వన్డే సిరీస్‌లో బోణీ ఆసీస్‌దే

By Srinivas Racharla Nov. 27, 2020, 09:30 pm IST
వన్డే సిరీస్‌లో బోణీ ఆసీస్‌దే

సుమారు తొమ్మిది నెలల కరోనా విరామం తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన కోహ్లీ సేన అభిమానుల ఆశలను ఆవిరి చేసింది. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కంగారుల గడ్డపై గత పర్యటనకు భిన్నంగా ఓటమితో టీమిండియా పర్యటనను ఆరంభించింది.

భారీ లక్ష్య ఛేదనలో భారత్‌ ఇన్నింగ్స్‌ను నూతన ఓపెనింగ్ జోడి మయాంక్‌ అగర్వాల్‌-శిఖర్‌ ధావన్‌లు ధాటిగా ప్రారంభించారు. ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌తో 5 ఓవర్లలో 53 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించారు. అయితే హజిల్‌వుడ్‌ వేసిన ఆరో ఓవర్‌ రెండో బంతిని ఆఫ్‌ సైడ్‌ ఆడబోయిన మయాంక్‌ మ్యాక్స్‌వెల్‌ క్యాచ్ పట్టుకోవడంతో తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో మూడు బంతుల వ్యవధిలో కోహ్లి (21), అయ్యర్(2)లను ఔట్ చేసి హజిల్‌వుడ్‌ (3/55) భారత్‌ని కోలుకోని దెబ్బ కొట్టాడు.ఇక ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్‌ (12)ని లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా (4/54) బోల్తా కొట్టించాడు. దీంతో 13.3 ఓవర్‌లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేసిన భారత్ పీకల్లోతు కష్టాలలో పడింది.

ఫలించని గబ్బర్ సింగ్,పాండ్యా పోరాటం

భారీ తేడాతో ఓటమి తప్పదనుకున్న దశలో శిఖర్ ధావన్‌తో జత కలిసిన హార్దిక్ పాండ్యా నిలకడగా ఆడటంతో టీమిండియా తిరిగి గాడిలో పడింది. ఓ ఎండ్‌లో శిఖర్ నిదానంగా ఆడుతూ వికెట్‌ని కాచుకోగా మరో ఎండ్‌లో పాండ్యా చెలరేగాడు. జంపా వేసిన 18వ ఓవర్‌లో సిక్స్, ఫోర్‌ ఫోర్ బాదిన పాండ్యా వికెట్ల మధ్య వేగంగా పరిగెడుతూ సింగిల్స్, డబుల్స్‌తో జట్టు స్కోర్‌ను పరుగెత్తించాడు.ఇక స్పిన్నర్ మ్యాక్స్‌వెల్ వేసిన 23వ ఓవర్‌లో ఓ ఫోర్,రెండు సిక్స్‌లు కొట్టిన ధావన్‌ 31 బంతులలో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. స్టార్క్ వేసిన 25వ ఓవర్ ఫస్ట్ బాల్‌ను ధావన్ డీప్ స్క్వేర్ దిశగా భారీ షాట్ కొట్టాడు.కానీ కమిన్స్ చేతిలో పడిన ఆ బంతిని జారవిడచడంతో వచ్చిన బౌండరీతో ధావన్ అర్థ సెంచరీ పూర్తయింది.

ఇక విజయంపై భారత శిబిరంలో ఆశలు చిగురిస్తున్న దశలో ధావన్‌ను జంపా ఔట్ చేశాడు. పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 128 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన శిఖర్ ధావన్‌ 86 బంతులలో 10 బౌండరీలతో 74 పరుగులు సాధించాడు. అప్పటికీ జట్టు స్కోరు 229/5 కాగా సాధించాల్సిన రన్ రేట్ 15కి చేరువ కావడంతో హార్దిక్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ దశలో జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన హార్ధిక్ స్టార్క్‌కు చిక్కాడు. పాండ్యా 76 బంతులలో 7 ఫోర్లు,4 సిక్స్‌లతో 90 రన్స్ చేసి ఔటవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. ఇప్పటి వరకు ధావన్, పాండ్యా కలిసి 38 మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఈ మ్యాచ్ వరకు కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడం గమనార్హం. చివరలో రవీంద్ర జడేజా (37 బంతులలో 25 రన్స్) నవదీప్‌ సైని (29*), మహ్మద్‌ షమి (13) పరుగులు చేసి ఓటమి తేడాని తగ్గించేందుకు ప్రయత్నించారు. చివరకు 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన భారత్ 66 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది.

శతకాలతో చెలరేగిన పించ్,స్మిత్

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 27.5 ఓవర్లలో 156 పరుగులు జోడించి భారీ స్కోర్‌కు మార్గం సుగమం చేశారు. 69 బంతులలో 4 ఫోర్ల సహాయంతో 76 పరుగులు చేసిన డేవిడ్‌ వార్నర్‌ను ఫాస్ట్ బౌలర్ షమీ ఔట్ చేసి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. షమీ బౌలింగ్‌లో వార్నర్‌ బ్యాట్‌ని ముద్దాడిన బంతి కీపర్‌ చేతికి చిక్కడంతో భారత్‌కు తొలి వికెట్‌ లభించింది. వార్నర్ ఔటయ్యాక క్రీజ్‌లో అడుగెట్టిన స్టీవ్ స్మిత్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఇక కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడిన ఆరోన్ ఫించ్ గతి తప్పిన బంతులను బౌండరీ లైన్ బయటికి దారి చూపాడు. ఫించ్ 124 బంతులలో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 114 పరుగులు సాధించి నలభై ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. సెంచరీ బాదిన ఫించ్ వన్డే ఫార్మాట్‌లో వేగవంతంగా 5 వేల పరుగుల మైలురాయి చేరుకున్న రెండో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నమోదు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన స్టోయినిస్ ఆడిన తొలి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కానీ స్టోయినిస్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్‌వెల్, స్మిత్‌తో కలిసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఐపీఎల్‌లో కనీసం ఒక సిక్స్ కూడా బాదలేకపోయిన ఆల్ రౌండర్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌లో 3 సిక్స్‌లు బాదాడు.19 బంతులలో 5 ఫోర్లు,3 సిక్స్‌ల సహాయంతో 45 రన్స్ చేసి ఊపు మీదున్న మ్యాక్సీని షమీ పెవిలియన్ బాట పట్టించడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.

కానీ మరో ఎండ్‌లో ఉన్న స్మిత్ 62 బంతులలోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెంచరీ బాదాడు. 49వ ఓవర్‌లో షమీ105 పరుగులు చేసిన స్మిత్‌ని బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది.

తొలి వన్డే మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 55 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా,స్పిన్నర్ ఆడమ్ జంపా 54 పరగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లలో షమీ 59 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీశారు. కాగా లెగ్ స్పిన్నర్ చాహల్ 10 ఓవర్లలో ఏకంగా 89 పరుగులు సమర్పించుకున్నాడు. సెంచరీతో అదరగొట్టిన స్మిత్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' లభించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యత సంపాదించింది.రెండో వన్డే కూడా ఇదే వేదికపై ఆదివారం జరగనుంది.

కాగా ఓపెనర్ శిఖర్ మినహా కోహ్లీతో కూడిన టాప్ ఆర్డర్ వైఫల్యం, ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు అదనపు బౌలర్ సేవలు అందుబాటులో లేకపోవడం భారత్ విజయావకాశాలని దెబ్బతీసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp