ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడం ఎలా..?

By Jaswanth.T Apr. 22, 2020, 04:50 pm IST
ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడం ఎలా..?

కరోనా అలియాస్ కోవిడ్ -19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచం మొత్తం మీద 210 దేశాల్లో పాతిక లక్షల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడగా, ఒక లక్షా 75 వేల మందికి పైగా మృతి చెందారు. వైరస్ కట్టడి చేసేందుకు, అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సిద్ధం చేసేందుకు యావత్ ప్రపంచ వైద్యరంగం పరుగులుపెడుతోంది. ఎలాగైనా తమ ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రభుత్వాలు కూడా శాయశక్తులా పనిచేస్తున్నాయి.

ఇదంతా ఒక ఎత్తయితే గ్రామస్థాయిలో ఏం కాదులే అన్న నిర్లక్ష్యంతో వ్యవహరించే వారి తీరు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోందని చెప్పాలి. ముఖ్యంగా జనం ఎక్కువగా గుమిగూడి ఉండేందుకు అవకాశం ఉన్నవి నిత్యావసర వస్తువుల అమ్మకాలు సాగించే షాపులు. వీటి కారణంగా వైరస్ వ్యాప్తి జరుగుతుందనే ఆందోళనలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. కొందరు తమ వ్యాపారమే లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించడం లో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్న ఘటనలు కూడా ఉన్నాయి.

దేశం లో నమోదైన కేసులో దాదాపు 60 శాతానికి పైగా ఎలాంటి లక్షణాలు లేకుండా నమోదైన కేసులు కావడం ప్రస్తుతం సర్వత్రా ఆందోళనకు కారణం అవుతుంది. అంటే సదరు వ్యాధిలో రోగ కారక వైరస్ ఉంది..కానీ దాని లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు శరీరంలో పూర్తిగా కనిపించకుండా పోవడం లేదా అతి స్వల్పంగా మాత్రమే కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్న మాట.

ఇటువంటి పరిస్థితుల్లో గ్రామస్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా పోవడం చూస్తుంటే ఈ ప్రమాదాన్ని ఎదుర్కోడం ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏపీలో వాలంటరీలు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పలువురు వ్యాధి గ్రస్తులను ప్రారంభ దశలోనే గుర్తించగలిగారు. కానీ ప్రభుత్వం అందజేసే ఉచిత రేషన్, నగదు తదితర ప్రయోజనాలను ప్రజలకు అందించే క్రమంలో వాలంటరీ వ్యవస్థ సహకారం లభించినప్పుడు కేవలం ఆరోగ్య సిబ్బంది మాత్రమే సదరు కేసులను డీల్ చేయడంలో తగినంత సమయం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆరోగ్య, పంచాయతీరాజ్ అధికార యంత్రాంగం గ్రామస్థాయిలో షాపులు, తదితర ప్రాంతాల్లో నిత్యం పహారా నిర్వహించాలి.

ప్రజలు, వ్యాపారులతో చర్చించి వారిని కూడా కరోనా కట్టడి చర్యల్లో భాగస్వాములు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే వ్యాపారం చేసుకోవడమే లక్ష్యంగా భావిస్తున్న కొందరు కారణంగా ప్రమాదం ముంచుకు వచ్చేందుకు సిద్ధంగా ఉందని ఒప్పుకోవాల్సి అంశం. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం, శానిటేజర్లు వినియోగించేలా చూడడం వంటి వాటిపై షాపు యజమానుల భాగస్వామ్యంతోనే నిర్వహించడం కొంత వరకు ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ మరింత తీవ్రం కాకుండా అడ్డుకునేందుకు వీలవుతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp