నాగార్జున సాగ‌ర్ : పెరిగిన ఓటింగ్ సీనియ‌ర్ వైపా.. జూనియ‌ర్ వైపా..?

By Kalyan.S Apr. 18, 2021, 09:30 am IST
నాగార్జున సాగ‌ర్ : పెరిగిన ఓటింగ్ సీనియ‌ర్ వైపా.. జూనియ‌ర్ వైపా..?

తెలంగాణ అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఎన్నిక‌లు నాగార్జున సాగ‌ర్ . ఎందుకంటే ఇటీవ‌ల వ‌రుస‌గా జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల మ‌ధ్య ప్ర‌ధాన పోరు కొన‌సాగింది. దుబ్బాక‌, జీహెచ్ఎంసీ, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ.. ఎన్నిక ఏదైనా అదే జ‌రిగింది. కానీ, నాగార్జున సాగ‌ర్ కు వ‌చ్చేస‌రికి కాంగ్రెస్ వైపు అంద‌రి దృష్టీ మ‌ళ్లింది. ఆ పార్టీ నుంచి సీనియ‌ర్ నాయ‌కుడు జానారెడ్డి పోటీలో ఉండ‌డంతో కాంగ్రెస్ పై ఆశ‌లు చిగురించాయి. ఇక టీఆర్ఎస్, బీజేపీ.. రెండూ పార్టీలూ కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ఇచ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో చూపినంత మూపు ఈసారి బీజేపీ ప్ర‌ద‌ర్శించ‌లేన‌ట్లుగా క‌నిపించింది. ప్ర‌ధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మ‌ధ్యే వాదోప‌వాదాలు జ‌రిగాయి. ఇదిలా ఉండ‌గా, ఈసారి ఎన్నిక‌ల్లో పోలింగ్ శాతం భారీగా న‌మోదైంది. గ‌తంలో న‌మోదైన ఓటింగ్ శాతాన్ని క్రాస్ చేసింది. ఇది ఎవ‌రి గెలుపున‌కు సంకేత‌మో అర్థం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అంచ‌నాలు త‌ల‌కిందులు

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఓటింగ్ శాతం త‌గ్గుతుంద‌ని రాజ‌కీయ పార్టీలు స‌హా, విశ్లేష‌కులు కూడా భావించారు. కానీ దాదాపు 88 శాతానికి పైగా పోలింగ్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. పోలింగ్ ముగిసే స‌మ‌యానికి సాయంత్రం 7 గంటలకు ఈ లెక్క కాగా, ఆ లోపుగా ఉన్న వాళ్ల‌ను లెక్కించుకుంట్లే అంత‌కంటే ఎక్కువ‌గా ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 86 శాతం పోలింగ్ న‌మోదైతే. ఈసారి ఇప్ప‌టికే 88 శాతం పోలింగ్ న‌మోదైంది. తుది శాతం ప్ర‌క‌టించే స‌రికి. అది మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. దీనిపై అధికార పార్టీ, కాంగ్రెస్, బీజేపీ ఎవ‌రికి వారే త‌మ‌దే గెలుపు అన్న ధీమాగా ఉన్నాయి. ఈసారి మూడు పార్టీలూ ఓట‌ర్ల‌ను తీవ్ర స్థాయిలో ప్ర‌లోభాల‌కు గురి చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాన పార్టీ ఓటుకు రూ. 1500తో మ‌ద్యం పంపిణీ చేస్తే.. మిగ‌తా పార్టీలు కూడా తామేమీ త‌క్కువ కాద‌న్న‌ట్లుగా రూ. 1000 పంచిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పోలింగ్ పెరుగుద‌ల‌కు ఇది కూడా ఓ కార‌ణంగా ప‌లువురు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించబోతోంది

సాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించబోతోందని సీఎల్పీ మాజీ నేత, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి అన్నారు. సరికొత్త రాజకీయ ఒరవడి సృష్టించేలా; తెలంగాణలో ఒక మలుపు తిప్పడానికి కాంగ్రెస్ కే ప్ర‌తి ఒక్క‌రూ ఓటు వేసిన‌ట్లు భావిస్తున్నామ‌ని తెలిపారు. గ‌తంలో తాను చేసిన అభివృద్ధికి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు. సాగర్‌ నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్ర‌జ‌లు గుర్తుంచుకున్నార‌ని తెలిపారు. ఏ పార్టీలో ఉన్నా ఏనాడూ తాను పదవి అడిగి తీసుకోలేదని, ఏ ముఖ్యమంత్రి దగ్గర తన మంత్రి పదవి కోసం ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఎవరు వాస్తవాలు చెబుతున్నారో ప్రజలు గుర్తుంచార‌ని అన్నారు. జానారెడ్డి ఇప్ప‌టికే ఏడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. మూడు సార్లు మంత్రిగా కూడా చేశారు. ఎక్కువ సార్లు ప్రాతినిధ్యం వ‌హించిన అనుభ‌వంతో ఉండ‌డంతో ఈసారి కూడా ఆయ‌న గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే అధికార పార్టీ హ‌వా, త‌న తండ్రిపై ఉన్న సానుభూతితో టీఆర్ఎస్ అభ్య‌ర్థి, ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీజేపీ పుంజుకుంటుండ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో బీజేపీ అభ్య‌ర్థి కూడా గెలుపు అవ‌కాశాలు ఉన్నాయ‌ని భావిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp