లెబనాన్ లో భారీ విస్ఫోటనం

By Kiran.G Aug. 05, 2020, 06:58 am IST
లెబనాన్ లో భారీ విస్ఫోటనం

లెబనాన్‌ రాజధాని బీరుట్‌ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. మొదట టపాసులు పేలుతున్న శబ్దాలు వినిపించగా ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 80 మంది ప్రాణాలు కోల్పోగా 4000 మందికి పైగా గాయాలయ్యాయి. 

బీరుట్ లో పేలుడు ధాటికి అనేక భవనాలు తునాతునకలైపోయాయి. నగరంలో ఎక్కడ చూసినా భవన, వాహన శిథిలాలు కనిపిస్తున్నాయి.. పెద్ద ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శిథిలాల క్రింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తుంది.బీరుట్ ఓడరేవు పేలుడు ధాటికి పూర్తిగా ధ్వంసం అయింది. బీరుట్ విస్ఫోటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.


టపాసులు నిల్వచేసిన గిడ్డంగిలో జరిగిన ప్రమాదం కారణంగా ఈ పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు. కాగా పేలుడు సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బీరుట్ లో సంభవించిన భారీ విస్ఫోటనం అణుబాంబు పేలిన భావన కలిగించిందని స్థానికులు వెల్లడించారు.పేలుడు అనంతరం సుడులు సుడులుగా దట్టమైన పొగ ఎగిసిపడింది. కాగా అక్కడి హాస్పిటల్స్ బాధితులతో నిండిపోయాయి. రక్తదానం చేయాల్సిందిగా ఆసుపత్రులు అభ్యర్థించాయి.

బీరట్‌లో రెండు పేలుళ్లు జరిగినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. అక్కడ ఉన్న భారతీయుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. సాయం కోసం 0174 1270, 0173 5922, 0173 8418 నెంబర్లను సంప్రదించవచ్చిని తెలిపింది. అత్యవసర సేవలకు 96176860128కు ఫోన్ చేయాల్సిందిగా సూచించింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp