మోడీ -బైడెన్ బంధం ఎప్పుడు ఎలా ఉందంటే..?

By Kalyan.S Sep. 25, 2021, 08:15 am IST
మోడీ -బైడెన్  బంధం ఎప్పుడు ఎలా ఉందంటే..?

ఇప్ప‌టికీ ప్ర‌పంచానికి పెద్ద‌న్న పాత్ర అమెరికాదే. అందుకే ఆ దేశంతో బంధం కోసం అన్ని దేశాలూ ఆరాట‌ప‌డ‌తాయి. ఆ క్ర‌మంలో భార‌త‌దేశం ఉన్న‌ప్ప‌టికీ అగ్ర‌రాజ్యం తీరును ఖండించిన సంద‌ర్భాలు కూడా చాలానే ఉన్నాయి. గ‌తం ఎలాగున్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఇరు దేశాలూ సంబంధ బాంధ‌వ్యాల‌ను మ‌రింత పెంచుకునే చ‌ర్య‌ల‌ను ప్రారంభించాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్‌ భారత ప్రధాని న‌రేంద్ర మోదీతో మొద‌టిసారి ప్ర‌త్య‌క్షంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి కీలక అంశాల‌పై చ‌ర్చించాయి. న‌రేంద్ర మోదీ ప్ర‌ధాని అయ్యాక అమెరికాతో స‌త్సంబంధాల‌నే కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ఏడు సార్లు అమెరికాలో ప‌ర్య‌టించి ఇరు దేశాల బంధాన్ని బ‌లోపేతం చేస్తున్నారు.

స్వాతంత్ర్యానికి పూర్వ‌మే..

స్వాతంత్ర్యానికి పూర్వ‌మే భార‌త నాయ‌కులు అమెరికాతో స్నేహపూర్వక సంబంధాలు కొన‌సాగిస్తున్న‌ప్ప‌టికీ.. జార్జి డబ్ల్యూ బుష్, మన్మోహన్ సింగ్ ల కాలం నుంచి బ‌ల‌ప‌డుతూ వ‌చ్చాయి. అప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ద్వైపాక్షిక విషయాలకే పరిమితమైన సంబంధాలు, వివిధ అంతర్జాతీయ అంశాలను చర్చించే స్థాయికి ఎదిగాయి. 1990 లలో, భారత్ తన విదేశాంగ విధానాన్ని ఏకధ్రువ ప్రపంచానికి అనుగుణంగా మలచుకుని అమెరికాతో సన్నిహిత సంబంధాలను పెంచుకుంది. ఇరవై ఒకటవ శతాబ్దంలో, భారతదేశం తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని వినియోగించుకుని తన సార్వభౌమ హక్కులను పరిరక్షించుకోడానికీ, బహుళ ధ్రువ ప్రపంచంలో జాతీయ ప్రయోజనాలను పెంపొందించుకోడానికీ ప్రయత్నించింది.

ఇరు దేశాల బంధంలో మైలురాళ్లు

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల పెరుగుదల, ప్రపంచ భద్రతా విషయాలపై సహకారం, గ్లోబల్ గవర్నెన్స్ (ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి) విషయాలపై నిర్ణయం తీసుకోవడంలో భారతదేశాన్ని చేర్చడం, వాణిజ్య, పెట్టుబడి వేదికలలో (ప్రపంచ బ్యాంక్, IMF, APEC) ప్రాతినిధ్య స్థాయిని పెంచడం, అణు సరఫరాదారుల సమూహంలో ప్రవేశానికి మద్దతు, సాంకేతిక భాగస్వామ్యంతో ఉమ్మడి-తయారీ కార్యక్రమం అభివృద్ధి మొదలైనవి భారత అమెరికా సంబంధాల్లో కీలకమైన మైలురాళ్ళుగా నిలిచాయి. మారాయి.

వాజ్ పాయి కాలంలో కొంత చీలిక‌

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్ర‌ధానిగా ఉన్న కాలంలో భారత అణు పరీక్షల త‌ర్వాత రెండు దేశాల సంబంధాల్లో కొంత చీలిక వ‌చ్చింది. పోఖ్రాన్‌లో అణ్వాయుధ పరీక్ష నిర్వ‌హ‌ణ‌ను అమెరికా తీవ్రంగా ఖండించింది, ఆంక్షలు విధించింది. పరీక్షలను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశంపై ఆర్థిక ఆంక్షలు విధించాడు. అన్ని సైనిక ఆర్థిక సహాయాలను తగ్గించడం, అమెరికన్ బ్యాంకులు ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ కంపెనీలకు రుణాలు స్తంభింపచేయడం, ఆహార కొనుగోలు మినహా భారత ప్రభుత్వానికి ఇచ్చే రుణాలన్నిటినీ నిషేధించడం, అమెరికన్ ఏరోస్పేస్ టెక్నాలజీ, యురేనియం ఎగుమతులను నిషేధించడం, అంతర్జాతీయ రుణ సంస్థలకు భారతదేశం చేసిన అన్ని రుణ అభ్యర్థనలను వ్యతిరేకించడం వంటి చర్యలకు పాల్ప‌డ్డాడు. కానీ.. అవేమీ భారతదేశ ఆర్థిక పెరుగుదలపై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయాయి. ఇతర దేశాలు మాత్రం భారత్‌తో వ్యాపారం కొనసాగించాయి. దీంతో అమెరికా కొన్నాళ్ల‌కే ఆంక్షలను ఎత్తివేసింది.

ఇబ్బందిపెట్టిన ట్రంప్ విధానాలు

మార్చి 2000 లో, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశాన్ని కూడా సంద‌ర్శించారు. ప్రధానమంత్రి వాజ్‌పేయితో ద్వైపాక్షిక, ఆర్థిక చర్చలు జరిపారు. అనంత‌రం అధ్య‌క్షుడు అయిన‌ ట్రంప్ విధానాలు భార‌త్ కు కొంత ఇబ్బందిక‌రంగా మారాయి. అమెరికన్లకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ట్రంప్ ఇతర దేశాల నుంచి అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వచ్చేవారి సంఖ్య తగ్గించడానికి ప్రయత్నించారు. హెచ్1బీ, హెచ్4 వీసా లాంటి తాత్కాలిక వర్క్ పర్మిట్లను సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయం వేలాది మందికి అమెరికాలో ఉద్యోగాలు రాకుండా, వర్క్ - స్టడీ ప్రోగ్రామ్స్ లో చేరలేకుండా చేసింది. బైడెన్ అధ్య‌క్షుడు అయిన త‌ర్వాత నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళ‌తం చేశారు.

మోదీ ప‌ర్య‌ట‌న‌తో మ‌రోసారి..

ఇప్పుడు తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌తో ఇరు దేశాల సంబంధాల‌పై మ‌రోసారి చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భారత్‌ తమకు అత్యంత కీలక భాగస్వామ్య దేశమని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేర్కొన‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. వ్యాక్సిన్‌ ఎగుమతులను తిరిగి ప్రారంభించాలనే భారత్‌ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రపంచాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడానికి ఇరుదేశాలు ఏళ్లుగా కలిపి పనిచేస్తున్నాయని, ప‌ని చేస్తూనే ఉంటాయ‌ని చెప్ప‌డంపై భార‌త్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యాక... మోదీతో ప్రత్యక్షంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. అమెరికా– భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం కావాలని కమల ఆకాంక్షించారు.

ఆస‌క్తిక‌ర చ‌ర్చ

ఇరుదేశాలు సహజ మిత్రులని భారత ప్రధాని మోదీ కూడా పేర్కొన్నారు. భారత్, అమెరికాలు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలని అన్నారు. విలువలు, ప్రాదేశిక రాజకీయ ఆసక్తులు ఒకటేన్నారు. ఇరుదేశాల సంబంధాలు నానాటికీ బలోపేతమవుతున్నాయన్నారు. సప్లయ్‌ చైన్స్, నూతన సాంకేతికతలు, అంతరిక్ష రంగాలపై మీకు ఆసక్తి ఎక్కువని తెలుసు... నాకూ కూడా వీటిపై ఎంతో ఆసక్తి ఉందని మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలిని ఉద్దేశించి అన్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ సంక్షోభ సమయంలో భారత్‌కు అమెరికా చేసిన సహాయాన్ని మరువలేమన్నారు. మీరు నిజమైన మిత్రుడిలా వ్యవహరించి అండగా నిలిచారని కొనియాడారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. మీరు భారత్‌కు రావాలని దేశ ప్రజలు ఎంతో కోరుకుంటున్నారని... తమ దేశానికి రావాలని కమలా హ్యారిస్‌ను ఆహ్వానించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp