పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కిపునకు గ్రీన్‌సిగ్నల్‌

By Raju VS Sep. 16, 2021, 12:08 pm IST
పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కిపునకు గ్రీన్‌సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ప్రక్రియ లో ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 1న ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఏప్రిల్‌ 8న రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగింది. అయితే ఎన్నికల కోడ్ నిబంధన పేరుతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి మే 21న తీర్పునివ్వడం తో సందిగ్ధంలో పడింది. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్‌ విధించాలని స్పష్టంచేసింది.

సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎస్‌ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఓట్ల లెక్కింపునకు పచ్చజెండా ఊపుతూ ఈరోజు తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

కోర్టు తీర్పు నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం ఎస్ ఈ సి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఐదు నెలలు పైగా బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచారు. తాజా తీర్పుతో ఆటంకాలు తొలగినందున ఇక ఓట్ల లెక్కింపు పూర్తి చేసి విజేతలను ప్రకటించే ప్రక్రియ మొదలవుతుంది. సుమారు మూడేళ్ళుగా పాలనా బాధ్యులు లేని స్థానిక సంస్థలు జిల్లా, మండల పరిషత్ లకు కొత్త నేతలు సారధ్యం వహించేందుకు రంగం సిద్ధమైందని చెప్పవచ్చు.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp