ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులపై క్లారిటీ

By Kotireddy Palukuri Jul. 08, 2020, 06:18 pm IST
ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులపై క్లారిటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఓ క్లారిటీ వచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్య కరోనా కారణంగా ఆగిపోయిన సర్వీసులను ఆన్‌లాక్‌ నేపథ్యంలో తిరిగి పునరుద్ధరించాలని గత నెల్లో ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం అయ్యారు. మరోమారు సమావేశం అయి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. అయితే వారంలో జరగాల్సిన సమావేశం తెలంగాణ ఆర్టీసీ అధికారులకు కరోనా వైరస్‌ సోకిందన్న కారణంగా రద్దు అయింది. అయితే ఆ తర్వాత సర్వీసుల నిర్వహణపై ఎటూ తేలలేదు.

ఈ నేపథ్యంలో ఈ రోజు ఆర్టీసీ ఎండి మాదిరెడ్డి ప్రతాప్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పట్లో తెలంగాణకు బస్సు సర్వీసులు నడిపే ఆలోచన లేదని తెలిపారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో బస్సు సర్వీసులు నడిపితే వైరస్‌ ఇంకా ప్రభలే ప్రమాదం ఉందన్న నివేదికలు అందాయన్నారు. ఆర్టీసీలో కరోనా కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 80 మందికి వైరస్‌ సోకిందన్నారు. వీరందరూ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.

టిక్కెట్‌ చార్జీల పెంపుపై మాదిరెడ్డి స్పష్టత ఇచ్చారు. కరోనా సమయంలో ఆర్టీసీకి 4200 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని మాదిరెడ్డి తెలిపారు. చార్జీలు పెంచే ఆలోచన లేదన్నారు. చార్జీలు 10 రెట్లు పెంచినా అప్పులు తీరవన్నారు. ఇంద్ర బస్సులను కరోనా వైరస్‌ పరీక్షలకు అనుగుణంగా మార్చి అందిస్తున్నామని తెలిపారు. పాలు, కూరగాయల సరఫరాకు కూడా ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నామని చెప్పారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp