తంబళ్ళపల్లిని తడిపిన హంద్రీ-నీవా - నీటి ప్రాజెక్టులు

By Krishna Babu Jan. 13, 2020, 07:24 pm IST
తంబళ్ళపల్లిని తడిపిన  హంద్రీ-నీవా  - నీటి ప్రాజెక్టులు

ఎక్కడి కృష్ణా ?ఎక్కడి పుంగనూరు?హంద్రీ - నీవా నా? హంద్రీలో ఎప్పుడన్నా నీళ్లు పారాయా?నీవా పేరుతో ఒక నది ఉందా? అన్న విమర్శలను పట్టించుకోకుండా కృష్ణా నీటిని హంద్రీ నుంచి నీవా పరివాహక ప్రాంతం వరకు ఇచ్చే ఉద్దేశ్యంతో మొక్కవోని దీక్షతో వైస్సార్ చేపట్టిన హంద్రీ-నీవా పథకం ద్వారా కృష్ణా నీరు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించడంతో హంద్రీ-నీవా ఫేజ్‌–2 సంపూర్ణం కావటం మరో నాలుగు అడుగుల దూరంలో ఉంది. కుప్పం వరకు నీళ్లు పారితే హంద్రీ-నీవా పూర్తయినట్లే.

రాయలసీమ సాగునీటి కష్టాలు తీర్చే బృహత్తర ప్రాజెక్టు హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్‌–1 ద్వారా ఆయకట్టుకు సాగునీరు ఇస్తామని, ఫేజ్‌–2లో చెరువులకు నీరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా చిత్తూరు జిల్లా తంబాలపల్లి మండలం పెద్ద తిప్ప సముద్రం(PTM) చెరువులోకి హంద్రినీవా జలాలు చేరాయి. తంబాళ్ల పల్లిలో మొత్తం 41,150 ఎకరాల ఆయకట్టు ఉంటే 0.25 టి.యం.సి కెపాసిటి కల PTM చెరువు కింద 4,685 ఎకరాలు ఆయకట్టు ఉంది .

Also Read: నీటి వాడకం మీద ఆంధ్రజ్యోతి విష ప్రచారం ఎందుకు? అనంతపురం రైతుల మీద కోపమా?

చిత్తూరు జిల్లాలో బాగా వెనకపడిన ప్రాంతమైన తంబళ్లపల్లి నియోజకవర్గంలోకి హంద్రీ-నీవా ద్వారా కృష్ణా నీరు ప్రవహించటంతో రైతులు, ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తాగు నీరుకే కటకటలాడే ప్రాంతానికి నీరు రావటంతో వారి కలలు వాస్తవ రూపం దాల్చాయి.

2004 లో వైఎస్సార్ శంకుస్థాపన చేసి మొదలు పెట్టిన హంద్రీ-నీవా పనులు ఆయన మరణంతో మందగించాయి. కిరణ్ కుమార్ రెడ్డి తన హయాంలో 2012లో అనంతపురం జిల్లా లోని జీడిపల్లి వరకు హంద్రీ-నీవా కాలువల్లో కృష్ణా నీరు తీసుకెళ్లారు. ఆ ఆతరువాత గత ఎనిమిది సంవత్సరాలలో హంద్రీ-నీవా పనుల్లో పెద్ద పురోగతి లేదు. చంద్రబాబు హయాంలో కొంత పనులు జరిగాయి కానీ లక్ష్యం సాధించే దిశగా వేగవంతంగా పనులు జరగలేదు.

మా ముఖ్యమంత్రి పేపర్ మీద గీతలు గీసినట్లు కాలువలు తీపిస్తున్నాడు, వీటిలో నీళ్లు పారతాయా ?అన్న జేసీ దివాకర్ రెడ్డి లాంటి నాయకుల అనుమానాలు ఇప్పటికే తీరాయి కానీ కుప్పం వరకు నీళ్లు పారించి గుమ్మడి కాయ కొట్టాలి అప్పుడే హంద్రీ-నీవా పూర్తి అయినట్లు.

ఇప్పటికే ఆలస్యం అయినా హంద్రీ-నీవా పనులను త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టు కుప్పం వరకు నీళ్లు ఇవ్వాలి. దీనితో పాటు పంటకాలువల పనులు కూడా చేపట్టాలి. కేవలం చెరువులను నింపటంతో వైస్సార్ కల,హంద్రీ-నీవా లక్ష్యం పూర్తి కావు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp