Nara Lokesh - అడ్డంగా దొరికిపోయిన లోకేష్..!

By Ramana.Damara Singh Oct. 20, 2021, 09:00 pm IST
Nara Lokesh - అడ్డంగా దొరికిపోయిన లోకేష్..!

టీడీపీ నేతల కవ్వింపు.. రెచ్చగొట్టే తీరులో బూతుల పురాణాలు.. తర్వాత టీడీపీ కార్యాలయంపై దాడులు వెంటవెంటనే జరిగిన ఈ ఘటనలు రెండు రోజులుగా ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధాన్ని పతాక స్థాయికి చేర్చాయి. మాటల తూటాలు వదలడం, రెచ్చగొట్టడంలో తాను కూడా తక్కువ కాదని నిరూపించుకునేందుకు ఈ మధ్య కాలంలో తెగ ప్రయత్నిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తాజా ఘటనలకు సంబంధించి విపరీతంగా స్పందిస్తున్నారు. ఆవేశంతో రెచ్చిపోతున్నారు. ఆ క్రమంలోనే వైఎస్సార్సీపీ పైన, పోలీసులపైన మరో నాలుగు రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించబోయి బొక్కబోర్లా పడ్డారు. తానే అడ్డంగా బుక్కయ్యారు.

దాడి జరుగుతుందని ముందే ఎలా తెలుసు?

గత రెండు రోజుల ఘటనలపై తాజాగా స్పందించిన లోకేష్ టీడీపీ కార్యాలయంపై దాడి గురించి పోలీసులకు ముందే హెచ్చరించినా వారు స్పందించలేదని ఆరోపించారు. దాడి జరగడానికి 15 నిమిషాల ముందే తాము పోలీసులకు ఆ విషయం తెలియజేశామని, అయినా వారు పట్టించుకోలేదన్నారు. డీజీపీ కార్యాలయం మీదుగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు వచ్చి దాడికి పాల్పడ్డారని.. మళ్లీ ఆ మార్గంలోనే వెళ్లారని.. అందువల్ల ఇదంతా పోలీసులకు తెలిసే జరిగిందన్నట్లు మాట్లాడారు. లోకేష్ మాటలు ఒక సందేహాన్ని లేవనెత్తుతున్నాయి. అసలు దాడి జరుగుతుందన్న సమాచారం లోకేష్ కు ముందే ఎలా తెలిసింది. వైఎస్సార్సీపీ టీడీపీకి ప్రత్యర్థి పార్టీ.. అక్కడ జరుగుతున్న పరిణామాలను, ప్రణాళికలను ప్రత్యర్థి అయిన టీడీపీకి ఆ పార్టీవారు చెప్పే అవకాశం లేదు. కానీ లోకేష్ బాబుకు మాత్రం ఆ విషయం ముందే తెలిసిపోవడం ఆశ్చర్యంగా లేదూ! అంటే దీని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానించక తప్పడంలేదు.

Also Read : DGP Gowtham Sawang - డీజీపీ ఫోన్ కాల్ : అబద్దాలతో మరోసారి బుక్కయిన చంద్రబాబు

అధికార పార్టీ అనుమానాలే నిజమా!

మొదట టీడీపీ అధికార ప్రతినిధి బూతులతో సీఎంపై దూషణలకు దిగి కవ్వించడం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయంపైకి వెళ్లిన కొద్దిసేపటికే చంద్రబాబు సహా పార్టీ నేతలు అక్కడ వాలిపోయి గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు రాద్ధాంతం చేయడం.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేయడం.. అన్నీ టీడీపీ కుట్రలో భాగమేనని అధికార పార్టీ నేతలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రాన్ని, జగన్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి చంద్రబాబు పన్నిన కుట్ర అని అభివర్ణించారు. తాజాగా లోకేష్ చెప్పినదాన్ని బట్టి చూస్తే వైఎస్సార్సీపీ నేతల ఆరోపణలు, అనుమానాల్లో నిజం ఉందనిపిస్తోంది.

అధికారం లేక, ఎన్నికల్లో వరుస పరాజయాలతో తీవ్ర అసహనానికి గురవుతూ ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న చంద్రబాబు పార్టీ నేతల ద్వారా తిట్ల పురాణం వల్లింపజేసి వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చేశారని తెలుస్తోంది. టీడీపీ కార్యకర్తలతోనే వైఎస్సార్సీపీ ముసుగులో పార్టీ కార్యాలయంపై దాడి చేయించారన్న అనుమానాన్ని కూడా కొందరు వైఎస్సార్సీపీ నేతలు వ్యక్తం చేశారు. అందువల్లే దాడి జరుగుతుందన్న విషయం లోకేష్ 15 నిమిషాల ముందే చెప్పగలిగారని అంటున్నారు. తానేదో గొప్ప విషయం చెబుతున్నానన్న భావనలో పాపం లోకేష్ పరోక్షంగా అసలు విషయం చెప్పేసి అడ్డంగా దొరికేశారు.

Also Read : Sajjala Ramakrishna Reddy - పట్టాభి మాటలు కరెక్టేనా..? ప్రజలు ఆలోచించాలన్న సజ్జల

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp