రాజకీయాలకు కమల్ రాంరాం!

By Ramana.Damara Singh May. 08, 2021, 12:03 pm IST
రాజకీయాలకు కమల్ రాంరాం!

L.p.రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు చేసిన తొలి ప్రయత్నం దారుణంగా విఫలం కావడం.. నేతలు రాజీనామా బాట పట్టడంతో తమిళనాడులో కమలహాసన్ పార్టీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యాం ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. దీంతో పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. కమలహాసన్ తీరుపై విమర్శలు గుప్పిస్తూ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో పార్టీ మనుగడపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

ప్రభావం చూపని కమల్

చిత్రసీమలో విశ్వనటుడిగా పేరుప్రఖ్యాతులు పొందిన కమలహాసన్ రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఈ ఎన్నికల్లో మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసిన ఎమ్మెన్నెమ్ పార్టీ 154 స్థానాల్లో బరిలోకి దిగినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌నే కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. 2018లో ఏర్పాటైన ఈ పార్టీ పరిస్థితి గత సార్వత్రిక ఎన్నికల కంటే దిగజారినట్లు లభించిన ఓట్లు స్పష్టం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో 37 ఎంపీ సీట్లలో పోటీ చేసిన కమల్ పార్టీ 3.78 శాతం పొందింది. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దాని ఓటు షేర్ 2.45 శాతానికి తగ్గిపోయింది. 44 నియోజకవర్గాల్లోనే 10వేల ఓట్ల మార్క్ దాటింది. 30 వేల ఓట్లు దక్కిన స్థానాలు మూడు మాత్రం కావడం గమనార్హం. ఈ ఫలితాలు పార్టీలో నిరాశ నిస్పృహలు నింపాయి.

రాజీనామాలు, ఆరోపణలు

ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీల్లో విభేదాలు మొదలయ్యాయి. పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ రాజీనామా చేశారు. అధ్యక్షుడు కమలహాసన్ నిరంకుశ వైఖరి కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని రాజీనామా లేఖలో ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ఉనికే కనిపించలేదని.. ఈ పరిస్థితుల్లో పార్టీ మనుగడ కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. మహేంద్రన్ వెళ్లిపోవడాన్ని కమల్ తప్పుపట్టారు. ఆయన్ను ద్రోహిగా అభివర్ణించారు. కాగా పార్టీ దారుణ ఓటమి, సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేకపోవడం, తన భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు అధికారంలోకి రాకపోవడం వంటి పరిణామాలు కమల్‌ ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడపడం కష్టమని భావిస్తున్న ఆయన ఈ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp