మూడేళ్ళలో ఇండియా లో హై స్పీడ్ రైళ్లు

By Voleti Divakar Jul. 08, 2020, 09:16 pm IST
మూడేళ్ళలో ఇండియా లో  హై స్పీడ్ రైళ్లు

భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రపంచస్థాయి వేగం, సౌకర్యాలు అందించేందుకు రైల్వేశాఖ ప్రాధాన్యమిస్తోంది. ప్రైవేటీకరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే తేజస్ రైళ్లను ప్రవేశ పెట్టారు. అలాగే కొన్ని ప్రధాన స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. తాజాగా దేశంలోని 109 రూట్లలో ప్రైవేటు రైళ్లను నడిపేందుకు ఆసక్తి గల సంస్థలను ఆహ్వానిస్తూ రైల్వేశాఖ బిడ్లను ఆహ్వానించింది. అయితే ఈ తంతు పూర్తయ్యేందకు మరో మూడేళ్ల సమయం పడుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.

హైస్పీడ్ రైళ్లను12 క్లస్టర్లలో నడుపుతారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్ క్లస్టర్ పరిధిలోని సికింద్రాబాద్-శ్రీకాకుళం, సికింద్రాబాద్-తిరుపతి, గుంటూరు-సికింద్రాబాద్, గుంటూరు-కర్నూలు, తీరుపతి వయా సికింద్రాబాద్-వారణాసి, సికింద్రాబాద్-ముంబయ్, విశాఖపట్నం-విజయవాడ, విశాఖపట్నం-బెంగుళూరు, హౌరా- సికింద్రాబాద్ మధ్య నడపాలని ప్రతిపాదించారు.

అలాగే దేశంలోని అన్ని ప్రధాన నగరాలను కలిపే విధంగా హైస్పీడ్ రైళ్లు నడపాలని ప్రతిపాదించారు. ఈ రైళ్లలో గరిష్టంగా 16, కనిష్టంగా 12 ఆధునాత బోగీలు ఉంటాయి. ప్రైవేటు రైళ్లు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. ప్రస్తుతానికి 35ఏళ్ల పాటు భారతీయ ట్రాక్ లను ప్రైవేటు రైళ్లకు లీజుకు ఇస్తారు. ఇందుకు గాను కాంట్రాక్టు పొందిన సంస్థలు ఆయా కాలమానం ప్రకారం ఇంధన చార్జీలు, స్థూల ఆదాయంలో వాటాతో పాటు, భారతీయ రైల్వేలకు స్థిర చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో హైస్పీడ్ రైళ్లలో చార్జీలు కూడా భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హైస్పీడ్ రైలు బోగీలను వేగానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తారు. ఈ రైళ్లను ఆయా సంస్థలే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే రైళ్ల నిర్వహణ, ఇతర వ్యయాన్ని ప్రైవేటు సంస్థలే భరించాల్సి ఉంటుంది. డ్రైవర్, గార్డు మాత్రం రైల్వేశాఖకు చెందిన వారు ఉంటారు. ప్రైవేటు రైళ్ల ద్వారా భారతీయ రైల్వేలకు ఏడాదికి రూ. 30వేల కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆధునాతన క్వాంటమ్ జంప్ టెక్నాలజీతో ఈరైళ్లు నడుస్తాయి.

రైళ్ల రాకపోకల్లో సమయా భావాన్ని కచ్చితంగా పాటించడం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడమే లక్ష్యంగా ప్రైవేటు హైస్పీడ్ రైళ్లను ప్రవేశ పెడుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ప్రైవేటు రైళ్ల ప్రవేశంతో భారతదేశంలో రైల్వే ప్రయాణ తీరే మారిపోతుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణీకులకు సేవలు, వేగం తదితర అంశాల్లో ప్రైవేటు సంస్థల మద్య పోటీ ఏర్పడటమే ఇందుకు కారణం. రైళ్ల రాకపోకలు, ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడం తదితర అంశాల్లో రైలేశాఖ ప్రామాణిక ప్రగతిశీల నివేదికలను రూపొందిస్తుంది. దీంతో ఆయా సంస్థల మధ్య పోటీ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఆ ప్రభావం రైల్వేశాఖ ఆధీనంలోని రైళ్లపై కూడా పడి, రైల్వే వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp