గంజాయి రవాణా విశ్వరూపం

By Jaswanth.T Jul. 05, 2020, 06:12 pm IST
గంజాయి రవాణా విశ్వరూపం

మనిషిని మత్తులో ముంచే పదార్ధాలను ప్రభుత్వాలు ఎంతగా అడ్డుకుందామనుకుంటే.. అంతగా వాటి వినియోగం పెరిగిపోతోంది. ముఖ్యంగా నాటుసారా, గంజాయి లాంటివి ప్రభుత్వ యంత్రాగాలకే సవాలు విసిరే స్థాయిలో వీటి ప్రభావం ఉంటోంది. పొరుగు రాష్ట్రమైన ఒడిస్సా ఏజెన్సీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా సాగు చేసే గంజాయిని ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లాలలోని ఏజెన్సీ ప్రాంతాలైన డొంకరాయి, మోతుగూడెం, చింతూరుల మీదుగా తెలంగాణా, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాలకు విస్తృతంగా తరలిస్తున్నారు.

ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదు చేసి భారీగానే గంజాయి, వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ ఈ అక్రమ రవాణాదారులు మాత్రం వెనుకంజవేయడం లేదు. సరికదా కొంగొత్తదారులు వెదికి ఎప్పటికప్పుడు పోలీస్‌లకే సవాల్‌ విసురుతున్నారనే చెప్పాలి. ఉత్పత్తయ్యే చోటు నుంచి మార్కెట్‌కు తరలించేందుకు ఈ ఏజెన్సీ మార్గమే ప్రధానం కావడంతో అక్రమరవాణాదారులు ఈ మార్గంలోని అన్ని వ్యస్థలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కూడా సర్వశక్తులు ఒడ్డుతుంటారు. అయితే వీరి ప్రయత్నాలకు అధికార యంత్రాంగం కూడా ధీటుగానే సమాధానమిస్తోంది. ఇటీవలి కాలంలో భారీగానే గంజాయిని స్వాధీనం చేసుకుని అక్రమార్కులపై ఉక్కుపాదంమోపేందుకు కృషి చేస్తోంది.

ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో కీలక ప్రాంతాలైన డొంకరాయి, మోతుగూడెం, చింతూరు పోలీస్‌ స్టేషన్ల మీదుగా ఈ గంజాయి రవాణా జరుగుతుంటుందని పోలీసు వర్గాలు చెబుతున్న మాట. రాష్ట్రంలో పట్టుబడే గంజాయిలో అత్యధిక భాగంగా ఈ మూడు చోట్లే పట్టుబడుతుంది. దీంతో ఏజెన్సీ ప్రాంతం మొత్తాన్ని మైదాన ప్రాంతాల వాళ్ళు అనుమానంగా చూసే పరిస్థితులు ఉన్నాయి. వాస్తవానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో గంజాయి వినియోగం తక్కువేనని వీటిని అధ్యయం చేసేవారు చెప్పే మాట.

ఒడిస్సాలో పండే గంజాయికి ప్రధాన కష్టమర్లు మహారాష్ట్రకు చెందినవారే ఉంటారని చెబుతుంటారు. అంతేకాకుండా దాదాపు 1200 కిలోమీటర్ల దూరంలో ఉండే తమిళనాడు రాష్ట్రంలోని సేలంకు కూడా ఈ గంజాయి ఎక్కువగా వెళుతుంటుందని ఇప్పటి వరకు పట్టుబడ్డ వారి నుంచి సేకరించిన ఆధారాలను బట్టి పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల తరువాత తెలంగాణాకే రవాణా ఎక్కువుంటుందంటుంటారు. ఇదే కాకుండా నర్సీపట్నం తదితర ప్రాంతాల నుంచి కూడా గంజాయి రవాణా ఉంటుందని చెబుతుంటారు. ఈ మార్గంలో గంజాయి రవాణా చేసేవారు రైళ్ళ ద్వారా చేస్తుండడం వీరి తెగింపునకు పరాకాష్టగా చెబుతుంటారు. అప్పుడప్పుడు రైల్వే పోలీస్‌లు తనిఖీల్లో వీరు కూడా పట్టుబడుతుంటారు.

దొరికేదంతా బక్కోళ్ళే..
గంజాయి రవాణాదారులు ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలు అవలంభిస్తుంటారు. చైన్‌లింక్‌ విధానంలో సాగే ఈ రవాణాలో ఎక్కడైనా దొరికిపోతే అక్కడితే ఆ లింక్‌ తెగిపోతుంది. దీంతో డబ్బులకు ఆశపడి రవాణాకు ఒప్పుకున్న బక్కజీవులు కేసుల్లో ఇరుక్కుంటుంటారు. వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు కోర్టుల చుట్టూ ఏళ్ళతరబడి తిరగాల్సిన దుస్థితిని ఎదుర్కొంటుంటారు. కాగా బడా బాబులు దర్జాగా తప్పించుకు పోతుంటారు. ఒక వేళ ఎప్పుడైనా బడాబాబులు బైటపడితే వారిని రక్షించేందుకు ఎప్పటికప్పుడు పక్కా వ్యవస్థ పనిచేస్తుందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండడం ఈ అక్రమ రవాణా ఎంతగా వ్యవస్థీకృతం అయ్యిందో చెప్పకనే చెబుతోంది. ఏజెన్సీ ప్రాంతంలోని మూడు పోలీస్‌ స్టేషన్లలోనూ గంజాయి రవాణాతో పట్టుబడ్డ వాహనాల్లో కొత్త వాహనాలు కూడా ఉంటుంటాయి. వీటిని బట్టే ఈ అక్రమ వ్యాపారంలో లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో అంచనావేయొచ్చని అక్కడి వారు చెబుతుంటారు.

కార్లసీట్లు, టైర్లులో పెట్టి రవాణా చేయడంపై పోలీస్‌లకు పూర్తిస్థాయిలో అవగాహన రావడంతో అక్రమ రవాణాదారులు ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నిక్‌లు కనిపెడుతున్నారు. ఏసీ సహా సర్వహంగులు ఉన్న బస్సులోని సీట్ల మధ్య ఉండే ఖాళీలో భారీగా గంజాయి పెట్టి రవాణాకు సిద్ధమయ్యారు. దాన్ని కూడాపోలీస్‌లు పసిగట్టడంతో విషయం బైటకు వచ్చింది.

కొబ్బరి బొండాల్లోని నీటిని బైటకు తీసేసి, వాటిలో గంజాయిని పెట్టి రవాణా చేస్తుండగా కూడా పోలీస్‌లు గుర్తించి, అక్రమ రవాణాను అడ్డుకోగలిగారు. అంతే కాకుండా డొంకరాయి చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో భాగంగా కంటైనర్‌లో తరలిస్తున్న సుమారు 65 లక్షల విలువైన గంజాయిని కూడా పోలీస్‌లు కనిపెట్టగలిగారు. ఇవి కాకుండా పోలీస్‌ల కళ్ళుగప్పి ఏస్థాయిలో రవాణా సాగుతుందోనన్న అనుమానాలు కూడా స్థానికులు వ్యక్తం చేస్తుంటారు.

ఆర్ధిక అవసరాలున్న అమాయకులే లక్ష్యంగా ఈ అక్రమ వ్యాపారులు వలపన్నుతున్నారని పోలీస్‌లు చెబుతున్నారు. వారి అవసరాల మేరకు భారీగా డబ్బును ఎరవేస్తుండడంతో అమాయకులు వీరి వలకు చిక్కి కేసుల పాలవుతున్నారని వివరిస్తున్నారు. ఇప్పటికైనా అటువంటి వారు అప్రమత్తంగా ఉండకపోతే చట్టప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp