పోలవరంలో అవినీతి జరగలేదంటే ఉండవల్లి, సోము ఏమంటారో..?!

By Voleti Divakar Jul. 03, 2020, 06:35 pm IST
పోలవరంలో అవినీతి జరగలేదంటే ఉండవల్లి, సోము ఏమంటారో..?!

పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని రికార్డు సంఖ్యలో విలేఖర్ల సమావేశాలు ఏర్పాటు చేసి ఆరోపణలు చేశారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని కూడా ఆయన ఎండగట్టారు. తాజాగా కేంద్ర జలశక్తి సంఘం పోలవరం, పట్టి సీమ ప్రాజెక్టుల్లో ఏమాత్రం అవినీతి జరగలేదని నాటి తెలుగుదేశం ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇచ్చిందని టిడిపి నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని ఉండవల్లి తాను చేసిన ఆరోపణలను ఎలా సమర్థించుకుంటారన్నది నేడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇందుకోసం ఎలాంటి ఆధారాలు చూపిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. బిజెపి నేతలు సోము వీర్రాజు, బిజెపి అప్పటి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు తదితరులు పోలవరం, పట్టిసీమ అవినీతి పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్పటికీ టిడిపి-బిజెపి పొత్తు కొనసాగుతుండటం గమనార్హం.

తాజాగా ఇటీవల జిల్లాను సందర్శించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణంలో జరిగిన అవినీతి పై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదని, ఇది టిడిపి అనుకూల మీడియా సృష్టిగా అభివర్ణించడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరం వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ కూడా గత చంద్రబాబునాయుడు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిధులను ఎటిఎంలా వాడుకుందని ధ్వజమెత్తారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ను ఆదుకునే చర్యల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి, పునరావాస ప్యాకేజీలకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కేంద్రంతో ప్రమేయం లేకుండా తనకు అనుకూలమైన సంస్థకు పోలవరం ప్రాజెక్టును కట్టబెట్టిందని, పునరావాస ప్యాకేజీలో కూడా భారీగా అవినీతి జరిగిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.

మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు వంటి నాయకులు ఎపి ప్రజల జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగిందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తేవారు. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల దిగువన ఉన్న గోదావరి డెల్టా ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తే పట్టిసీమ అవసరమే లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. పోలవరం, పట్టి సీమలో జరిగిన అవినీతి పై విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కాగ్ నివేదికను ప్రస్తావిస్తూ అప్పటి బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలోనే విచారణకు డిమాండ్ చేశారు.

ఆనాడు ఆరోపణలు చేసిన వీరంతా కేంద్ర జలశక్తి సంఘం ప్రకటన పై ఏ విధంగా స్పందిస్తారన్నదానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. పోలవరంపై ప్రధాని మోడీ ఆరోపణలను కూడా బిజెపి నాయకులు సమర్థించుకుని, ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp