Helicopter Accident, Sai Teja, Madanapalli - హెలికాప్టర్ మృతుల్లో తెలుగు అధికారి, మదనపల్లిలో విషాదం

By Raju VS Dec. 08, 2021, 09:45 pm IST
Helicopter Accident, Sai Teja, Madanapalli - హెలికాప్టర్ మృతుల్లో తెలుగు అధికారి, మదనపల్లిలో విషాదం

భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ మరణం దేశమంతా విషాదం నింపింది. తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆయన చనిపోయినట్టు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారికంగా ప్రకటించింది. అదే ప్రమాదంలో బిపిన్‌ రావత్‌తో పాటుగా ఆయన భార్య మధులిక మరో 11 మంది చనిపోయినట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ మృతుల్లో ఏపీకి చెందిన లాన్స్ నాయక్‌ ఒకరు ఉండడం మదనపల్లెలో విషాదం నింపింది.


ఏపీకి చెందిన సాయితేజ్ అదే హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామం. సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్వహిస్తున్నారు. 2013లో ఆర్మీలో చేరిన సాయితేజ్ స్వల్ప కాలంలోనే మంచి గుర్తింపు సాధించారు. కీలక స్థాయికి వెళ్లారు. ఆకాశమార్గంలో నేరుగా శత్రుస్థావరాలకే వెళ్లి, వారిని మట్టి కరిపించే పారా ట్రూపర్‌గా ఎదిగారు.

పారా కమాండోగా కఠోర శిక్షణ పొందిన సాయి తేజ్ కొత్తగా వచ్చే పారా కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరారు.ఆయనలోని శక్తిసామర్థ్యాలను గుర్తించిన బిపిన్‌ రావత్‌ తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు. ప్రస్తుతం సిక్కింలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌కి అత్యంత చేరువగా విధులు నిర్వహించేందుకు అవకాశం దక్కడం విశేషం.

ఈ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌తో పాటుగా సాయితేజ్ కూడా మరణించడం కుటుంబీకులను కలచివేసింది. ఘటన సమాచారం అందుకున్న సాయితేజ్ భార్య చెన్నై బయలుదేరారు. సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చివరిసారిగా మొన్నటి వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. గ్రామంలో అందరితో చనువుగా ఉండే సాయితేజ్ విధి నిర్వహణలో కూడా చిత్తశుద్ధి ప్రదర్శించడం వల్లనే మంచి గుర్తింపు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.


సాయితేజ్ మృతికి పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా పలువురు నేతలు ఆయనకు నివాళి ప్రకటించారు.

Also Read : Bipin Rawat - సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp