అపకారికి ఉపకారం - నేపాల్‌కు భారత్‌ వెంటిలేటర్ల సాయం

By Kiran.G Aug. 10, 2020, 06:43 am IST
అపకారికి ఉపకారం - నేపాల్‌కు భారత్‌ వెంటిలేటర్ల సాయం

నేపాల్ ప్రధాని ఓలి శర్మ గత కొంతకాలంగా భారత్ పై తన అక్కసును వెళ్లగక్కుతూ ఉన్నారు. భారత దేశానికి చెందిన భూభాగాలను తమ దేశానికి చెందిన వాటిగా పేర్కొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు కొత్త మ్యాప్ ను రూపొందించారు. భారతీయులు ఆరాధించే శ్రీ రాముని జన్మస్థలం భారత్ లోని అయోధ్య కాదని నేపాల్ లో ఉందని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇలా పలువిధాలుగా అక్కసు వెళ్లగక్కుతున్న నేపాల్ దేశానికి అవసరంలో ఆపన్న హస్తం అందించడానికి భారత్ ముందుకొచ్చింది.

మానవత్వం చూపించడానికి శత్రుత్వంతో పనిలేదని భారత్ మరోసారి ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచింది.అపకారికి కూడా ఉపకారం చేసే గుణం భారత్ కి ఉందని మరోసారి నిరూపించింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం నేపాల్ లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అసలే పేద దేశం. కరోనా విజృంభిస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవడం ఖాయం. ఈ క్రమంలో నేపాల్‌ను వైద్యపరంగా ఆదుకునేందుకు భారత్‌ ముందడుగు వేసింది. అందులో భాగంగా 10 వెంటిలేటర్లు నేపాల్ దేశానికి సాయం చేయాలని భారత్ నిర్ణయించింది.

నేపాల్‌లోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా నేపాల్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ పూర్ణ చంద్ర థాపాకు పది వెంటిలేటర్లను అందజేశారు. ఆత్మనిర్బర్‌ భారత్‌ కార్యక్రమంలో దేశీయంగా తయారు చేసిన పది వెంటిలేటర్లను నేపాల్ కి భారత్ అందజేసింది. వీటి విలువ దాదాపు రూ.2.8 కోట్లు ఉంటుంది. కాగా నేపాల్ ప్రధాని భారత్ కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ భారత్ నేపాల్ దేశానికి బాసటగా నిలవడం విశేషం..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp