విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం

By Kiran.G Aug. 09, 2020, 07:40 am IST
విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం

విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.రమేష్‌ ఆసుపత్రి కొవిడ్‌కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలస్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా మరికొందరి పరిస్థితి విషమంగా మారింది.

వివరాల్లోకి వెళితే..విజయవాడలోని ప్రముఖ హోటల్ అయిన స్వర్ణ ప్యాలెస్ ను కార్పోరేట్ ఆసుపత్రి లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చింది. ఈ రోజు ఉదయం స్వర్ణ ప్యాలస్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా కింది అంతస్థులో మంటలు చెలరేగి భవనం పైభాగానికి విస్తృతంగా వ్యాపించాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో బాధితులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. హోటల్‌లో 40మంది ఉన్నారు. వీరిలో 30మంది కొవిడ్‌ బాధితులు కాగా మరో 10మంది ఆసుపత్రి సిబ్బంది అక్కడ ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున 4.45-5.00 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.. ఈ ప్రమాదంలో పదకొండు మంది మృతి చెందగా మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఇద్దరు భయంతో కిందకు దూకడంతో వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

దట్టంగా అలుముకున్న పొగవల్ల బాధితులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ కిటికీల్లోంచి కేకలు వేస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితులను లబ్బీపేట, మెట్రోపాలిటన్‌ హోటల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలిస్తున్నారు. స్వర్ణప్యాలెస్‌ వద్ద సహాయచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

గతంలో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది కోవిడ్ పేషెంట్స్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp