పార్టీ ఏదైనా ఏలూరు మేయర్ ఆమే ఎందుకు ?!

By Voleti Divakar Jul. 29, 2021, 12:00 pm IST
పార్టీ ఏదైనా ఏలూరు మేయర్ ఆమే ఎందుకు ?!

ఒక పార్టీ నాయకుడు మరో పార్టీలో చేరితే గతంలో ఉన్న స్థాయిని,పదవులను చేరుకునేందుకు ఎంతో ఓపికగా నిరీక్షించాల్సి రావచ్చు . కొన్ని సార్లు ఏళ్లు గడిచినా పూర్వవైభవం రాకపోవచ్చు . అయితే ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ విషయంలో ఈ సూత్రీకరణలన్నీ తేలిపోతున్నాయి . ప్రస్తుతం అధికార వైసిపి మేయర్ గా ఎంపికైన ఆమె 2014 లో ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం , తరుపున కూడా మేయర్ పదవిని నిర్వహించడం విశేషం .

రాజకీయ సమీకరణాలు , ఎమ్మెస్సార్ పెదబాబు , నూర్జహాన్ వ్యక్తిగత ఇమేజ్ కారణం అయినా ... ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీల్లోనూ మేయర్ పదవిని చేపట్టిన ఘనత బహుశా నూర్జహాన్ కే దక్కుతుందేమో,అదీ వరుసగా! . తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సిపి తరుపున 50 వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలిచి , రెండవసారి ఏలూరు మేయర్‌గా ఎంపికయ్యారు . రిజర్వేషన్ ప్రకారం ఈసారి మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు . అయితే వైసిపి అధిష్టానం బిసి వర్గానికి చెందిన షేక్ నూర్జహానన్ను ఎంపిక చేశారు . జూలై 30 వ తేదీన మేయర్ ఎంపిక లాంఛనంగా జరుగుతుంది .

నూర్జహాన్ దంపతులు వైసిపిలో ఎందుకు చేరారు ?
తెలుగుదేశం పార్టీలో మేయర్ పదవిని నిర్వహించిన సూర్జహాన్ ,షేక్ మూజుబర్ రెహ్మాన్(పెదబాబు) దంపతులు ఆపార్టీని వీడి వైసిపిలో ఎందుకు చేరారన్నది సర్వత్రా ఆసక్తిని కలిగించే అంశం . దివంగత టిడిపి మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జితో విభేదాల కారణంగానే పెదబాబు దంపతులు టిడిపిని వీడి , ఎన్నికల ముందు వైసిపిలో చేరారు .
2019 ఎన్నికల్లో పెదబాబు ఏలూరు అసెంబ్లీ సీటును ఆశించడంతో బుజ్జితో విభేదాలు ఏర్పడ్డాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి . దీంతో 2019 మార్చిలో అధికార వైసిపిలో చేరారు . ఏలూరు నుంచి ఆళ్ల నాని వైసిపి అభ్యర్థిగా ఉన్నారు . ఆయన గత ఎన్నికల్లో గెలిచి , ఆరోగ్యశాఖ మంత్రి అయ్యారు . ఈ నేపథ్యంలో పెదబాబు దంపతులకు రాజకీయంగా న్యాయం చేసేందుకు వైసిపి అధిష్టానం మరోసారి నూర్జహాన్ ను మేయర్ గా ప్రకటించినట్లు భావిస్తున్నారు .

రెండు పార్టీల్లోనూ ఆమే ఎందుకు ?
గతంలో తెలుగుదేశం , ఇప్పుడు వైఎస్సార్ సిపి పార్టీలోనూ వరుసగా రెండుసార్లు ఆమెనే మేయర్‌గా ఎంపిక చేయడం వెనుక కారణాలు ఏమిటన్నది ఇటు ప్రజల్లోనూ , అటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది . రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన భర్త పెదబాబు తోడ్పాటుతో 2014 లో రాజకీయ రంగంలోకి ప్రవేశించిన 43 వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన నూర్జహాన్ తెలుగుదేశం పార్టీ తరుపున మేయర్‌గా సేవలందించారు . ఆ ఎన్నికల్లో టిడిపి 47 డివిజన్లలో విజయం సాధించింది . అప్పుడు వైసిపి కేవలం 3 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం . అప్పుడూ , ఇప్పుడు కూడా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పెదబాబుకు ఏలూరులో ఉన్న ప్రజాభిమానం,రాజకీయ పరపతే కారణమని విశ్లేషిస్తున్నారు .

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరులో వైసిపి అభ్యర్థి ఆళ్ల నాని గెలుపునకు పెదబాబు కృషిచేశారు . మేయర్‌గా ఐదేళ్ల పాటు పనిచేసిన నూర్జహాన్ కోఆప్షన్ సభ్యుడైన తన భర్త పెదబాబు సహకారంతో ఏలూరు అభివృద్ధికి ఎంతో కృషి చేశారు . పెదబాబు ప్రతీరోజూ ఉదయమే సైకిల్ పై డివిజన్లలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషిచేశారు . ఈ దంపతులు తమ గౌరవ వేతనాన్ని కూడా వితరణ చేయడం విశేషం . రంజాన్ సందర్భంగా ఏలూరు , పరిసర ప్రాంతాల్లోని పేద ముస్లింలకు నగదు కానుకలు అందిస్తున్నారు . నీతినిజాయితీలతో పాటు , దాత్వత్వం , నగరాభివృద్ధి పై అంకితభావమే పార్టీలకు అతీతంగా ప్రజలు రెండుసార్లు నూర్జహాన్ ను మేయర్ పీఠంపై కూర్చోపెట్టారని చెప్పవచ్చు . *\

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp