ప్రజల్ని మోసం చేయడం వల్లే చంద్రబాబు రాష్ట్రంలో తిరగలేకపోతున్నారా.?

By Amar S Dec. 04, 2019, 03:03 pm IST
ప్రజల్ని మోసం చేయడం వల్లే చంద్రబాబు రాష్ట్రంలో తిరగలేకపోతున్నారా.?

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో తిరగలేకపోతున్నారా..? అధికారంలో ఉన్నపుడు ఆయన తీసుకున్న నిర్ణయాలే ఆయన ప్రస్తుతం అడుగు బయట పెట్టలేకపోవడానికి కారణాలవుతున్నాయా.? రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆయనకు జన నీరాజనాలకు బదులు నిరసనలు ఎదురవుతున్నాయా.? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. గతంలో జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసినా ఎక్కడా ఆయనను అడ్డుకోలేదు. ఎక్కడో చిన్నా చితకా తెలుగుదేశం శ్రేణులే ఆయనను వ్యతిరేకించినా అవి పెద్దగా లెక్కలోకి రాలేదు. అయితే ఇటీవల చంద్రబాబు చేసిన పర్యటనలన్నీ వివాదాస్పదం అవుతున్నాయి. అమరావతిలో పర్యటించేందుకు వెళ్లిన చంద్రబాబును ముందు భూములు తీసుకున్న తమకు సమాధానం చెప్పి వెళ్లాలని రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే.. ఈ నిరసనలో ఆయన కాన్వాయ్ పై చెప్పులు కూడా విసిరారు. అనంతరం చంద్రబాబు కర్నూలుకు వెళ్లగా అక్కడ కూడా నిరసన సెగలు కనిపించాయి. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తానని వాగ్ధానం చేసిన చంద్రబాబు ముందు దానికి సమాధానం చెప్పాలని పలువురు విద్యార్ధి సంఘ నేతలతోపాటు, అడ్వకేట్ జేఏసీ ఆయనను నిలదీసింది.. ఈ క్రమంలో మళ్లీ చంద్రబాబు చేపట్టిన కర్నూలు జిల్లా పర్యటన వివాదాస్పదమైంది. మూడురోజులపాటు కర్నూలు జిల్లాలో పర్యటించి పార్టీ బలోపేతమే లక్ష్యంగా, రానున్న లోకల్ బాడీ ఎలక్షన్ ను కాష్ చేసుకునేలా ప్రభుత్వమే టార్గెట్ గా చంద్రబాబు ప్లాన్ చేసుకున్న పర్యటనలో ఆయనే టార్గెట్ అయిపోయారు..

Read Also: బాబు ప్ర‌తిప‌క్ష హోదాకి ముప్పు త‌ప్ప‌దా..!

సోమవారం జిల్లాలోకి అడుగుపెట్టిన చంద్రబాబుకు మొదటిరోజు జిల్లాలో వివిధ నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్ష నిర్వహించారు.. కర్నూలులోని పీజేఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈసమావేశానికి పార్టీ ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గానికి చెందిన ఇంచార్జిలు, పార్టీ కీలక నాయకులతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించారు. సోమవారం ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్‌, నందికొట్కూరు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు మాట్లాడారు. గతంలో కడప జిల్లాలో సమీక్ష జరుతున్నపుడు తన ఎదుటే తెలుగు తమ్ముళ్లు కుమ్ముకోవడంతో ఈసారి చంద్రబాబు అండ్ టీం జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈసారి పార్టీ కార్యకర్తలనుంచి కాకుండా విద్యార్ధి సంఘాలు, అడ్వకేట్ జేఏసీ నాయకులు షాకిచ్చారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తామని గతంలో హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారంటూ ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అలాగే రెండోరోజు కూడా అదే కర్నూలు వీజేఆర్ కన్వెన్షన్ హాలులో దివ్యాంగులతో చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం నందికొట్కూరు, ఆళ్లగడ్డ, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, నంద్యాల నియోజకవర్గ కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయి సమీక్ష చేసారు. మళ్లీ వైసీపీ బాధితులను పరామర్శించే కార్యక్రమం చేయడం, నగరంలో చంద్రబాబు పర్యటించాల్సిరావడంతో అప్పటికే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చిన ఆందోళనకారులను ముందుగానే పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నా మరికొందరు చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేసారు.

Read Also: జనసేనాని కమల దళ సైనికుడు కాబోతున్నాడా ?

ఈ నేపధ్యంలో చంద్రబాబు ఇదే అక్కసును ప్రభుత్వంపై వెళ్లగక్కారు. మీడియాతో మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు.వైసిపి ప్రభుత్వం వచ్చాక తమపై 600 పైగా దాడులు జరిగాయని, టిడిపి నేతలపై దాడులు చేస్తుంటే సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడుల విషయంలో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేను ఎదురు తిరిగితే మీరు తట్టుకోలేరు..ఒక్కసారి మా వాళ్ళు తిరగబడితే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల కన్నీరే వైసీపీ ప్రభుత్వానికి శాపంగా మారుతుందని, జగన్ లో ఏమాత్రం కడప పౌరుషం ఉంటే తన చిన్నాన్నను హత్యచేయించిన వారిని అరెస్టు చేయించాలని డిమాండ్ చేసారు. ఏదేమైనా ఒక ప్రధాన ప్రతిపక్షనేత, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు 4 దశాబ్ధాల అనుభవం ఉన్న నాయకుడు పట్టుమని ప్రశాంతంగా నాలుగురోజుల పాటు రాష్ట్రంలో తిరగలేకపోతున్నారంటే రాజకీయంగా ఆయన ప్రజల్ని ఏవిధంగా మోసం చేసారో అర్ధం చేసుకోవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp