భార‌త బ్యాడ్మింట‌న్ దిగ్గ‌జం.. మ‌న తెలుగు తేజం.. పీవీ సింధు

By Kalyan.S Jul. 05, 2020, 07:13 pm IST
భార‌త బ్యాడ్మింట‌న్ దిగ్గ‌జం.. మ‌న తెలుగు తేజం.. పీవీ సింధు

వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియ‌న్ గా నిలిచి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన తెలుగు తేజం.. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడిన తొలి బ్యాడ్మింట‌న్ దిగ్గ‌జం.. ఒలింపిక్స్ లో ర‌జ‌తం సాధించిన తొలి మ‌హిళ‌.. ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం గ్ర‌హీత‌.. బ్యాడ్మింట‌న్ లో జ‌గ‌జ్జేత‌.. అవినీతి ర‌హిత ఆంధ‌ప్ర‌దేశ్ నిర్మాణంలో ప్ర‌చారక‌ర్త‌.. పీవీ సింధు. నేడు ఆమె జ‌న్మ‌దినం.

ఆమె పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. ఆమె ఎనిమిదో ఏట‌నే బ్యాడ్మింట‌న్ ఆడ‌డం ప్రారంభించారు. అటు తెలంగాణ‌, ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండు రాష్ట్ర్రాల‌తోనూ ఆమెకు అనుంబంధం ఉంది. సింధు జూలై 5, 1995 న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించారు. తండ్రి ర‌మ‌ణ కుటుంబ స‌భ్యులు ఆంధ‌ప్ర‌దేశ్ లోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన వారు. త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ క్రీడాకారులే. స్వ‌త‌హాగా క్రీడా కుటుంబంలో సింధు చిన్న‌త‌నం నుంచే క్రీడ‌ల‌పై ఆస‌క్తి పెంచుకుంది. తల్లిదండ్రులిద్దరూ వాలీబాల్ ఆటగాళ్ళైనా సింధు మాత్రం పుల్లెల గోపీచంద్ స్ఫూర్తితో బ్యాడ్మింటన్ ఎంచుకుంది. తండ్రి అర్జున పుర‌స్కార గ్ర‌హీత‌. 2016 లో జరిగిన రియో ఒలంపిక్స్ లో రజత పతకం సాధించి ఆ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. సెప్టెంబరు 21, 2012 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆగస్టు 10, 2013 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి అలా గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. మార్చి 30, 2015న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్ర‌దానం చేసింది.

బ్యాడ్మింట‌న్ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ గా...

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరను ఫైనల్ లో ఓడించి సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ కైవసం చేసుకుంది. ఆగ‌స్టు 25, 2019న జరిగిన టైటిల్ పోరులో జపాన్‌ ప్లేయర్‌ నొజోమి ఒకుహరతో అమీతుమీ త‌ల‌ప‌డి విజ‌యం సాధించారు. అంతకు ముందు.. ఆగస్టు 18, 2016 న రియో ఒలంపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో అదే క్రీడాకారిణి ఒకుహరాను ఓడించడం ద్వారా ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి ఒలంపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది. రెండేళ్ల క్రితం 2017లో జ‌రిగిన ఇదే టోర్నీ ఫైనల్లో తనను ఓడించిన జపాన్‌ స్టార్‌ ఒకుహరను చిత్తుచేసి టైటిల్‌ నెగ్గితేగానీ లెక్కసరి కాదన్నంత కసిగా 2019లో సింధు ఆడారు. నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఒకుహరను మట్టికరిపించి జ‌గ‌జ్జేత‌గా నిలిచారు. భార‌త రాష్ట్రప‌తి, ప్ర‌ధాన‌మంత్రి వంటి ప్ర‌ముఖుల స‌మా అంద‌రి శుభాకాంక్ష‌లూ అందుకున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తోనూ అనుబంధం

హైద‌రాబాద్‌లో పుట్టిన పీవీ సింధుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో ప్ర‌త్యేక అనుబంధం ఉంది. త‌న తండ్రి పివి. ర‌మ‌ణ పూర్వికులు ఆంధ‌ప్ర‌దేశ్ కు చెందిన వారే. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన ర‌మ‌ణ వృత్తిరీత్యా హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డ్డారు. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ గా నిలిచిన సింధూను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా అభినందించింది. అవినీతి ర‌హిత రాష్ట్రం కోసం సీఎం చేస్తున్న కృషికి సింధు తోడ్పాటు అందించారు. ప్ర‌చార బాధ్య‌త‌ను నిర్వ‌హించారు. ‘‘ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తున్నారు.. ఎవరు అవినీతికి పాల్పడినా నిర్భయంగా మీ గొంతు వినిపించండి. వెంటనే 14400 అనే టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారమివ్వండి’’ అంటూ ఏపీ ప్ర‌చారంలో వీడియోలో సింధు పిలుపునిచ్చింది. క‌రోనా విప‌త్తు నిధికి తెలుగు రాష్ట్రాలు రెండింటికీ చెరో రూ. 5 ల‌క్ష‌లు ఇచ్చి త‌మ తోడ్పాటు అందించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp