ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ పోరు : హైదరాబాద్ పై ఎవ‌రి ఎత్తుగ‌డ ఏంటి?

By Kalyan.S Mar. 05, 2021, 09:00 pm IST
ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ పోరు :  హైదరాబాద్ పై ఎవ‌రి ఎత్తుగ‌డ ఏంటి?

తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల్లో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎంతో ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి బీజేపీకి చెందిన ఎన్‌.రాంచందర్‌రావు (బీజేపీ) ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ పార్టీ నుంచి ఆయ‌నే పోటీలో ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 5,17,883 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది రాజ‌కీయంగా ఎంతో చైతన్య‌వంతులు. ఉద్య‌మాల అడ్డా ఉస్మానియా క్యాంప‌స్ కు చెందిన వారు కూడా ఎంతో మంది ఓట‌ర్లుగా ఉన్నారు. ప్ర‌లోభాల‌కు పెద్ద‌గా అవ‌కాశం ఉండ‌దు. వ్య‌క్తిగ‌త, పార్టీ ఇమేజ్ లే ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నాయి.

మార్చి 14న ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఆయా పార్టీల అభ్య‌ర్థులంద‌రూ ఓట‌ర్ల ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ఉన్నారు. ఈసారి పార్టీ అభ్య‌ర్థి ఎంపిక‌లో టీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. దేశ రాజ‌కీయాల్లోనే గుర్తింపు పొందిన దివంగ‌త మాజీ ప్ర‌ధాన‌మంత్రి పీవీ న‌ర్సింహారావు కుమార్తెను రంగంలోకి దింపి విప‌క్షాల‌కు షాక్ ఇచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు.

Also Read:కేసీఆర్ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ : ఎమ్మెల్సీ బ‌రిలో పీవీ కుమార్తె?

టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పీవీ కుమార్తె వాణీదేవి ప్రచారంలో త‌న‌దైన శైలిలో దూసుకెళ్తున్నారు. త‌న తండ్రి పీవీకి, తెలంగాణ సీఎం కేసీఆర్ కు చాలా అంశాల్లో సారూప్య‌త ఉంద‌ని చెబుతూ ఇటు టీఆర్ఎస్ శ్రేణుల‌ను, అటు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆమెకు మ‌ద్ద‌తుగా టీఆర్ఎస్ మంత్రులు శ్రీ‌నివాస్ యాద‌వ్, హ‌రీశ్ రావు త‌దిత‌రులు ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతానికి ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ప్ర‌చారం చేస్తున్న కేటీఆర్ త్వ‌ర‌లోనే ప్ర‌చారప‌ర్వంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మ‌రోవైపు సుర‌భి వాణీదేవి కుమార్తె, పీవీ మ‌న‌వ‌రాలు సుర‌భి అజిత కూడా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. తెలంగాణ‌లో పీవీకి, కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ ద్వారా ప‌ట్ట‌భ‌ద్రుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలాగే విద్యాసంస్థ‌ల అధిప‌తిగా త‌న‌కున్న ప‌రిచ‌యాల ద్వారా విజ‌యానికి బాట‌లు వేసుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పాటుకు, అభివృద్ధికి టీఆర్ఎస్ చేసిన కృషిని ఓట‌ర్ల‌కు వాయిస్ కాల్స్, నేరుగా లేదా సామాజిక మాధ్య‌మాల ద్వారా వివ‌రిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌ల క‌న్నా త‌మ పార్టీ చేసిన‌, తాము చేయ‌బోయే ప్ర‌ణాళిక‌ల‌నే వివ‌రిస్తూ వాణీదేవి ముందుకెళ్తున్నారు.

Also Read:యాదాద్రి : ఆధ్యాత్మిక సౌధం

ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులకు ధీటుగా నియోజక వర్గం బరిలో ఉన్న వామ‌ప‌క్ష అభ్య‌ర్థి ప్రొ.నాగేశ్వ‌ర్ ప్రచారం లో ఆకట్టుకుంటున్నారు. తనకున్న విశేష రాజకీయ, సామాజిక పరిజ్ఞానంతో పట్టభద్రుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత వ‌ర‌కూ ఆయన ప్ర‌భావం చూపుతార‌నేది ఆస‌క్తిగా మారింది.

ప్రొ.నాగేశ్వ‌ర్ గ‌తంలోకమ్యూనిస్టుల మద్దతుతో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచారు. చట్టసభలో నిరుగ్యోగుల తరుపున తన వాణి వినిపించారు. నాగేశ్వ‌ర్ కు యువ‌తలో గుర్తింపు ఉంది. ఆయన పట్ల మంచి అభిప్రాయం ఉంది. రాజకీయంగా కూడా నాగేశ్వర్ పై ఆరోపణలు లేవు. ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చే అవకాశాలు గా నాగేశ్వర్ అభిమానులు భావిస్తున్నారు. తన ప్రచారానికి సామాజిక మాధ్య‌మాలను అధికంగా వినియోగించుకుంటున్నారు. సామాజిక సంస్థల, సంఘాల నేతలను కలుస్తూ మద్దతు పెంచుకుంటున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో ప‌ట్ట‌భ‌ద్రులు మ‌రోసారి ఆయ‌న వైపు మొగ్గుచూపుతారా, లేదా ప్ర‌ధాన పార్టీ అభ్య‌ర్థుల‌నే గెలిపిస్తారా అనే ఆస‌క్తి ఏర్ప‌డింది.

ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న సిటింగ్ స్థానాన్ని ప‌దిల‌ప‌రుచుకునే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ఆ పార్టీ అభ్య‌ర్థి ఎన్. రామ‌చంద్రావు ఎమ్మెల్సీగా ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన ప‌నుల‌ను వివ‌రిస్తూ టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా, ప్ర‌శ్నించే గొంతుక‌కు మ‌రోసారి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఆయ‌న ప్ర‌ధానంగా ఉస్మానియా ప‌ట్ట‌భద్రుల‌పైనే గురి పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. త‌ర‌చూ వారిని క‌లుస్తూ మ‌ద్ద‌తు కోరుతున్నారు. మ‌రోవైపు ఆ పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ పెట్టారు. దుబ్బాక‌, జీహెచ్ఎంసీలో సాధించిన జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందని  ప్ర‌ధానంగా జ‌నాల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలాగే ఇటీవ‌ల విడుద‌లైన నోటిఫికేష‌న్లు అన్నీ త‌మ పోరాటం ఫ‌లితంగా వ‌చ్చిన‌వేన‌ని, మ‌రోసారి రామ‌చంద్రరావును గెలిపిస్తేనే అవ‌న్నీ అమ‌ల్లోకి వ‌చ్చేలా మ‌రింత పోరాడ‌తామ‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

Also Read:బెంగాల్‌ దంగల్‌ : వలసలు బీజేపీకి మేలా..? కీడా..?

కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జిల్లెల చిన్నారెడ్డి త‌న రాజ‌కీయ అనుభ‌వంతో ప‌ట్ట‌భ‌ద్రుల‌ను ఆక‌ట్టుకునేలా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ ప్రాంతం కూడా ఉండ‌డం త‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వంతో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేన‌ని, విజ్ఞాన‌వంతులైన ప‌ట్ట‌భ‌ద్రులు ఆలోచించి ఓటేయాల‌ని కోరుతున్నారు. మ‌రోవైపు ఆయ‌న త‌ర‌ఫున ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్, సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే బ‌ట్టి విక్ర‌మార్క కూడా ప్ర‌చారం చేస్తున్నారు. ఓడిపోయే సీటును వాణీదేవికి ఇచ్చారంటూ టీఆర్ఎస్ పై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయంటూ ప‌ట్ట‌భ‌ద్రుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులే కాకుండా, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి హర్షవర్దన్ రెడ్డి, టీఆర్ఎల్డీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ పోటీలో ఉన్నారు. వీరంద‌రూ ప్ర‌చార‌ప‌ర్వంలో ఎవ‌రికి వారు ప్ర‌త్యేక శైలిలో దూసుకెళ్తున్నారు. తెలంగాణ‌లో కీల‌క‌మైన ప్రాంతాలు ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉండ‌డంతో ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా కైవ‌సం చేసుకోవాల‌ని, ప‌ట్ట‌భ‌ద్రుల మ‌న‌సును ఎలాగైనా గెల‌వాల‌ని వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌ల‌ను ర‌చిస్తున్నారు. చివ‌రకు విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp