అసెంబ్లీలో మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్న వైఎస్ జ‌గ‌న్

By Raju VS Jan. 18, 2020, 09:22 am IST
అసెంబ్లీలో మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్న వైఎస్ జ‌గ‌న్

ఏపీ ముఖ్య‌మంత్రి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపబోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా ఆయ‌న స‌న్న‌ద్ద‌మ‌వుతున్న‌ట్టుగా స‌న్నిహితులు చెబుతున్నారు. గ‌త నెల 17న అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కంప‌న‌లు పుట్టించింది. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. మూడు రాజ‌ధానుల అంశం రాష్ట్రంలో ఆస‌క్తిని రాజేసింది. ప్ర‌తిప‌క్షం రోడ్డెక్కింది. చంద్ర‌బాబుకి నూత‌న సంవ‌త్స‌రం, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి సంక్రాంతి కూడా లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఈసారి ప్ర‌త్యేకంగా జ‌ర‌గ‌బోతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నార‌నే ఆస‌క్తి రేగుతోంది.

గ‌త నెల రోజులుగా అమ‌రావ‌తి ప‌రిధిలోని కొన్ని గ్రామాల్లో ఆందోళ‌న‌లు క‌నిపిస్తున్నాయి. పెద్ద స్థాయిలో నిర‌స‌న‌లు సాగుతున్నాయి. పెయిడ్ అర్టిస్టులంటూ ప్ర‌భుత్వ పెద్ద‌లు ఆరోపిస్తున్న‌ప్ప‌టికీ కొంద‌రు స్థానికులు మాత్రం ప‌ట్టువ‌ద‌ల‌కుండా ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తున్నారు. అలాంటి ఆందోళ‌న‌ల‌తో ఉన్న వారంద‌రితో చ‌ర్చిస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్పింది. కానీ అది ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌లేదు. ఎవ‌రికీ అన్యాయం జ‌ర‌గ‌బోద‌ని, అన్ని ప్రాంతాల‌కు న్యాయం చేసేందుకు ఇలాంటి నిర్ణ‌యం అంటూ న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం సాగింది. కానీ కొన్ని గ్రామాల ప్ర‌జ‌లు మాత్రం స‌సేమీరా అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ముందు ఇప్ప‌టికే మూడు క‌మిటీల నివేదిక‌లు చేరాయి. వాట‌న్నింటినీ బేరీజు వేసుకుని, రాజ‌ధాని ప్రాంత వాసుల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి భిన్నంగా రాజ‌ధానుల అంశంలోనూ, సీఆర్డీయే భ‌విత‌వ్యం పైనా స‌మ‌గ్రంగా చ‌ర్చించేందుకు ప్ర‌త్యేకంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం అసెంబ్లీ స‌మావేశాలు ఏర్పాటు చేస్తోంది. రెగ్యుల‌ర్ స‌మావేశాల్లో భాగంగా ఈ అంశాల మీద చ‌ర్చ కాకుండా కేవ‌లం రాజ‌ధాని గురించి, రాష్ట్ర భ‌విష్య‌త్ గురించి స‌మావేశాలు నిర్వ‌హించ‌డ‌మే కీల‌కాంశం. అలాంటి స‌మ‌యంలో త‌గిన రీతిలో ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌డ‌తామ‌ని, మూడు రాజ‌ధానుల అంశంలో ప్ర‌భుత్వ తీరులో లోపాల‌ను స‌భ సాక్షిగా ప్ర‌జ‌ల ముందుంచుతామ‌ని ప్ర‌తిప‌క్ష టీడీపీ అంటోంది. మండ‌లి వేదిక‌గా అలాంటి అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని భావిస్తోంది. ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని చూస్తోంది. కానీ అలాంటి అవ‌కాశం ఇచ్చే యోచ‌న‌లో జ‌గ‌న్ స‌ర్కారు క‌నిపించ‌డం లేదు. ప్ర‌తిప‌క్షానికి ఛాన్స్ లేకుండా చేయాల‌ని చూస్తోంది. దానికి అనుగుణంగా క‌స‌రత్తులు కూడా చేస్తోంది.

వివిధ డాక్యుమెంట్లు, రికార్డు ఎవిడెన్సుల సాక్షిగా స‌భ‌లో ప్ర‌తిప‌క్షానికి బ్రేకులు వేసే యోచ‌న‌లో సాగుతోంది. ఈ విష‌యంలో సీఎం జ‌గ‌న్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌లో కూడా తానే స్వ‌యంగా మూడు రాజ‌ధానుల అవ‌స‌రం రావ‌చ్చు అంటూ సంకేతాలు ఇచ్చిన త‌రుణంలో ఇప్పుడు ప్ర‌జ‌ల్లో అనుమానాలు, అపోహ‌ల‌న్నీ తొల‌గించ‌డానికి ఆయ‌నే స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌త నెల‌రోజులుగా వివిధ పార్టీలు,మీడియా సంస్థ‌లు సాగించిన ప్ర‌చారాల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ, ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ సిద్ధం చేసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో రాజ‌ధాని ప్రాంతంలో సాగిన భూదందాకి సంబంధించిన మ‌రిన్ని ఆధారాల‌ను ప్ర‌జ‌ల ముందు అసెంబ్లీ ద్వారా బ‌య‌ట‌పెట్టే యోచ‌న‌లో ఉన్నారు.

వాట‌న్నింటినీతో పాటుగా అమ‌రావ‌తిని ఏం చేయ‌బోతున్నారు..భూములిచ్చిన వారికి ఎలాంటి భ‌రోసా క‌ల్పించ‌బోతున్నార‌న్న‌దానిపై పూర్తి క్లారిటీతో ప్ర‌భుత్వం ముందుకు రాబోతోంది. ఎవ‌రికీ న‌ష్టం క‌ల‌గ‌కుండా ఉండేందుకు భారీ ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పించే యోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆందోళ‌న‌తో ఉన్న వారికి ఉప‌శ‌మ‌నం క‌ల్పించడ‌మే ల‌క్ష్యంగా ఈ ప్యాకేజీ ఉంటుంద‌ని, భూములిచ్చిన వారికే ఆప్ష‌న్లు ఇచ్చి వారు కోరుకున్న రీతిలో చేస్తామ‌ని చెప్ప‌డానికి సీఎం సిద్ధ‌మ‌వుతున్నట్టు చెబుతున్నారు. అమ‌రావ‌తిలో అసెంబ్లీ ఉంటుంది కాబ‌ట్టి, ఆందోళ‌న ప‌డ‌కుండా అగ్రి జోన్ స‌హా ఇత‌ర అనేక అవ‌కాశాల గురించి ఇటీవ‌ల ప్ర‌భుత్వం ముందుకు ప‌లు సంస్థ‌లు తీసుకొచ్చిన ప్ర‌తిపాద‌న‌లు కూడా స‌భ‌లో వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. మొత్తంగా సీఎం స్వ‌యంగా స‌భ‌లో చేయ‌బోయే ప్ర‌క‌ట‌న సంచ‌ల‌న విష‌యాల‌తో విప‌క్షాల‌కు గ‌ట్టి స‌మాధానం అవుతుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. అయితే ఏం చెబుతారు..ఎంత‌మేర‌కు సంతృప్తి ప‌రుస్తారు..ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయ‌న్న‌ది వ‌చ్చే వారంలోనే స్ప‌ష్ట‌త రాబోతున్న త‌రుణంలో అంద‌రి దృష్టిలో ఇది హాట్ టాపిక్ గా మారుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp