ఆంక్షలున్నా ఆగని కరోనా

By Voleti Divakar Aug. 09, 2020, 05:10 pm IST
ఆంక్షలున్నా ఆగని కరోనా

అన్ లాక్ తరువాత కరోనా కట్టు తెగిన గోదావరిలా నేడు సామాజిక వ్యాప్తి దిశగా పయనిస్తూ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. భారతదేశంలో విలయ తాండవం చేస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ఆయా ప్రాంతాల పాలనా యంత్రాంగాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయినా తగిన ఫలితం కనిపించడం లేదు. కరోనా వైరస్ భారతదేశంలోకి ప్రవేశించిన తొలినాళ్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ చర్యల వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని కొంతవరకు నివారించగలిగారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై నెల 3వ వారంలో 44వేల పైగా కేసులు నమోదు కాగా, నెల వ్యవధిలోనే 2లక్షల కేసులకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా ఏపీ లో రోజుకు సుమారు 10వేల కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. రాజమహేంద్రవరం లాంటి నగరంలోనే రోజుకు అనధికారికంగా 10నుంచి 15 మరణాలు సంభవిస్తున్నట్లు సమాచారం. గతనెల రోజుల నుంచి తూర్పుగోదావరిలో ప్రతీ ఆదివారం జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అయినా కరోనా విజృంభణ ఆగడం లేదు.

తొలినాళ్లలో కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాలు ముందంజలో ఉండగా తాజాగా తూర్పుగోదావరి కరోనా కేసుల్లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. కరోనా రోజు రోజుకీ విశ్వరూపం చూపిస్తుండటంతో మొన్నటి వరకు ఒక వీధిలో కరోనా కేసు వస్తేనే భయాందోళనలతో ప్రజలు పరుగులు తీశారు. ఇప్పుడు ఒకే వీధిలో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో కరోనాతో సహజీవనానికి అలవాటుపడిపోతున్నారు. తొలి నాళ్లలో ఆసుపత్రులకు వెళ్లేందుకే భయపడిన జనాలు ఇప్పుడు తమకు ఎక్కడ వైరస్ సోకిందో తెలుసుకునేందుకు పరీక్షల కోసం పోటీలు పడుతున్నారు. అతి జాగ్రత్త పరులు ఇప్పటి వరకు పలుమార్లు పరీక్షలు చేయించుకోవడం గమనార్హం. వ్యాక్సిన్ వస్తే తప్పా.. కరోనాకు అడ్డుకట్ట పడేట్టులేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp