ఆ ఇంటికి వెళ్లిన కార్యకర్త.... ఈ ఇంటికి రాకూడదట! టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడికి ఇంటి పోరు

By Voleti Divakar Jan. 20, 2021, 08:00 pm IST
ఆ ఇంటికి వెళ్లిన కార్యకర్త.... ఈ ఇంటికి రాకూడదట! టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడికి ఇంటి పోరు

ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అన్నట్లు ఉంది తెలుగుదేశం పార్టీ నేతల వైరం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు,మహానటుడు ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో జరిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, మాజీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ఆ తరువాత కొద్ది గంటల వ్యవధిలోనే మాజీ ఎమ్మెల్సీ,టీడీపీ నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మామగారు ఆదిరెడ్డి అప్పారావు ఇంటి నుంచి ఆ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు ఫోన్లు వెల్లువెత్తాయి.రూరల్ నియోజకవర్గ నాయకుడు నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లినందుకు కార్యకర్తలు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదిరెడ్డి వర్గం నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యే నాయకులు, కార్యకర్తలను కూడా గోరంట్ల ఎత్తి పొడుస్తూ మాట్లాడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజమహేంద్రవరం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబంతో గోరంట్ల బుచ్చయ్యచౌదరికి ఉన్న వైరంతో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన రాజకీయ కేంద్రమైన రాజమహేంద్రవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,నాయకులు నలిగిపోతున్నారు. చివరికి సీనియర్ నాయకుడు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ కూడా ఈ ఇద్దరు నేతల మధ్య ఇబ్బందులకు గురవుతున్నట్లు పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అమరావతి ఉద్యమ కార్యక్రమంలో కూడా కార్యకర్తలు ఇలాగే ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరు నేతలు ప్రత్యేక వర్గాలను పోషిస్తున్నారు. ఆదిరెడ్డి ద్వారా ప్రయోజనం పొందిన వారు విధిగా ఆయన కార్యక్రమానికే హాజరుకావాలన్నది నగర టీడీపీలో అలిఖిత నియమంగా మారిపోయింది.

ఒకప్పుడు ఆదిరెడ్డి అప్పారావు గోరంట్ల ప్రోత్సాహంతోనే నగరాధ్యక్ష పదవిని, ఆయన సతీమణి వీరరాఘవమ్మ మేయర్‌గా పనిచేశారు. ఆతరువాతి పరిణామాలలో కార్పొరేషన్లో పట్టుకోసం ఇరువురూ ప్రయత్నించడంతో గోరంట్ల, ఆదిరెడ్డిల మధ్య ఆధిపత్యపోరు సాగడంతో పార్టీలో ఇమడ లేక ఆదిరెడ్డి అప్పారావు వైసీపీలో చేరి ఎమ్మెల్సీ పదవిని కైవసం చేసుకున్నారు. కొంతకాలానికి ఆయన మళ్లీ టీడీపీలో చేరి, గోరంట్లను కాదని తన కోడలు భవానీకి రాజమహేంద్రవరం అసెంబ్లీ సీటును సాధించగలిగారు. అప్పటి నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, ఆదిరెడ్డి అప్పారావుకు మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులా మారాయి. రాజమహేంద్రవరంలో ఆధిపత్యం కోసం ఇద్దరు నాయకులు బహిరంగంగా పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు.

గోరంట్ల, ఆదిరెడ్డి పార్టీ కార్యక్రమాలను వేరువేరుగా నిర్వహిస్తూ పార్టీ ప్రతిష్టను తమదైన శైలిలో ఇనుమడింప చేస్తున్నారు.టీడీపీ అధికారాన్ని కోల్పోయినా నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంపై పార్టీ శ్రేణులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నాయి.తానే తన పీఏ చిటికెల సందీప్‌కు వినాయక విగ్రహానికి మలినం పూసిన సంఘటనపై సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో పెట్టాలని సూచించానని గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పష్టం చేశారు. గిల్లెట్ ఫోర్ ఎడ్జ్ బ్లేడు తెచ్చుకుని వైసిపి నాయకులు తెచ్చుకుని గీక్కోవాలని పరుషంగా మాట్లాడారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని సవాల్ విసిరారు.

గతేడాది సెప్టెంబర్ 12న రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి పంచాయితీ పరిధిలోని వెంకటగిరికి చెందిన టీడీపీ నాయకుడు బాబూఖాన్ చౌదరి ఇంటి ముందు ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మలినం చేశారు. ఈ విషయాన్ని చౌదరితో పాటు, సందీప్, బిజెపి నాయకులు కరుటూరి శ్రీనివాసరావు, అడపా వరప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాబూఖాన్ చౌదరితో పాటు, తన పీఏ సందీప్‌ను అరెస్టు చేయడంతో గోరంట్లలో సహనాన్ని కోల్పోయి తీవ్రస్థాయిలో పరుష పదజాలంతో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఆయన వాడిన భాష కాస్త అభ్యంతరకరంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp