రాజ్యసభలో ఆసక్తికర సన్నివేశం

By Srinivas Racharla Jul. 22, 2020, 07:40 pm IST
రాజ్యసభలో ఆసక్తికర సన్నివేశం

ఇవాళ పెద్దల సభకు సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

ఇక విషయానికొస్తే ఒకప్పుడు వారిద్దరు మధ్యప్రదేశ్ రాజకీయాలలో కాంగ్రెస్ తరఫున చక్రం తిప్పారు. రాజ్యసభ ఎన్నికలలో పార్టీ అభ్యర్థిత్వం కోసం ఇరువురు నాయకులు పోటీ పడ్డారు. కానీ పార్టీ అధిష్ఠానం సీనియర్ నేత వైపు మొగ్గడంతో యువనేత కాంగ్రెస్ పార్టీకి చెయ్యి ఇచ్చారు. గత మార్చిలో తన మద్దతుదారులైన 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి కమలం గూటికి చేరారు. అప్పటి నుండి వారి మధ్య తీవ్రస్థాయిలో విమర్శల పర్వం నడుస్తుంది.

 సీన్ కట్ చేస్తే మాజీ సీఎం, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ తరపున ఎన్నిక కాగా,యువ నేత జ్యోతిరాదిత్య సింధియా బిజెపి తరఫున రాజ్యసభలో అడుగుపెట్టాడు. ఇవాళ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇరువురు నేతలు చాలా రోజుల తర్వాత రాజ్యసభలో ఒకరికొకరు తారస పడ్డారు.

గత కొంతకాలంగా మధ్యప్రదేశ్ రాజకీయాలలో ఉప్పు నిప్పుగా కొనసాగుతున్న వారు ఎలా స్పందిస్తారోనని మిగతా సభ్యులు ఆసక్తిగా గమనించారు. అయితే ఒకరికొకరు మర్యాదపూర్వకంగా నమస్కరించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ కి
కూడా సింధియా నమస్కరించాడు. ఈ సన్నివేశాన్ని చూసిన కొందరు ఇద్దరు నేతలు పెద్దల సభ హుందాతనాన్ని కాపాడారని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇదిలా ఉంటే రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన సభ్యులలో 45 మంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సభ్యులందరూ భౌతిక దూరం పాటిస్తూ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp