ఆ వార్తలో నిజం లేదు - ఐపాక్ ప్రకటన

By Krishna Babu Jul. 02, 2020, 10:21 pm IST
ఆ వార్తలో నిజం లేదు - ఐపాక్ ప్రకటన

గత ఎన్నికల్లో వై.యస్ జగన్ అఖండ మెజారిటీతో గెలిచిన రోజు నుండీ రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చిన సంక్షేమ పధకాలను దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత శరవేగంగా అమలు చేస్తూ ఇప్పటికే తనది సంక్షేమ రాజ్యం అని నిరూపించుకున్నారు. ఇక ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మరిని సైతం సమర్దవంతంగా ఎదుర్కుంటూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. అయితే ప్రజల్లో తనదైన శైలిలో పాలనపరంగా చెరగని ముద్ర వేసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ పై ఏదొక రూపంలో రోజుకొక అసత్యాన్ని ప్రచారంలో పెట్టి జగన్ ప్రభుత్వాన్ని పలుచన చేసే కుట్రలు చేస్తూనే ఉన్నాయి ప్రతిపక్షానికి అనుకూలంగా వంతపాడే కొన్ని పత్రికలు .

నిన్నటి రోజున దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజల ఆరోగ్యమే తనకి ఉన్న మొదటి ప్రయారిటి అని చాటి చెప్పేలా ఒక్కసారే 1088 అంబులెన్సులని ప్రవేశ పెట్టారు. జగన్ ప్రభుత్వం నిర్వహించిన ఈ సంచలన కార్యక్రమంపై రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు, సినీ , క్రీడా రంగ దిగ్గజాల నుండి ప్రశంసల అందాయి . అయితే దీని నుండి ప్రజల దృష్టిని మరల్చడనికి ఒక వర్గ మీడియా పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. ఇప్పటికే 108 పై పలు ఆరోపణలు చేసి పలుచన అయిన ఆ సంస్థలు తాజాగా మరో అసత్యన్ని భుజాన వేసుకుని విష ప్రచారానికి పూనుకొన్నాయి .

వాలంటీర్లపై పీకే అంటూ ప్రచారం

పంచాయతీ రాజ్ మునిసిపల్ శాఖల పరిదిలో పనిచేయాల్సిన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ పై పెత్తనాన్ని ప్రభుత్వం ప్రయివేటు సంస్థకి కట్టబెడుతుందని , ఆ ప్రవేటు సంస్థ ఎవరో కాదు గత ఎన్నికల సమయంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీమే అని, ఇది కచ్చితంగా ఈ వ్యవస్థని అడ్డం పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ , ప్రశాంత్ కిషోర్ పధకం రచించారని, దీనికోసం ప్రజల సొమ్మును ప్రభుత్వం ప్రశాంత్ కిషోర్ కి కట్టబెడుతుందని ఒక వార్తని సదరు ఆంద్రజ్యోతి పేపర్ అచ్చు వేసింది. కనీసం ఒక వార్త రాసే ముందు ప్రభుత్వం వివరణ కోరి ఆపై వార్త అచ్చు వేయాలనే కనీస నైతిక నియమావళిని సైతం పాటించకుండా జర్నలిజం సంప్రదాయాల్ని , విలువల్ని , ప్రభుత్వం పై ప్రజల్లో చులకన భావన ఏర్పరచాలనే లక్ష్యంతో దుష్ప్రచారానికి తెర లేపింది.

అయితే నిరాధారమైన ఈ ప్రచారాన్ని ప్రశాంత కిషోర్ తోసిపుచ్చారు. సదరు ఆంద్రజ్యోతి పేపర్ లో వచ్చిన వార్తలో ఎటువంటి నిజం లేదని తన కంపెనీ ఐపాక్ ట్విట్టర్ ఐడీ నుండి పోస్ట్ చేశారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి తాను పనిచేస్తునట్టు నిరాధారమైన కధనాలు ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు అని ప్రస్తుతం తాను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సంభందించిన ఏ ప్రాజెక్టుతో కలిసి పని చేయడంలేదు అని తప్పుడు ప్రచారాలు కట్టిపెట్టాలని హితవు పలికారు.

ఏది ఏమైన ప్రజలకు నిజాలను చేరవేయాల్సిన మీడియా సంస్థలే , నేటి రోజున అసత్యాల కార్ఖానాలుగా తయారయ్యాయి . రాష్ట్ర ప్రజలని అయోమయానికి గురిచేస్తూ మీడియా స్వేచ్ఛ అంటూ సొంత ఎజండాని ప్రజలపై రుద్ది తప్పుదోవ పట్టించే కొన్ని పత్రికలు ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు . విశ్వసనీయత కోల్పోయి తిరస్కరణకు గురవుతున్న ఇటువంటి మీడియా సంస్థలను రాబోయే రోజుల్లో ప్రజలే బహిష్కరిస్తారని చెప్పడంలో సందేహం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp