హెరాయిన్ కథలో విజయవాడ తర్వాత ఇప్పుడు కృష్ణపట్నం

By Raju VS Sep. 23, 2021, 11:15 am IST
హెరాయిన్ కథలో విజయవాడ తర్వాత ఇప్పుడు కృష్ణపట్నం

గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ ని ఏదో రకంగా ఏపీతో ముడిపెట్టాలని టీడీపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. నేరుగా చంద్రబాబు కూడా రంగంలోకి దిగేశారు. దిగువ స్థాయి నేత మాదిరిగా విమర్శలు చేసేశారు. డీఆర్ఐ పరిధిలో ఇంకా విచారణ దశలో ఉన్న ఈ కేసులో అసలు నిందితుడు సీఎం నివాసానికి చేరువలో ఉన్నాడంటూ వ్యాఖ్యానించడం ద్వారా ఆధారాలు అవసరం లేని విమర్శలకు పూనుకున్నట్టు చాటుకున్నారు. అదే సమయంలో ఆంధ్రజ్యోతి మరో అడుగుముందుకేసింది. కేవలం ముంద్రా రేవులోనే కాకుండా కృష్ణపట్నంలోకి కూడా డ్రగ్స్ వచ్చేశాయని రాసేశారు. పైగా వారికి విశ్వసనీయ సమాచారం అంటూ కహానీలు అల్లేశారు.

అదానీకి చెందిన పోర్టులో 3వేల టన్నుల హెరాయిన్ పట్టుబడడం కలకలం రేపుతోంది. ఏకంగా సుమారు రూ. 21వేల కోట్ల ఖరీదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. టాల్కమ్ పౌడర్ ముసుగులో సాగుతున్న ఈ అక్రమ మత్తుపధార్థాల రవాణా కోసం విజయవాడకు చెందిన ఓ ఇంటి అడ్రస్ ని పేర్కొనడంతో పచ్చ మీడియా రెచ్చిపోయింది. చేతికొచ్చిన పైత్యమంతా ప్రదర్శించింది. ఆంధ్రప్రదేశ్ పరువుని తీసేలా వ్యవహరించింది. ఈ భాగోతంపై కేసు గుజరాత్ లో నమొదయ్యింది. ఆ డ్రగ్స్ ఢిల్లీ తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. చెన్నైలో నివాసం ఉంటున్న మాచవరపు సుధాకర్ , అతని భార్యని అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్ఐ ఈ కేసులో దర్యాప్తు సాగిస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కి సంబంధం లేకపోయినా టీడీపీ విమర్శలకు, పచ్చ బ్యాచ్ రాతలకు హద్దూ పద్దూ లేదన్నట్టుగా సాగింది.

Also Read:కొడాలి మీదికి వంగవీటి అస్త్రం - బాబు మార్క్ వాడకం

చివరకు పోలీసులు వివరణ ఇచ్చారు. డీఆర్ఐ కూడా ఏపీ లింకులన్నీ తేలిపోవడంతో ఇక్కడికి సంబంధం లేదని తేల్చుకుని దర్యాప్తులో తలమునకలై ఉన్నారు. దేశంలోని వివిధ నగరాల్లో ఆధారాల కోసం సాగుతున్నారు. అదే సమయంలో ఆంధ్రజ్యోతి మాత్రం మరో అడ్డగోలు కథనానికి తెరలేపింది. ఉత్తరాదిన ముంద్రా, దక్షిణాదిన కృష్ణపట్నం అంటూ సూత్రీకరించేసింది. కృష్ణపట్నం రేవులో డ్రగ్స్ దిగుమతి అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం పేరుతో ఓ కహానీ వండి వార్చేసింది. వాస్తవాలతో సంబంధం లేకుండా, అధికారిక వివరణలు లేకుండా తోచిందల్లా రాసేసి, ఏపీ ప్రభుత్వం మీద బురదజల్లాలనే యత్నమే తప్ప డ్రగ్స్ మాఫియా వాస్తవాలు వెల్లడించాలనే ఉద్దేశం ఆపత్రికకు లేదని ఇప్పటికే అర్థమయ్యింది.

కృష్ణపట్నంలో గానీ మరో రేవులో గానీ ఎటువంటి అక్రమాలు జరిగినా బాధ్యత కలిగిన మీడియాగా అప్రమత్తం చేయడం వేరు. కానీ ఇప్పుడు దేశంలో సంచలనంగా మారిన కేసులో కృష్ణపట్నం పోర్టుని ముడపెట్టడం వేరు. ఇదంతా జగన్ మీద ఉన్న అక్కసుతో ఆంధ్రప్రదేశ్ ని బద్నాం చేసేందుకు సైతం వెనుకాడని వైనాన్ని చాటుతోంది. ప్రజలను పక్కదారి పట్టించి పబ్బంగడుపుకోవాలనే లక్ష్యం స్పష్టమవుతోంది. ఏపీలో ఇలాంటి కుయత్నాలను గతంలోనే జనం తిరస్కరించారు. అయినా బుద్ధి మారకుండా కుట్రలు చేస్తున్న తీరు సామాన్యులకు సైతం అర్థం అవుతుందనడంలో సందేహం లేదు.

Also Read: తెలంగాణ‌లో చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp