హుజురాబాద్, కోమటిరెడ్డి సర్వేలో ఆ పార్టీకి 5% ఓట్లే.. !

By Ramana.Damara Singh Jul. 29, 2021, 03:00 pm IST
హుజురాబాద్, కోమటిరెడ్డి సర్వేలో ఆ పార్టీకి 5% ఓట్లే.. !

తెలంగాణ ప్రజలను, రాజకీయులను ఉత్కంఠకు గురిచేస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియకపోయినా.. ఆ ఎన్నిక పేరుతో రాజకీయాలు మాత్రం రగులుతున్నాయి. ఉప ఎన్నికలో గెలిచి తన పట్టు నిరూపించుకోవాలని అధికార తెరాస, తన ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవాలని కాంగ్రెస్, పట్టు సాధించాలని బీజేపీ ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో నిన్నమొన్నటి వరకు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఈటల రాజేందర్ నిలబెట్టుకుంటారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి బాంబు పేల్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పార్టీ కాంగ్రెసుకు 5 శాతంలోపే ఓట్లు వస్తాయని తేల్చేశారు. ఈ ఉప ఎన్నికలో తెరాసకు శృంగభంగం తప్పదని భాష్యం చెప్పారు.

కోమటిరెడ్డి సర్వే ఏం చెప్పింది
తెరాస ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. బీజేపీలో చేరిన ఈటల మళ్లీ తన సీటును దక్కించుకునేందుకు రంగంలోకి దిగారు. తెరాస, కాంగ్రెస్ కూడా ఇక్కడ విజయానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సర్వే పేరుతో భవిష్యవాణి వినిపించడం కలకలం సృష్టిస్తోంది.

ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్లో ఈటల రాజేందర్ విజయం తధ్యమన్నారు. నియోజకవర్గంలో తాను జరిపించిన సర్వేలో 67 శాతం ఓటర్లు ఈటల వైపు మొగ్గుతున్నట్లు వెల్లడైందని చెప్పారు. అధికార తెరాస 30 శాతం మొగ్గు కనిపించగా కాంగ్రెసుకు ఐదు శాతంలోపే ఓట్లు వస్తాయన్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పరిస్థితి ఏమంత బాగాలేదని.. వెంటనే అభ్యర్థిని ప్రకటించి ప్రచారం ప్రారంభిస్తే పరిస్థితి కొంత మెరుగుపడుతుందని అన్నారు.

పీసీసీ పదవి దక్కని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ పదవి రేవంత్ కు ఇవ్వడంపై అప్పట్లో పరుష వ్యాఖ్యలు చేశారు. ఆ పదవినే అవమానించేలా మాట్లాడారు. తర్వాత అధిష్టానం పెద్దల మందలింపులతో కాస్త వెనక్కి తగ్గినా.. ఇంకా ఆయనలో అసంతృప్తి గూడు కట్టుకునే ఉంది.

ఈ నేపథ్యంలో రేవంత్ ఆధ్వర్యంలో ఎదుర్కొనే తొలి ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం మాట అటుంచి.. ఐదు శాతం ఓట్లు కూడా దక్కవని కోమటిరెడ్డి చెప్పడం పార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని నీరుగార్చడమే అవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తుంది. ఎన్నికలకు ముందు నేతలతో సహా పలువురు సొంత సర్వేలు చేయించి ఓటర్ల మూడ్ తెలుసుకునేందుకు ప్రయత్నించడం సాధారణమే.

సర్వే ఫలితం ఎలా ఉన్నా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు అనుకూలంగా చెప్పుకుంటారు. కానీ కోమటిరెడ్డి మాత్రం పార్టీకి గౌరవప్రదమైన ఓట్లు కూడా రావని బహిరంగంగా చెప్పడం విశేషం. అయితే ఈటల గెలుస్తారని.. తెరాసాపై వ్యతిరేకత బాగా ఉందని చెప్పడం చర్చకు తావిస్తోంది. అధికార పార్టీకి మరింత అప్రమత్తమయ్యే అవకాశం కల్పించినట్లు అయ్యింది. సర్వేలు ఎంతవరకు నిజం అవుతాయన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. కాస్త అటూఇటుగా ఫలితాలు ఉంటాయన్నది తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp