అప్పుడు నందిగ్రామ్.. ఇప్పుడు భవానీపూర్

By Ramana.Damara Singh Sep. 15, 2021, 09:00 pm IST
అప్పుడు నందిగ్రామ్.. ఇప్పుడు భవానీపూర్

పశ్చిమ బెంగాల్ మరోసారి దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలోకి దిగడమే దీనికి కారణం. రాష్ట్రంలో మూడు నియోజకవర్గాలకు.. భవానీపూర్, సంషేర్ గంజ్, జంగిపూర్లలో ఈ నెల 30న ఎన్నికలు జరగనుండగా మమతా దీదీ పోటీ చేస్తున్న భవానీపూర్ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. గత మార్చి, ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిని మమత ఢీకొట్టినప్పుడు తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులే ఇప్పుడు భవానీపూర్ లో పునరావృతం అవుతున్నాయి. అప్పుడే రాజకీయ దాడులు, ఉద్రిక్తతలు, ఫిర్యాదులు మొదలు కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా నియోజకవర్గంలో నిఘా, భద్రత పెంచింది.

దాడులతో అప్పుడే ఉద్రిక్తత

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చినా నందిగ్రామ్ లో మమత ఓడిపోయారు. రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటుతో సీఎం పదవి చేపట్టిన ఆమె ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నికవ్వాలన్న నిబంధన మేరకు ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి పోటీకి నామినేషన్ వేశారు.

మరోమారు దీదీని అడ్డుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ ప్రియాంక టిబ్రేవాల్ అనే మహిళా న్యాయవాదిని రంగంలోకి దించింది. దాంతో భవానీపూర్లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి అర్జున్ సింగ్ ఇంటిపై వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు బాంబు దాడులు జరిగాయి. తృణమూల్ కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తనకు టీఎంసీ నుంచి ప్రాణహాని ఉందని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో ఎన్నికల సంఘం అప్రమత్తం అయ్యింది.

నియోజవర్గంలో నిఘా పెంచడంతో పాటు కేంద్ర బలగాలను మోహరించాలని నిర్ణయించింది. 52 కంపెనీల సాయుధ బలగాలను రాష్ట్రానికి పంపాలని ఆలోచిస్తోంది. ఇప్పటికే 20 కంపెనీలు చేరుకున్నాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి ప్రియాంక అప్పుడే మమతపై న్యాయపరమైన యుద్ధం ప్రారంభించారు. నామినేషన్ తోపాటు సమర్పించిన అఫిడవిట్లో మమత తనపై ఉన్న క్రిమినల్ కేసుల గురించి పేర్కొనలేదని.. అందువల్ల ఆమె నామినేషన్ తిరస్కరించాలని ఆమె ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

మొన్నటి ఉద్రిక్తతలు చల్లారక ముందే..

ఐదు నెలల క్రితం జరిగిన బెంగాల్ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లోని పాలక పార్టీలు బీజేపీ, తృణమూల్ హోరాహోరీగా తలపడ్డాయి. రెండు పార్టీలు సర్వశక్తులను అక్కడే కేంద్రీకరించడంతో రాష్ట్రం రణరంగంగా మారింది. దాడులు, హింస చోటుచేసుకున్నాయి. ఎన్నికల సంఘం కేంద్ర సాయుధ బలగాలతో రాష్ట్రాన్ని నింపేసినా హింసను అడ్డుకోలేకపోయింది. పోలింగ్ రోజులతో పాటు.. ఫలితాలు వెల్లడైన తర్వాత అల్లర్లు, దాడులు, ఆస్తుల విధ్వంసం, హత్యలు విచ్చలవిడిగా జరిగాయి. ఎన్నికల అనంతర హింసలో కనీసం 10 మంది మరణించారు. వీటిపై కలకత్తా హైకోర్టులో విచారణ కూడా జరుగుతోంది.

భవానీ పూర్ బీజేపీ అభ్యర్థి ప్రియాంకే ఈ కేసుల్లో బాధితుల తరఫున వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న భవానీపూర్ ఉప ఎన్నికలో మమత విజయం ఖాయమే అయినా.. ఆమెను అడుగడుగునా అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నించకుండా ఉండదు. దాంతో నందిగ్రామ్ పరిస్థితే ఇక్కడా పునరావృతం అవుతుందేమోనన్న ఆందోళన అక్కడి ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp