జీహెచ్‌ఎంసీలో హంగ్‌..!

By Karthik P Dec. 04, 2020, 07:45 pm IST
జీహెచ్‌ఎంసీలో హంగ్‌..!

అంచనాలు తల్లకిందులయ్యాయి. కారు స్పీడు తగ్గింది. కమలం వికసించింది. ఎంఐఎం పట్టు నిలుపుకుంది.. వెరసి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడింది. 150 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్‌ 56 డివిజన్లలో గెలుపొందింది. బీజేపీ 47 డివిజన్లలో విజయకేతనం ఎగురువేసింది,2 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది . ఎంఐఎం 43 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం దక్కింది. ఆ పార్టీ రెండు డివిజన్లలో గెలిచింది.

గ్రేటర్‌ ఓటురు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. 150 కార్పొరేటర్లు, 45 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యులతో కలపి జీహెచ్‌ఎంసీలో మొత్తం 195 సీట్లు ఉన్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్‌ పీఠాలు గెలుచుకోవాలంటే 98 ఓట్లు కావాలి. 45 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యుల్లో టీఆర్‌ఎస్‌కు 31 మంది సభ్యులున్నారు. ఆ పార్టీ సొంతంగా మేయర్‌ పీఠాన్ని సాధించాలంటే 67 డివిజన్లలో గెలవాల్సి ఉండగా.. 56 సీట్ల వద్దే కారు పార్టీ ఆగిపోయింది.

Also Read:నాయకుల బంధువుల ఓటమి

బీజేపీ గట్టిపోటీ ఇచ్చినా.. ఎక్స్‌ అఫిషియో సభ్యుల బలంతో మేయర్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని అంచనాలు వేశారు. ఆ పార్టీకి కూడా అదే ధీమాతో ఉంది. గత ఎన్నికల్లో 99 డివిజన్లలో గెలిచిన టీఆర్‌ఎస్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యులతో సంబంధం లేకుండా మేయర్‌ పీఠంపై కూర్చుంది. ఈ సారి ఓ 30 స్థానాలు తగ్గినా ఎక్స్‌ అఫిషియో సభ్యుల ఓట్లతో గట్టెక్కవచ్చని భావించింది. టీఆర్‌ఎస్‌కు కనిష్టంగా 65, గరీష్టంగా 96 డివిజన్లలో గెలుస్తుందని అన్ని సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వేశాయి. బీజేపీ 14 నుంచి 35 సీట్లు గెలుస్తుందని చెప్పాయి. అయితే అన్ని అంచనాలును తోసిపుచ్చుతూ.. అనూహ్యంగా కమలం పార్టీ సత్తా చాటింది.

హంగ్‌ ఏర్పడినా పాలక మండలిని ఏర్పాటు చేసే అవకాశం టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉంది. ఆ పార్టీ ఎంఐఎంతో కలసి జీహెచ్‌ఎంసీ పాలన చేపట్టాల్సిన తప్పని పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసే.. ఎక్స్‌ అఫిషియో సభ్యులతో సంబంధం లేకుండా పాలక మండలి ఏర్పాటవుతుంది. మేజిక్‌ ఫిగర్‌ 98 కాగా.. టీఆర్‌ఎస్‌ 56, ఎంఐఎం 43.. వెరసి ఆ రెండు పార్టీల బలం 99కు చేరుతుంది. తుది ఫలితాల తర్వాత ఒకట్రెండు రోజులకు రాష్ట్ర ఎన్నికల సంఘం మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. ఈ లోపు ఆ రెండు పార్టీలు ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది.

Also Read:పలువురు తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచిన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్..

టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలతో హోరాహోరీ పోరు సాగించిన బీజేపీ జీహెచ్‌ఎంసీలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. సైద్ధాంతికంగా ఎంఐఎంతో తీవ్రంగా బీజేపీ విభేధిస్తోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చాటుకుంటోంది. తాజా ఫలితాలతో ఆ మాటలను చేతల్లో చూపింది. తెలంగాణ ఓటర్లు కూడా అదే భావనలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమనే నమ్మకంతో గ్రేటర్‌ ఓటర్లు బీజేపీని ఆదరించారని స్పష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీలో పాలక మండలిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా బీజేపీ చేయబోదని చెప్పవచ్చు.

టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య సీట్ల వ్యత్యాసం పెద్దగా లేకపోవడం వల్ల.. ఆ రెండు పార్టీలు మేయర్‌ పీఠాన్ని చెరో రెండున్నర సంవత్సరాలు చొప్పున పంచుకునే అవకాశం ఉంది. 2009 గ్రేటర్‌ ఎన్నికల్లోనూ హంగ్‌ వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 55 డివిజన్లు, ఎంఐఎం 43 డివిజన్లలో గెలిచింది. ఆ సమయంలోనూ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మేయర్‌ పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకున్నాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి గ్రేటర్‌లో ఏర్పడింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp