సొంత నియోజకవర్గంలో బాబు బలం ఎంత?

By Krishna Babu Jul. 05, 2020, 10:03 pm IST
సొంత నియోజకవర్గంలో బాబు బలం ఎంత?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఘనాపాటిగా చూపే ప్రయత్నంలో ఆయనకు అనుకూలంగా పనిచేసే పత్రికలు మీడియా అనేక కోణాల్లో కధనాలు రాస్తూ ప్రచురిస్తూ ఉంటాయి. ఇక ఈ విషయంలో "పలుకు"ల పత్రిక వ్యవహార శైలి కొత్తగా చెప్పనవసరం లేదు . ఒక విషయం పై చిత్ర విచిత్ర కధనాలతో తమ దృక్కోణాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా సదరు పత్రిక మరో అడుగు ముందుకు వేసి రాజకీయంగా కాస్త అవగాహన ఉన్న పాఠకులు సైతం ఆశ్చర్యపడేలా "ఆపరేషన్ చంద్రగిరి" పేరిట ఒక కధనం అచ్చువేసింది.

ఆ పత్రిక అచ్చువేసిన ఆపరేషన్ చంద్రగిరిలో ఉన్న సారాంశం చూస్తే తెలుగుదేశం అధ్యక్షుడు సొంత గ్రామం నారావారిపల్లె ఉన్న నియోజకవర్గం చంద్రగిరిలో పేదలకు ఇళ్ల స్థలాల పేరిట ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశాన్ని పూర్తిగా బలహీన పరిచే లక్ష్యంతో అధికార పక్షం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని చంద్రగిరి మండలంలో తిరుపతి పేదలకు భారీ సంఖ్యలో ఇళ్ల స్థలాలు ఇచ్చి వారిని ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందని అధికార పక్షం పన్నిన ఈ వ్యూహంతో తెలుగు దేశానికి సంప్రదాయబద్దంగా వస్తున్న ఓటు బ్యాంకు భారీగా దెబ్బతినే అవకాశం ఉందంటూ ఒక వాదనని తెరపైకి తీసుకుని వచ్చారు.

ఈ వార్తను చూసిన సామాన్యులకి అధికార పక్షం వై.యస్.ఆర్ కాంగ్రెస్ నిజంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే ఆయన బలం తగ్గించే ప్రయత్నం చేస్తుందా? ఇళ్ల స్థలాల పేరిట బలంగా ఉన్న ప్రత్యర్ధుల నియోజక వర్గాల ఓటు బ్యాంకు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుందా అనే అనుమానం రాక తప్పదు. కాని వాస్తవాన్ని పరిశీలించి చూస్తే ఆ పత్రిక రాసిన వార్తలో ఉన్న డొల్లతనం బహిర్గతం అవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి సొంత గ్రామం నారావారి పల్లి ఉన్న చంద్రగిరి నియోజక వర్గంలో ఒక్కసారి కూడా విజయం సాధించిన దాఖలాలు లేవు.

1978 లో చంద్రగిరి నియోజక వర్గం నుండి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్ధిగా తొలిసారి పోటీ చేసి జనతా పార్టీ అభ్యర్ధి పట్టాబిరామ చౌదరి పై గెలిచిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆవిర్భావం అనంతరం జరిగిన ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్ నుండి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్ధి సి.మల్లవరానికి చెందిన మేడసాని వెంకట్రామ నాయుడు (అలియాస్ మీసాల నాయుడు) చేతిలో 17,429 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఓటమి తరువాత తెలుగుదేశంలో చేరిన బాబు 1985 లో జరిగిన మద్యంతర ఎన్నికల్లో కర్షకపరిషత్ చైర్మన్ గా ఉంటూ పోటీ చేయనప్పటికీ ఆ ఎన్నికలో తెలుగుదేశం తరుపున పోటీ చేసిన అయ్యదేవ నాయుడు గెలుపొందారు . ఆ తరువాత 1989లో జరిగిన ఎన్నికల్లో సొంత నియోజకవర్గాన్ని వదిలి కుప్పానికి వలస వెళ్లారు చంద్రబాబు. ఆనాటి నుండి నేటి వరకు ఏనాడు తిరిగి చంద్రబాబు చంద్రగిరి నుండి పోటీకి దిగలేదు.

Also Read: చతురత - వాగ్ధాటి - అనుభవం అన్నీ కలిసి రోశయ్య

1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గల్లా అరుణ కుమారి గెలవగా , 1994 లో ఎన్.టి.ఆర్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో మాత్రమే నారా చంద్రబాబు తమ్ముడు అయిన నారా రామ్మూర్తి నాయుడు కేవలం 16,352 ఓట్ల మెజారిటీతో చంద్రగిరి నియోజక వర్గంలో గెలుపొందారు. ఆ తరువాత రామారావును ముఖ్యమంత్రి పదవి నుండి దింపి బాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో జరిగిన ఏ ఎన్నికలోనూ బాబు సొంత గ్రామం ఉన్న చంద్రగిరి నియోజక వర్గంలో తెలుగుదేశం గెలిచిన దాఖలాలు లేవు అంటే చంద్రబాబు సొంత నియోజకవర్గంలో నాయకులను తయారు చేయడంలో ఏ స్థాయిలో విఫలం చెందారో అర్ధం చేసుకోవచ్చు.

ఇక రాష్ట్ర విభజన తరువాత 2014లో తొలిసారి బరిలోకి దిగిన చెవిరెడ్డి బాస్కర రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుండి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్ధి , కాంగ్రెస్ పార్టీ నుండి వరసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన గల్లా అరుణకుమారి మీద 4,500 మెజారిటీతో గెలిచారు. ఇక 2019 వచ్చే సరికి చంద్రగిరిని ఎలాగైనా గెలుచుకోవాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఎన్నికలకన్నా దాదాపు 8 నెలల ముందు 2018 సెప్టెంబర్లో పులిపర్తి నానిని అభ్యర్థిగా ప్రకటించి, నానిని గెలిపించుకొని రండి లేకుంటే తనవద్దకు రావద్దని చంద్రగిరి నాయకులకు చెప్పారు. అనేక ఉద్రిక్తతల నడుమ బలహీనవర్గాలను ఓటింగ్ కు రాకుండా అడ్డుకున్నారు అనే నేపద్యంలో జరిగిన రీపోలింగ్ ను వైసీపి స్వాగతించగా తెలుగుదేశం వ్యతిరేకించింది. ఇలాంటి సమయంలో కూడా చెవిరెడ్డి ఏకంగా 41,755 వేల మెజారిటీతో గెలుపొందారు. చంద్రగిరిలో అభ్యర్ధికి 20 వేల మెజారిటీ దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం .

Also Read: వైయస్సార్‌ ఓటమి అంచుల వరకు వెళ్లిన 1996 లోక్ సభ ఎన్నిక

ఇలా చంద్రబాబు సొంత గ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో 1978 నుండి 2020 వరకు జరిగిన 10 ఎన్నికల్లో బాబు తొలి సారి కాంగ్రెస్ నుండి గెలిచిన దానిని పక్కన పెడితే తెలుగుదేశం ఆవిర్భావం తరువాత కేవలం మూడు సార్లు మాత్రమే ఆ నియోజక వర్గంలో తన ఉనికిని చాటుకోగలిగింది. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆ నియోజకవర్గాన్ని గెలిపించుకోలేక పోయారు. పేరుకు చంద్రబాబు సొంత గ్రామం ఉన్న నియోజకవర్గం అయినా తెలుగుదేశానికి అత్యంత బలహీనమైన నియోజక వర్గాల్లో చంద్రగిరి ఒకటిగా చెప్పవచ్చు. గడచిన ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగి పోటీ చేసిన తన కుమారుడు లోకేష్ ని సొంత నియోజకవర్గం చంద్రగిరిలో పోటీకి దింపకుండా మంగళగిరి స్థానాన్ని ఎంచుకున్నారు అంటేనే చంద్రబాబుకి ఆ నియోజక వర్గం పై ఉన్న పట్టుని అర్ధం చేసుకోవచ్చు.

తెలుగుదేశానికి అత్యంత బలహీనమైన ఇటువంటి నియోజక వర్గంలో అధికార పక్షం చేపట్టిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డు పెట్టుకుని ఆపరేషన్ చంద్రగిరి అంటు, చంద్రబాబుని సొంత నియోజకవర్గంలోనే బలహీన పరచడానికి అధికార పక్షం పన్నిన ఎత్తులు అంటు సత్యదూరమైన వార్తను ప్రచురించి చంద్రబాబుని బలవంతుడిగా చూపే ప్రయత్నం చేయడం ఆ పత్రికకే చెల్లింది. ఈ దేశంలోనే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏకంగా 26.6 లక్షల ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చే ఎనిమిదవ తారీఖు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుడితే ఏదో విదంగా ఆ కార్యక్రమానికి రాజకీయ రంగు పులిమి పలుచన చేసే విధంగా చంద్రబాబుకి వంత పాడే పత్రికలు మీడియా ప్రయత్నం చేయడం శోచనీయం .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp