మరో టీడీపీ నేత కేసులో హైకోర్ట్ స్టే..

By Raju VS Sep. 16, 2020, 08:37 pm IST
మరో టీడీపీ నేత కేసులో హైకోర్ట్ స్టే..

ఇటీవల ఏపీ హైకోర్ట్ పలు అంశాలలో వరుసగా స్టే ఇస్తోంది. అందులో 10 మంది మరణానికి కారణమయిన డాక్టర్ రమేష్ ఆస్పత్రి నిర్వాహకుల మీద విచారణ నుంచి చనిపోయిన వారి పేర్లతో కూడా సొమ్ము చేసుకున్న టీడీపీ నేత కేసు వరకూ అనేకం ఉన్నాయి. అంటే సామాన్యుల చావులకు కారణమయిన నిందితుల మీద చర్యలు వద్దని, చివరకు చనిపోయిన వాళ్ల పేర్లతో అక్రమాలకు పాల్పడిన వారిపై కూడా విచారణ వద్దని చెప్పడం విడ్డూరంగా మారింది. ఇప్పటికే డాక్టర్ రమేష్ ఆస్పత్రి నిర్వాహకంలో హైకోర్ట్ తీర్పుని సుప్రీంకోర్ట్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

ఇక తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో బరిలో దిగిన వరుపుల రాజా అంతకుముందు టీడీపీ పాలనలో డీసీసీబీ చైర్మన్ గా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన లీలలు అన్నీ ఇన్నీ కావు. అందులో అనేకం ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. అందులో ఆయన సొంత గ్రామ పరిధిలోని వ్యవసాయ సొసైటీలో సాగించిన అక్రమాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. చనిపోయిన రైతుల పేర్లతో రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన భాగోతం బయటపడింది. లంపకలోవ సొసైటీలో 2018 మే 11 నుంచి 2019 జూలై 30 మధ్య కాలంలో నిధులు అడ్డంగా దోచేశారంటూ వచ్చిన విమర్శలతో విచారణ చేస్తే పలు ఆధారాలు లభించాయి. సొసైటీ పరిధిలో 5050 మంది సభ్యులలో రుణాలు పొందిన సుమారు 4000 మంది సభ్యులను సుమారు రెండు నెలల పాటు విచారించిన మీదట నిధుల దుర్వినియోగాన్ని నిర్థారించారు. ఆ క్రమంలోనే మరణించిన రైతుల పేర్లతో రుణాలు కాజేసిన తీరుతో అధికారులు కూడా అవాక్కయ్యారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో సహకార రంగాన్ని భ్రష్టు పట్టించి కోట్లు కొట్టేసిన ప్రబుద్ధుల వ్యవహారం కారణంగా రైతులకు అపారనష్టం జరిగినట్టు తేటతెల్లమయ్యింది. అందులో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, మృతుల పేర్లతో ఉన్న పాస్‌పుస్తకాలు తనఖా పెట్టడం, బినామీ ఆస్తులను కుదువ పెట్ట డం ద్వారా సహకార రంగానికి చెదలు పట్టించినట్టు ఆధారాలు లభించాయి. ఆ క్రమంలో అతి పెద్ద స్కామ్ కి సహకరించిన పలువురు అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. కేవలం సొంత గ్రామంలోని సొసైటీతో సరిపెట్టకుండా జిల్లాలోని ఆత్రేయపురం, వద్దిపర్రు సహా పలు సొసైటీలలో వరుపుల రాజా బృందం ఇలాంటి అక్రమాలకు అడ్డగొలుగా సిద్ధపడినట్టు నిర్ధారణకు వచ్చారు. చివరకు భూమి లేని వ్యవసాయ కూలీలను కూడా రైతులుగా చూపించి వద్దిపర్రులో రూ. 1.50 లక్షలు కాజేసినట్టు రుజువయ్యింది.

కేవలం లంపకలోవ పీఏసీఎస్‌లోనే ఏకంగా రూ.16 కోట్లు పైనే కాజేసిన వైనం కలకలం రేపింది. ఈ సొసైటీలో రూ.16,47,59,023 దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యవహారంలో నాటి సొసైటీ అధ్యక్షుడుగా ఉన్న డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజాతోపాటు మరో నలుగురిపై ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. రాజాతో పాటు ఇద్దరు మాజీ సీఈఓలు, మాజీ బ్రాంచి మేనేజర్లపై పెద్దాపురం డివిజనల్‌ కో ఆపరేటివ్‌ ఆఫీసర్‌ రాధాకృష్ణారావు పోలీసుల కు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఏపీ సహకార చట్టం 1964 ప్రకా రం 51 విచారణ పూర్తి చేసి తదుపరి చర్యలకు పూనుకుంటున్న సమయంలో రాజా కి అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. దాంతో ఆయన నియోజకవర్గం నుంచి పరారయ్యారు.

కొన్ని రోజులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న ఆయనకు చివరకు హైకోర్ట్ తీర్పుతో ఊరట లభించింది. ఆయన కేసులో తదుపరి చర్యలకు కోర్టు అడ్డంకి వేసింది. తాత్కాలికంగా స్టే విధించడంతో వరుపుల రాజా ప్రత్తిపాడులో అడుగుపెట్టగలిగారు. అయితే ఈ కేసు ని ఎక్కువ కాలం స్టేలతో గడపడం సాధ్యం కాదని న్యాయనిపుణులు భావిస్తున్నారు. పక్కా ఆధారాలున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీస్సులతో తప్పించుకునే ప్రయత్నం చేసినా ఎక్కువ కాలం చెల్లకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp