లోక్ సభ సీట్లు పెరుగుతాయా.. ప్రభుత్వం ఏం ఆశిస్తోంది..?

By Raju VS Jul. 30, 2021, 09:30 pm IST
లోక్ సభ సీట్లు పెరుగుతాయా.. ప్రభుత్వం ఏం ఆశిస్తోంది..?

దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు ఇంకా ఐదేళ్ల గడువు ఉంది. 2009 తర్వాత 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజనకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈసారి పార్లమెంట్ స్థానాలతో పాటుగా ఏపీ, తెలంగాణాలో అసెంబ్లీ స్థానాల పునర్విభజన కూడా జరగబోతోంది. చట్టం ప్రకారం ఏపీలో 225, తెలంగాణాలో 150 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. దాంతో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కారణంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంలో అనేక మార్పులకు ఆస్కారం ఉంటుందనడంలో సందేహం లేదు.

ఈలోగానే కేంద్రం మరో ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. లోక్ సభ స్థానాల సంఖ్య పెంచేందుకు సమాయత్తమవుతున్నట్టు వాదనలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మనీష్‌ తివారీ దానికి సంబంధించిన లెక్కలు ట్వీట్ చేశారు. ప్రస్తుతం 545 లోక్ సభ స్థానాలుండగా వాటిని వెయ్యికి పెంచే యోచనలో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా లోక్ సభ స్థానాలు పెంచడానికి అనుగుణంగానే నిర్మాణంలో ఉన్న కొత్త పార్లమెంటులో సీట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారని చెబుతున్నారు.

ముఖ్యంగా 2021 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ సీట్లు పెంచుతారని కొందరు వాదిస్తున్నారు. కానీ వాస్తవానికి 2011లో కరోనా కారణంగా జనగణన వాయిదా పడింది. 2011 లెక్కలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకున్నప్పటికీ జనాభా నియంత్రణ చేసి రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయనడంలో సందేహం లేదు. అందులో దక్షిణాది రాష్ట్రాల్లో స్థానాలు తగ్గిపోతుండగా, ఉత్తరాదిన అవి బాగా పెరుగుతున్నాయని మనీష్ తివారీ ట్వీట్లో పేర్కొన్నారు. ఆయన వేసిన అంచనాల ప్రకారం యూపీలో 80 నుంచి 193 సీట్లకు పెరుగుతాయని, బీహార్ కూడా అదే రేషియోలో లబ్దిపొందుతుందని పేర్కొన్నారు. కానీ తమిళనాడు, కేరళ, ఏపీ వంటి రాష్ట్రాలకు పెరిగే సీట్ల సంఖ్య ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువని చెబుతున్నారు.

జ‌నాభా నియంత్ర‌ణ విష‌యంలో ద‌క్షిణాది రాష్ట్రాలు ముందంజ వేశాయి. దాంతో అనివార్యంగా తక్కువ జనాభా మూలంగా తక్కువ పార్లమెంట్ సీట్లు ఆయా రాష్ట్రాల్లో పెరుగుతాయన్నది ప్రధాన వాదన. జ‌నాభా ప్రాతిప‌దిక‌న ఇప్ప‌టికిప్పుడు పార్ల‌మెంట్ స్థానాల సంఖ్య‌ల‌ను పెంచాల్సి వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్ల‌మెంట్ సీట్లు 25 నుంచి 52 కి పెరుగుతాయి. అదే విధంగా తెలంగాణ‌లో పార్ల‌మెంట్ సీట్లు 17 నుంచి 39 కి పెరుగుతుంది. అయితే, ఉత్త‌రాదిలో దానికి భిన్నంగా కనిపిస్తోంది. ఫలితంగా జనాభా నియంత్రణ చేసినందుకు పార్లమెట్ లో ప్రాతినిధ్యం తగ్గిస్తారా అనే ప్రశ్న ముందుకొస్తోంది.

2026లో జరగాల్సిన ఈ పునర్విభజన ముందస్తుగా చేసి దక్షిణాదిలో బలహీనంగా ఉన్న బీజేపీ లబ్దిపొందే ఆలోచన చేస్తుందని విమర్శకుల వాదన. కానీ పాలకపక్షం బీజేపీ నుంచి మాత్రం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనే చెబుతున్నారు. సీట్ల సంఖ్య పెరుగుదల, దానికి ప్రాతిపదికగా జనాభా లెక్కలు అనే అంశంపై బీజేపీ నేతలు సమాధానం సూటిగా ఇచ్చేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. దాంతో అంతర్గతంగా ఏదో జరుగుతోందనే వాదనకు బలం చేకూరుస్తోంది. మొత్తంగా బీజేపీ సీట్లు పెంచుతుందా, దానికి ముహూర్తం ఎప్పుడున్నది మాత్రం అధికారికంగా నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ నేతలు ఆలోచనలో ఉన్నారన్నది మాత్రం వాస్తవం. అందుకు పరిస్థితులు ఎప్పుడు అనుకూలిస్తే అప్పుడు నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp