హైద‌రాబాద్ లో 151 ఏళ్ల క్రిత‌మే మున్సిప‌ల్ పాల‌న‌..!

By Kalyan.S Nov. 21, 2020, 08:32 am IST
హైద‌రాబాద్ లో 151 ఏళ్ల క్రిత‌మే మున్సిప‌ల్ పాల‌న‌..!

కొత్త కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ లు తెలుగు రాష్ట్రాల‌లో ఇంకా ఏర్పాట‌వుతూనే ఉన్నాయి. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లో 150 ఏళ్ల క్రిత‌మే మున్సిప‌ల్ పాల‌న అందుబాటులోకి వ‌చ్చింది. చారిత్ర‌క న‌గ‌రంలో పాల‌నాప‌రంగా కూడా ఎంతో చ‌రిత్ర దాగుంది. కుతుబ్ షాహీల వంశానికి చెందిన 5వ రాజు మ‌హ్మ ద్ కులీకుతుబ్ షా 1591లో భాగ్య‌న‌గ‌రం నిర్మించారు. 1869లో నాటి నిజాం న‌వాబు న‌గ‌రానికి మున్సిప‌ల్ పాల‌న‌ను ప‌రిచ‌యం చేశారు. నాటి నుంచి నేటి వ‌ర‌కూ పాల‌నాప‌రంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.

1933లో తొలి కార్పొరేష‌న్ ఎన్నిక‌లు

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో ప్ర‌స్తుతం 150 డివిజ‌న్ లు ఉన్నాయి. 2007 కు ముందు వంద డివిజ‌న్లు ఉండేవి. అయితే ఈ డివిజ‌న్ల సంస్కృతి నిజాం రాజుల కాలంలోనే ఆవిర్భ‌వించ‌డం గ‌మ‌నార్హం. నాడు ఇక్క‌డి ప్రాంతాల‌ను డివిజ‌న్లుగా విభ‌జించి పాల‌నా సౌల‌భ్యం కోసం ప్ర‌త్యేక బోర్డుల‌ను ఏర్పాటు చేశారు. 1860ల కాలంలో 55 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్న న‌గ‌రాన్ని నాలుగు భాగాలుగా విభ‌జించారు. మున్సిప‌ల్ , రోడ్డు నిర్వ‌హ‌ణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 1869లో మున్సిప‌ల్ పాల‌న ప్రారంభ‌మైన త‌ర్వాత మొద‌టి క‌మిష‌న‌ర్ గా స‌ర్ సాలార్ జంగ్ నియ‌మితులయ్యారు. న‌గ‌ర చీఫ్ మెజిస్ట్రేట్ కూడా ఆయ‌నే. అప్ప‌ట్లో హైద‌రాబాద్ బోర్డు, చాద‌ర్ ఘాట్ బోర్డులు ఉండేవి. జ‌నాభా 3.5 ల‌క్ష‌లు. 1886లో చాద‌ర్ ఘాట్ బోర్డు చాద‌ర్ ఘాట్ మున్సిపాలిటీగా రూపాంత‌రం చెందింది. 1921లోనే హైద‌రాబాద్ మునిసిపాలిటీ విస్తీర్ణం 84 చద‌ర‌పు కిలోమీట‌ర్ల‌కు విస్త‌రించింది. 1933లో రెండు బోర్డులూ విలీనం అయ్యాయి. అప్ప‌టి మున్సిప‌ల్ చ‌ట్టం ప్ర‌కారం హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఏర్పాటైంది. అదే ఏడాది తొలిసారి కార్పొరేషన్ ఎన్నిక‌లు జ‌రిగాయి.

1960లో ఎంసీహెచ్ ఏర్పాటు

1869లో మొద‌లైన మున్సిప‌ల్ పాల‌న కాల‌క్ర‌మంలో హైద‌రాబాద్ లో పెరుగుతూ వ‌చ్చింది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాట‌వుతూ వ‌చ్చాయి. 1937లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల‌ను క‌లిపి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ ఆవిర్భ‌వించింది. 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. ఆరేళ్ల పాటు సికింద్రాబాద్ లో మున్సిప‌ల్ పాల‌న కొన‌సాగింది. అనంత‌రం 1951లో దానికి కార్పొరేష‌న్ హోదా వ‌చ్చింది. దీంతో హైద‌రాబాద్ తో పాటు సికింద్రాబాద్ కూడా కార్పొరేష‌న్ గా మారింది. హైద‌రాబాద్, సికింద్రాబాద్ రెండూ వేర్వేరు కార్పొరేష‌న్ లుగా తొమ్మిదేళ్లు కొన‌సాగాయి. ఆగ‌స్టు 3, 1960లో రెండు కార్పొరేష‌న్ ల‌నూ క‌లిపి హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (ఎంసీహెచ్) గా ఏర్పాటైంది. అప్ప‌ట్లో దీని ప‌ద‌వీ కాలం నాలుగేళ్లు ఉండేది. 1951 నుంచి 1960 వ‌ర‌కూ 66 వార్డులు ఉండేవి. ఆ త‌ర్వాత వార్డుల సంఖ్య 94కు పెర‌గ‌గా.. 1970 వ‌ర‌కూ అవే కొన‌సాగాయి. 1986లో మ‌రో నాలుగు వార్డులు చేర‌డంతో మొత్తం సంఖ్య 100కుచేరింది.

ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీగా...

హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్.. 2007లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ గా ఆవిర్భ‌వించిం‌ది. 625 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో భారీ కార్పొరేష‌న్ గా రూపాంత‌రం చెందింది. వార్డుల సంఖ్య 150కు చేరింది. వార్డుకు 40 వేల నుంచి 49 వేల జ‌నాభా ఉండేలా రూపొందించారు. 2009లో గ్రేట‌ర్ తొలి ఎన్నిక‌లు జ‌రిగాయి. మొట్ట‌మొద‌టి సారిగా ఈవీఎం ఓటింగ్ నిర్వ‌హించారు. తొలి ఎన్నిక‌లో 3,610 మంది నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. చివ‌ర‌కు ఎన్నిక‌ల బ‌రిలో 1300 మంది నిలిచారు. గ్రేట‌ర్ తొలి పీఠాన్ని కాంగ్రెస్ కైవ‌సం చేసుకుంది. నాడు ఎంఐఎం పొత్తుతో కాంగ్రెస్ నుంచి బండ కార్తీక‌రెడ్డి తొలి మేయ‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అంచ‌లంచెలుగా విస్త‌రించిన మ‌హా న‌గ‌రంలో మ‌ళ్లీ ఇప్పుడు గ్రేట‌ర్ ఎన్నిక‌ల కోలాహ‌లం క‌నిపిస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం రెండో సారి జ‌రుగుతున్న ఎన్నిక‌లివి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp