే చంద్రబాబు తెలుసుకోవాల్సిన విషయం కర్నూల్ హంద్రీ-తుంగభద్ర నదుల మధ్య ఉన్న భూభాగంలో పుట్టిన ఊరు,ఆ తరువాత విస్తరించింది. హైద్రాబాద్ నగర విస్తరణలో నాలాలు ,చెరువులు,మూసినదిని ఆక్రమించి ఆపార్ట్మెంట్లు కట్టటం వలన వరద నీరు పోయే మార్గం లేక ఇల్లు మునుగుతున్నాయి. చెన్నైలో ఏకంగా నదిని పూడ్చి ఎయిర్పోర్ట్ రన్ వే కట్టారు.. ఇవన్నీ ఆ నగరాలు అభివృద్ధి చెందే క్రమంలో జరిగిన రాజకీయ నాయకుల మరియు అధికారుల అవినీతి,బిల్డర్ల దురాశ,మధ్యతరగతి నిస్సహాయత వలన జరిగిన తప్పులు .. కానీ చంద్రబాబు ఏకంగా ముంపు ప్రాంతంలోనే ప్రపంచస్థాయి రాజధాని కడతానని ప్రకటించటం ఆయనకే చెల్లింది.రాజధాని ముంపు ప్రాంతం కాదని చెప్పుకోవటానికి ఇన్ని ఆపసోపాలు..

చంద్రబాబు ఎంత దబాయించి మాట్లాడిన వాగులో నుంచి నదిలోకి నీటిని ఎత్తిపోసే లిఫ్ట్ పథకం మరెక్కడా లేదనే సత్యం వెక్కిరిస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp