విజయసాయిరెడ్డి ప్రశ్న.. బాబు వద్ద సమాధానం ఉందా..?

By Kotireddy Palukuri Oct. 23, 2020, 06:47 pm IST
విజయసాయిరెడ్డి ప్రశ్న.. బాబు వద్ద సమాధానం ఉందా..?

బుల్లెట్‌ లాంటి మాటలతో.. బాణాళ్లాంటి సెటైర్లతో తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేతను వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఇరకాటంలో పెడుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా.. ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలోనైనా.. విజయసాయి రెడ్డి పని తీరు టీడీపీ పట్ల ఏ మాత్రం మారలేదు. నిత్యం సోషల్‌మీడియాలో టీడీపీకి కౌంటర్లు, చంద్రబాబు తీరును ఏకిపెడుతుంటారు. తాజాగా.. అమరావతిపై చంద్రబాబు చేస్తున హడావుడిని విజయసాయిరెడ్డి ఎండగట్టారు. ‘‘వాస్తవాలకు దూరంగా, గ్రాఫిక్స్‌ హోరు తప్పా.. తమరు పెట్టిన నాలుగు వెల్ఫేర్‌ స్కీంల పేర్లు చెప్పండి బాబూ..?’’ అని ప్రశ్నించారు.

9 ఏళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు ఏపీకి.. వెరసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడుకి విజయసాయి రెడ్డి వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ఏ మాత్రం కష్టం కాబోదు. కానీ 14 ఏళ్లలో చంద్రబాబు.. తనంటూ ప్రత్యేకంగా ప్రజల కోసం చేసిన పని, చేపట్టిన పథకం ఒక్కటైనా లేకపోవడంతోనే విజయసాయిరెడ్డి లాంటి రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. తమరు పెట్టిన నాలుగు వెల్ఫేర్‌ స్కీంలను చెప్పామంటే.. బాబు తడుముకోవాల్సిన పరిస్థితి.

కొంత మంది ముఖ్యమంత్రులు కొద్ది కాలంపాటు పని చేసినా.. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి వారిలో ఎన్‌టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డిలు ముందు వరుసలో ఉంటారు. వారు భౌతికంగా లేకున్నా వారు పెట్టిన పథకాలు పొందుతున్న ప్రజలు నిత్యం వారిని తలుచుకుంటూనే ఉన్నారు. ఆయా పథకాల గురించి మాట్లాడితే.. వారిని తప్పకుండా స్మరించుకోవాల్సిందే. రెండు రూపాయల కిలో బియ్యం పథకం, మద్యపాన నిషేధం అనగానే ఎన్‌టీ రామారావు గుర్తుకు వస్తారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌మెంట్‌ అంటే.. వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ప్రజలు తలుచుకుంటారు.

విజయసాయి రెడ్డి అన్నట్లు ఇలాంటి పథకాలు నాలుగు కాదు కదా.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఒక్కటి కూడా లేకపోవడం కూడా ఒక చరిత్రే. సెల్‌ఫోన్‌ను కనిపెట్టాను, డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశాను, హైదరాబాద్‌ను కట్టాను, టెక్నాలజీని కనిపెట్టి ప్రమోట్‌ చేశాను, కేంద్రంలో చక్రం తిప్పాను, రాష్ట్రపతులను, ప్రధానులను ఎంపిక చేశాను.. లాంటి మాటలు తప్పా చంద్రబాబు నోటి నుంచి ఇప్పటి వరకూ తాను ఫలానా పథకం ప్రవేశపెట్టానని గొప్పగా చెప్పిన సందర్భంగా ఒక్కటి కూడా లేదంటే ఆయన అభిమానులకు కూడా ఒప్పుకోకతప్పని పరిస్థితి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp